అమెరికాలో బాహుబలి-2 తర్వాత స్పైడర్

Published On: September 12, 2017   |   Posted By:
అమెరికాలో బాహుబలి-2 తర్వాత స్పైడర్
ఇప్పుడు ప్రతి టాలీవుడ్ హీరో టార్గెట్ ఒకటే. అవకాశం దొరికితే బాహుబలి-2 రికార్డుల్ని కొట్టేయాలి. ప్రస్తుతానికి అది అసాధ్యం కావొచ్చు. కానీ ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. స్పైడర్ సినిమాకు సంబంధించి మహేష్ కూడా అదే చేస్తున్నాడు. కలెక్షన్ల సంగతి అటుంచితే.. అమెరికాలో బాహుబలి-2 తర్వాత భారీ స్థాయిలో విడుదలయ్యే చిత్రంగా స్పైడర్ ను నిలిపాడు. అవును.. స్పైడర్ సినిమా యూఎస్ లో రికార్డు ప్రింట్స్ తో రిలీజ్ అవుతోంది. 
ఒక్క అమెరికాలోనే 400కు పైగా లొకేషన్లలో స్పైడర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ 400 లొకేషన్లలో 600 స్క్రీన్స్ పై స్పైడర్ చిత్రం రిలీజ్ అవుతోంది. బాహుబలి-2 తర్వాత ఇదే హయ్యస్ట్ నంబర్. అంతేకాదు.. ఈసారి అమెరికాలో స్పైడర్ సినిమాకు సంబంధించి కాస్త టిక్కెట్ రేట్లను కూడా పెంచారు. మొదటి 3 రోజులు మాత్రమే సవరించిన ధరలు అమల్లో ఉంటాయి. ఇలా ఓవర్సీస్ కు సంబంధించి దూసుకుపోతున్నాడు స్పైడర్.
ఇటు టాలీవుడ్ లో కూడా స్పైడర్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తయింది. నైజాంతో పాటు చాలా ఏరియాల్లో కళ్లుచెదిరే రేటుకు ఈ సినిమా అమ్ముడుపోయింది. అటు శాటిలైట్ రైట్స్ లో కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు స్పైడర్. ఏకంగా 26 కోట్ల రూపాయలకు జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకుంది.