అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ

Published On: August 26, 2017   |   Posted By:
అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ
సాధార‌ణంగా చిన్న సినిమాలకు పబ్లిసిటీ ఎంతో అవ‌స‌రం. అందుకోసం సినిమా వివాదాల్లో ఉండాల‌ని, అలా ఉంటే మంచి ప‌బ్లిసిటీ దొరుకుతుంద‌ని చిన్న సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు బావిస్తుంటారు. అలా అలా ఈ మ‌ధ్య వివాద‌స్ప‌ద‌మైన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒక‌టి. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా లిప్‌లాప్ పోస్ట‌ర్ వివాదానికి దారి తీసింది. అలాగే సెన్సార్ బోర్డు సినిమాకు ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చింద‌ని కూడా యూనిట్ సెన్సార్ బోర్డును ఓ ర‌కంగా ద‌య్య‌బ‌ట్టింది. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య విడుద‌లైన అర్జున్ రెడ్డి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా లేదా అని తెలుసుకోవాలంటే ముందు క‌థలోకి వెళ‌దాం…
క‌థః
అర్జున్ రెడ్డి(విజ‌య్ దేవ‌ర‌కొండ‌)  మెడిక‌ల్ స్టూడెంట్‌. మంగ‌ళూరులో మెడిసిన్ హౌస స‌ర్జ‌న్ చేస్తుంటాడు. యూనివ‌ర్సిటీ టాప‌ర్‌. అయితే చాలా కోపస్థుడు. ఈ కోపం కార‌ణంగా కాలేజ్ నుండి స‌స్పెన్స్ అయ్యే ప‌రిస్థితిని ఎదుర్కొంటాడు. అలాంటి సంద‌ర్భంలో కూడా త‌ను చేసేదే క‌రెక్ట్ అని భావించి కాలేజ్‌ను విడిచి పెట్టేయాల‌నుకుంటాడు. అప్పుడే ఫ‌స్ట్ ఇయ‌ర్ మెడిక‌ల్ స్టూడెంట్ ప్రీతి(షాలిని పాండే)ను చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కాలేజ్‌లో సీనియ‌ర్ కావ‌డంతో ప్రీతికి ద‌గ్గ‌ర‌వుతాడు. ఆమెను కూడా త‌న ప్రేమ‌లో ప‌డేలా చేసుకుంటాడు. అర్జున్‌, ప్రీతి ఒక‌రినొక‌రు విడిచి ఉండ‌లేనంత దూరం ప్రేమ ప్ర‌యాణం చేస్తారు. అర్జున్ త‌న ప్రేమ విష‌యాన్ని ప్రీతి త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడ‌టానికి ఆమె ఇంటికి వెళ‌తాడు. కానీ ప్రీతి తండ్రి(ఆనంద్ భ‌గ‌త్‌) కులం కార‌ణంగా వీరి ప్రేమ‌కు అడ్డుచెబుతాడు. ప్రీతికి మ‌రొక‌రితో పెళ్లి చేసేస్తాడు. అప్పుడు అర్జున్ రెడ్డి ఏమౌతాడు?  చివ‌ర‌కు అర్జున్ రెడ్డి గ‌మ్యం ఎటు వెళుతుంది? అర్జున్‌, ప్రీతిలు క‌లుసుకున్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే  సినిమా చూడాల్సిందే.
హైలైట్స్ః
– విజ‌య్ దేవ‌రకొండ న‌ట‌న‌
– ఎమోష‌న‌ల్ సీన్స్‌
– కామెడీ
డ్రాబ్యాక్స్ః
– సినిమా నిడివి
– సెకండాఫ్ సాగ‌దీత‌గా ఉండ‌టం
స‌మీక్షః
సినిమా హీరోగా పెళ్లిచూపులు చిత్రంతో మంచి విజ‌యం సాధించిన విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ ప్రారంభంలోనే అర్జున్ రెడ్డి వంటి ఎమోష‌న‌ల్ మూవీని చేయ‌డం చాలా గొప్ప విష‌యం. కాలేజ్ స్టూడెంట్‌, ప్రేమికుడు, భ‌గ్న ప్రేమికుడు ఇలా విభిన్న‌మైన పార్శ్వాలున్న పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇక హీరోయిన్ షాలిని లుక్స్ ప‌రంగా ఓకే అనిపించేలా ఉన్నా, పాత్ర‌కు త‌గ్గ‌ట్లు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. హీరో, హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్‌, రొమాంటిక్ సీన్స్ ఆక‌ట్టుకునేలా ఉంటాయి. అలాగే హీరో ఫ్రెండ్ శివ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన రాహుల్ రామ‌కృష్ణ సినిమాలో స‌న్నివేశాల ప‌రంగా వ‌చ్చే కామెడీని జ‌న‌రేట్ చేయ‌డంలో స‌క్సెస్ సాధించాడు. హీరోను క‌నిపెట్టుకుని ఉంటూ, అత‌నికి స‌ల‌హాలిస్తూ, మ‌ద‌లించే కోణాల్లో రాహుల్ పాత్ర చిత్రీక‌ర‌ణ విధానం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. ఇక సినిమాలో హీరో అన్న‌య్య పాత్ర‌లో న‌టించిన క‌మ‌ల్ కామ‌రాజు, నాన్న పాత్ర‌లో సంజ‌య్ స్వ‌రూప్ స‌హా మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే, ల‌వ్ స్టోరీని ఎమోష‌న‌ల్‌గా క్యారీ చేయ‌డం అంటే అంత సుల‌భం కాదు. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు సందీప్ వంగా ఆ విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌గా ఉండ‌టంతో సినిమాను చ‌క్క‌గా ప్రెజంట్ చేయ‌గ‌లిగారు. హీరో హీరోయిన్స్ మ‌ధ్య స‌న్నివేశాలు, సిచ్యువేష‌న‌ల్ కామెడి స‌న్నివేశాలు, ఎమోష‌న‌ల్ సీన్స్‌, క్లైమాక్స్ సీన్ అన్ని ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా డిజైన్ చేసుకున్నారు. అయితే సెకండాఫ్ సాగ‌దీత‌గా అనిపిస్తుంది.  సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ను తొలిగించి ఉంటే సినిమా స్పీడ్ ఇంకా పెరిగి ఉండేది. సినిమాలో ముద్దు సీన్స్ మ‌రి ఎక్కువ‌య్యాయ‌నిపిస్తుంది. ద‌ర్శ‌క‌త్వ ప్రతిభ‌కు ర‌థ‌న్ త‌న ట్యూన్స్‌, బ్యాక్ గ్రౌండ్‌తో రాజు తోట త‌న సినిమాటోగ్ర‌ఫీతో ప్రాణం పోశారు. చిన్న పిల్ల‌లు మిన‌హా సినిమా అంద‌రూ చూసేలా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు.
చివ‌ర‌గా..అర్జున్ రెడ్డి..భావోద్వేగ‌మైన ప్రేమికుడు
రేటింగ్ః 3/5