అక్షర మూవీ రివ్యూ

Published On: February 27, 2021   |   Posted By:

అక్షర మూవీ రివ్యూ

అరకొర..:’అక్షర’ మూవీ రివ్యూ
Rating:2/5

పిల్లల భవిష్యత్ బాగుండాలనే ప్రతీ అమ్మా,నాన్నకు ఉండే  బలహీనతను పట్టుకుని  క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో పెద్ద బిజినెస్సే బయిట సాగుతోంది. సామాజిక సేవగా చెయ్యాల్సిన విద్యా దానాన్ని ఒక బిజినెస్ సోర్స్ గా మార్చేసి ,విపరీత ధనార్జనే ధ్యేయంగా సాగే కార్పోరేట్ ప్రపంచంలో మనమంతా ఉన్నాం. ఏం చెయ్యలేని నిశ్శహాయితతో దిక్కులు చూస్తున్నాం. ఇదే విషయాన్ని చర్చిస్తూ అక్షర మన ముందుకు వచ్చింది. అయితే ఇది ఓ సామాజికాంశం. ఇలాగే తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది కానీ సినిమా కాదు..డబ్బులు రావు. మరేం చేయాలి. కామెడీ,రొమాన్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కలపాలి. అయితే సీరియస్ గా సాగే సామాజికాంశానికి , ఇలాంటి కమర్షియల్ జిమ్మక్కులు బ్లెండ్ చేస్తే కలుస్తాయా..అసలు ఈ సినిమా కథేంటి…చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరై లైన్

ఎంఎస్సీ ఫిజిక్స్ చదివిన అక్షర (నందిత శ్వేత) కు విశాఖపట్నంలో ఓ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వస్తుంది. దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడైన శ్రీతేజ (శ్రీతేజ్)… అక్షరతో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత  ప్రేమలో పడతాడు. అదేసమయంలో అక్షర ఉండే కాలనీలో ముగ్గురు కుర్రాళ్లు కూడా ఆమె చుట్టూ ప్రదక్షణలు చేస్తూంటారు. ఓ రోజు శ్రీజ దైర్యం చేసి అక్షరను ఒక చోటికి తీసుకెళ్లి తన ప్రేమ గురించి చెప్పబోతాడు. అప్పుడే ఓ అనుకోని సంఘటన జరుగుతుంది. ఊహించని విధంగా ఆమె అతణ్ని ఆమె కాల్చి చంపేస్తుంది. అది ఆమె వెనక పడ్డ ముగ్గురు కుర్రాళ్లు చూసి షాకవుతారు. అప్పటిదాకా ఎంతో కూల్ గా ఉన్న అక్షర అంత దారుణానికి ఎలా ఒడిగట్టింది.. అసలు ఆమె ఎవరు… తన ప్లాష్ బ్యాక్ ఏమిటి.. ఆ హత్య ఎందుకు చేసింది. హత్య  తర్వాత ఆమె జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది అన్నది మిగతా కథ.


స్క్రీన్ ప్లే ఎనాలసిస్

వాస్తవానికి ఇలాంటి సినిమాల నుంచి …బలవంత నిర్భంధ కళాశాల విద్యను నేర్పించే సమకాలీన కార్పొరేట్ విద్యా మాఫియాను ప్రేక్షకుడు ముందు బట్టలూడదీసి నిలబెడతాడు అని ఆశిస్తాము. ఆ కార్పొరేట్ మాఫియాతో పాటు కలిసిన న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, రాజకీయ శక్తులు ఏ విధంగా భావి భారత పౌరుల బంగారు కలలను తుంచేస్తున్నాయో విశ్లేషణాత్మకంగా చర్చిస్తాడని ఎక్సపెక్ట్ చేస్తాం. తీసుకున్న పాయింటు, దాన్ని సమస్యాత్మకంగా గుర్తించిన తీరు, దానికి పరిష్కారం చూపిన తీరు అన్నీ బాగున్నాయి. అయితే దాన్ని డీల్ చేసిన విధానమే సూదుల్లా గుచ్చుకుని వేధిస్తాయి. ఇలాంటి కథల్లో ఒక సమస్యని తొవ్వుకుంటూ ఎంత లోతుకెళ్ళగలిగితే ఇంత అద్భుతంగా ఆవిష్కరించగలరు. సమస్య మూలాలకెళ్లడమే గాదు తన పరిధి మేరకు తను సూచించగలిగిన పరిష్కారమార్గం కూడా ప్రేక్షకుడుకి అర్థమవుతుంది.

