అర‌ణ్య చిత్రం విడుద‌ల వాయిదా

Published On: March 16, 2020   |   Posted By:

అర‌ణ్య చిత్రం విడుద‌ల వాయిదా

రానా ద‌గ్గుబాటి ‘అర‌ణ్య’ చిత్రం విడుద‌ల తేదీ వాయిదా

హ్యండ్‌స‌మ్ హీరో రానా ద‌గ్గుబాటి బ‌హు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’ తెలుగులో ‘అర‌ణ్య‌’గా రానున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నేప‌థ్యంలో ఈ సినిమా విడుద‌ల తేదీని వాయిదా వేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. “ప్రేక్ష‌కుల అభిరుచులకు ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎల్ల‌ప్పుడూ అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తోంది. ఇదివ‌ర‌కెన్న‌డూ చెప్ప‌ని విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో సినిమాలు నిర్మించ‌డానికీ, పంపిణీ చేయ‌డానికి ఆరోగ్య‌క‌ర‌మైన‌, ఆనంద‌క‌ర‌మైన‌ ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉన్నారు. కోవిడ్ 19 క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ఇటీవ‌లి కాలంలో వెల్ల‌డ‌వుతూ వ‌స్తున్న వార్త‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ‘అర‌ణ్య’‌, ‘హాథీ మేరే సాథీ’, ‘కాండ‌న్’ (త‌మిళ వెర్ష‌న్‌) సినిమాల విడుద‌ల తేదీని మార్చాల‌ని నిర్ణ‌యించాం.

మా భాగ‌స్వాములు, ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, ప్రేక్ష‌కుల అంద‌రి అభిప్రాయాల‌ను గౌర‌విస్తూ, మ‌నంద‌రి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీకోరుకుంటూ, ప్ర‌స్తుత ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకొని, త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్‌తో మీ ముందుకు వ‌స్తామ‌ని ఆశిస్తున్నాం. ఆరోగ్యంగా, భ‌ద్రంగా ఉండండి” అని ఆ ప్ర‌క‌ట‌న‌లో నిర్మాత‌లు తెలిపారు.

ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 2న విడుద‌ల చేయనున్న‌ట్లు ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆ విడుద‌ల‌ను వాయిదా వేశారు.

25 సంవ‌త్స‌రాలుగా అర‌ణ్యంలో జీవిస్తూ వ‌స్తున్న ఒక వ్య‌క్తి క‌థ ‘అర‌ణ్య’‌. ఆ వ్య‌క్తిగా రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న ఈ చిత్రంలో ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వుల న‌రికివేత వంటి అంశాల‌ను చ‌ర్చిస్తున్నారు.

విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావోంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ఈ చిత్రానికి శంత‌ను మొయిత్రా సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, ఎ.ఆర్‌. అశోక్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ప్రధాన తారాగణం:
రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్

సాంకేతిక బృందం:
నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభు సాల్మన్
మాటలు, పాటలు: వనమాలి
సినిమాటోగ్రఫీ: ఎ.ఆర్. అశోక్ కుమార్
సంగీతం: శంతను మొయిత్రా
సౌండ్ డిజైన్: రసూల్ పోకుట్టి
ఎడిటింగ్: భువన్
ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ
కాస్ట్యూమ్స్: కీర్తి కొల్వాంకర్, మరియా తారకన్
యాక్షన్: ‘స్టన్నర్’ శ్యామ్, స్టన్ శివ
అసోసియేట్ ప్రొడ్యూసర్: భావనా మౌనిక