అమీర్ పేట్ టు అమెరికా మూవీ రివ్యూ

Published On: April 12, 2018   |   Posted By:
అమీర్ పేట్ టు అమెరికా మూవీ రివ్యూ
నటీనటులు – తేజస్, వంశీ కోడూరి, వైవా హర్ష, వంశీకృష్ణ, పల్లవి డోరా, సాషా సింగ్, మేఘన, జీవన్, తదితరులు..
నిర్మాత: పద్మజ కొమండూరి
మ్యూజిక్: కార్తీక్ కొడకండ్ల
సినిమాటోగ్రఫీ: అరుణ్, జీఎల్ బాబు
ఎడిటింగ్ ప్రవీణ్ పూడి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రామ్మోహన్ కొమండూరి
సెన్సార్ – యు/ఎ
రిలీజ్ డేట్ – ఏప్రిల్ 12, 2018
రన్ టైం – 132 నిమిషాలు
అందరూ చిన్న ఆర్టిస్టులే. కానీ యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా అమీర్ పేట్ 2 అమెరికా. టైటిల్ చూస్తేనే మేటర్ సగం అర్థమైపోతుంది. సినిమా మొత్తం ఈ టైటిల్ చుట్టూనే తిరిగింది. మీడియం రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
కథ
అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదించాలని భావిస్తారు హైదరాబాద్ లోని కొందరు విద్యార్థులు. అలా డాలర్లు సంపాదించి జీవితంలో బాగా స్థిరపడాలని అనుకుంటారు. వీళ్లందరిదీ హైదరాబాదే అయినప్పటికీ, వాళ్ల కుటుంబ నేపథ్యాలు, ప్రాంతాలు మాత్రం వేరు. మొత్తానికి అమీర్ పేట్ లో కొన్ని సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకొని, అమ్మానాన్నలు సంపాదించిన లక్షల ఆస్తిని పణంగా పెట్టి అమెరికా వెళ్తారు.
హైదరాబాద్ లో బుద్ధిగానే చదువుకున్న ఈ విద్యార్థుల్లో కొందరు అమెరికా వెళ్లిన తర్వాత చెడు వ్యసనాలకు బానిసలౌతారు. తెచ్చుకున్న డబ్బులు మొత్తం ఖర్చుచేస్తారు. మరోవైపు కొంతమంది స్టూడెంట్స్ పరీక్షల్లో తప్పితే, మరికొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుని, పార్ట్ టైం ఉద్యోగాల్లో చేరుతారు. వీళ్ల బాధలతో పాటు అమెరికాలో జాత్యాహంకారం ఎలిమెంట్ కూడా సినిమాలో యాడ్ అవుతుంది. ఫైనల్ గా వీళ్లంతా తమ కష్టాల నుంచి ఎలా గట్టెక్కారు, అమెరికా వెళ్లి జీవితంలో ఏం నేర్చుకున్నారనే మంచి సందేశంతో తెరకెక్కింది అమీర్ పేట్ 2 అమెరికా సినిమా.
ప్లస్ పాయింట్స్
– మంచి సందేశం
– యూత్ కు కనెక్ట్ అయ్యే పాయింట్
– అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు
– సీనియర్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
మైనస్ పాయింట్స్
– లీడ్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
– పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– నాసిరకం ప్రొడక్షన్ వాల్యూస్
– అందరికీ తెలిసిన కథ
బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ
ప్రతి సినిమా వెనక ఒక పర్పస్ ఉంటుంది. డబ్బులు సంపాదించాలనే ఆలోచనను పక్కనపెడితే, అసలు సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది కనీసం దర్శకుడికైనా ఓ అవగాహన ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు రామ్మోహన్ క్లారిటీతోనే ఉన్నాడు. యూత్ కు ఇవ్వాల్సిన సందేశాన్ని బలంగా ఇస్తూనే, సినిమా మొత్తాన్ని సరదాగా చూపించాలనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.
కానీ దర్శకుడికి అటు నటీనటులు, ఇటు నిర్మాతల నుంచి సరైన సహకారం అందలేదు. లీడ్ ఆర్టిస్టులు ఎవరూ సరిగ్గా నటించలేదు. ఇక్కడ నటీనటుల్ని పేరుపేరునా చెప్పుకోవడం అనవసరం. వైవా హర్ష, తేజస్ అనే ఇద్దరు ఆర్టిస్టులు మినహా మిగతావాళ్లంతా చేతులెత్తేశారు. అంతోఇంతో సినిమాను బ్యాలెన్స్ చేసింది ఎవరైనా ఉన్నారంటే వాళ్లు తణికెళ్ల భరణి, బ్రహ్మానందం, వేణుమాధవ్ లాంటి ఇద్దరుముగ్గురు సీనియర్లు మాత్రమే.
ఇక టెక్నికల్ గా ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. లో-స్టాండర్డ్స్ అనే ప్రామాణికానికి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది ఈ సినిమా. ఈ మూవీ కంటే ప్రస్తుతం తెలుగులో వస్తున్న కొన్ని సీరియల్స్ రిచ్ గా ఉంటున్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల్లో లోపాలు పుష్కలంగా
కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా అంత ఖర్చుచేసి అమెరికాలో తీసిన ఈ సినిమాలో, అమెరికా అందాల్ని సరిగ్గా చూపించలేకపోయారు. ఓస్.. అమెరికా అంటే ఇదేనా అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూస్తే.
ఓవరాల్ గా యూత్ కు కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంది ఈ సినిమాలో. వాళ్లు ఎంజాయ్ చేసే కామెడీ సన్నివేశాలు, లవ్, రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి. అయితే వీటిని  ఎంజాయ్ చేయాలంటే నాసిరకమైన సినిమాటోగ్రఫీ, రోత పుట్టించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎబ్బెట్టుగా సాగే నటీనటుల్ని భరించాల్సి ఉంటుంది. ఆ మాత్రం భరించే సామర్థ్యం మీలో ఉంటే అమీర్ పేట్ టు అమెరికా సినిమా చూడొచ్చు.
రేటింగ్  2/5