సినిమాకు మంచి పాయింట్ నే పట్టుకున్నారు కానీ అందుకు తగ్గ స్క్రిప్టు వర్క్ చేయలేదనిపిస్తుంది. అవగాహనా రాహిత్యం అడుగడుగునా కనిపిస్తుంది. ‘‘విద్య అనేది ప్రాథమిక హక్కు. దాన్ని డబ్బుతో కొనడం తప్పు’’ అనే పాయింట్ ని థ్రిల్లింగ్ గా చెప్పాలనే ఆలోచన దగ్గరే ఈ కథ ఇరుక్కుపోయింది. అనవసరమైన బిల్డప్ లు, అక్కర్లేని కామెడీ కథలోకి వచ్చేసాయి. ఇలా సామాజిక అంశాలను భుజాన వేసుకునే కథలు శంకర్ స్టైల్లో చెప్పగలిగాలి. లేదా మహర్షిలా స్టార్స్ ఇదో భాధ్యతగా భావించి చెప్పాలి. అంతేకానీ మనకు తోచినట్లు చేసుకుంటూ పోతే ఇలాగే బోర్ కొట్టే బొమ్మై కూర్చుంటుంది.

 సినిమా ప్రారంభంలోనే ఒక కార్పొరేట్ కాలేజీ మేడ పైనుంచి పడి ఓ అమ్మాయి సూసైడ్ చేసుకోవటం… తర్వాత హీరోయిన్  ఆ కాలేజీలో లెక్చరర్ గా చేరి అందరితో కలిసి పోవడం.. ఆ విద్యా సంస్థ డైరెక్టర్ తో సన్నిహితంగా మెలగడం చూస్తూంటే..ఈమె వెనుక ఖచ్చితంగా ఓ ప్లాష్ బ్యాక్ తొంగి చూస్తుందని అర్దమవుతుంది. ఇంటర్వెల్ దగ్గర ఆ పాయింట్ రివీల్ చేస్తారని, అక్కడ నుంచే కథ ప్లాష్ బ్యాక్ వైపు టర్న్ తీసుకుంటుందని ఎన్నో తెలుగు సినిమాలు చూసే సగటు ప్రేక్షకుడు పసిగట్టేస్తాడు. అలా చాలా ఈజీగా అర్దమయ్యే సీన్స్ తో సినిమా రాసుకుంటే ఇంక థ్రిల్లింగ్ ఏముంటుంది. దాన్ని థ్రిల్లర్ అని ఎలా అనగలం. పోని ఆ ప్రెడిక్టుబుల్ సీన్స్ అయినా ఇంట్రస్టింగ్ గా నడిపాడా అంటే నవ్వురాని కామెడీతో కాలక్షేపం చేసారు. దాంతో ఓ మంచి ఉద్దేశ్యంతో మొదలైన ఈ సినిమా మసాలా ఎక్కువై మాడిపోయినట్లైంది.

ఏదైమైనా తల్లిదండ్రులకు నచ్చచెప్పలేక కార్పొరేట్ శక్తులకు లొంగలేక మానసిక సంఘర్షణతో దిక్కు తోచని అయోమయంలో అర్థంతరంగా తనవు చాలించే పసిమొగ్గలని గుర్తించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిందీ సినిమా. అక్కడదాకా మనం మెచ్చుకోవాల్సిన విషయం.అలాగే ఇది సినిమా కాబట్టి ముగింపు ఉండాలి కాబట్టి ఒక పరిష్కారం దొరికింది గానీ నిజ జీవితంలో ఒక పరిష్కారమంటూ దొరికే సమస్య కాదు.

టెక్నికల్ గా…

సాంకేతికంగానూ ఈ సినిమా సోసోగా ఉంది. సురేష్ బొబ్బిలి సంగీతం నథింగ్ స్పెషల్. పాటలు జస్ట్ ఓకే.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నామ మాత్రం. నరేష్ బానెల్ కెమెరావర్క్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.  డైలాగులు కొన్ని ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తాయి. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను చక్కగా చూపించే ప్రయత్నం చేసారు. గిదుటూరి సత్య ఎడిటింగ్‌ కష్టమనిపిస్తుంది.

చూడచ్చా…
ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా అయితే ఓకే.

ఎవరెవరు..
నటీనటులు : నందిత శ్వేత, శకలక శంకర్‌, అజయ్‌ ఘోష్‌, మధునందన్, సత్య, హర్షవర్థన్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : సినిమా హాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాత : అల్లూరి సురేశ్‌ వర్మ, అహితేజ బెల్లంకొండ
దర్శకత్వం : బి. చిన్నికృష్ణ
సంగీతం : సురేశ్‌ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : నరేశ్‌ బానెల్లి
రన్ టైమ్:2 గంటల 15 నిమిషాలు
విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021