ఆండ్రాయిడ్‌ కట్టప్ప మూవీ రివ్యూ

Published On: October 9, 2020   |   Posted By:

ఆండ్రాయిడ్‌ కట్టప్ప మూవీ రివ్యూ

వీడు హిట్టప్ప:  ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ రివ్యూ

రేటింగ్ : 3.5 /5

మళయాంలో క్రితం సంవత్సరం రిలీజైన  ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ కు మంచి పేరు వచ్చింది. పెద్ద హిట్టైంది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా మానవ సంబంధాల్ని హృద్యంగా ఆవిష్కరించటంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడా సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యి మన ముందుకు వచ్చింది. తెలుగువారికీ కూడా నచ్చే సమకాలీనాంశమే కావటం, పిల్లా ,పెద్దా కలిసి చూసే కథ,కథనం ఉండటంతో ఈ సినిమా ఇక్కడ కూడా వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది. అయితే పబ్లిసిటీ పెద్దగా లేకపోవటంతో కేవలం ఆహా సబ్ స్కైబర్స్ కు మాత్రమే పరిమితం కావటం ఈ సినిమా విజయాకాశాలను తగ్గిస్తాయి. ఆ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వటానికి మూలమైన కథేంటి…స్టార్స్ఎవరూ లేని ఈ సినిమా జనాలకు నచ్చటంలో ఉన్న సీక్రెట్ ఏమిటో చూద్దాం.
 
స్టోరీ లైన్

భాస్కర్  కాస్తంత  చాదస్తం మనిషి. ఆయనకో కొడుకు సుబ్రమణ్యం.  మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి  చేసి తండ్రి సేవలో బ్రతుకుతూంటాడు. అయితే జనరేషన్ గ్యాప్ అనండి..మరొకటి అనండి…తండ్రి ప్రవర్తన మనోడికి విసుగు అనిపిస్తూంటుంది. చివరకి మిక్సీ,గ్రైండర్ కూడా ఇంట్లో అనుమతించని తండ్రితో అప్పుడప్పుడూ వాదనలు కూడా జరుగుతాయి.  మరో ప్రక్క తండ్రి కొడుకును  ఏ ఉద్యోగానికీ వెళ్లనివ్వడు. తనతోనే ఉండాలంటాడు. ఇలా అనేక మంచి జాబ్స్ పోగొట్టుకుంటాడు కొడుకు. అయితే అనుకోకుండా సుబ్రమణ్యానికి …రష్యాలో బాజ్ వస్తుంది. అదో రోబోటిక్స్ కంపెనీ. తండ్రికు అలా తన కొడుకు ఊరొదిలి వెళ్లటం ఇష్టం లేదు. కాని సుబ్రమణ్యానికి తన జీవితం ,కెరీర్ కూడా ముఖ్యమే అనిపిస్తుంది.

అప్పటికీ తండ్రి కోసం  కేర్ టేకర్స్ ని, వంటమనష్యులను ఎరేంజ్ చేస్తాడు. కానీ వచ్చినవాళ్లు పట్టుమని పదిరోజులు కూడా ఉండరు.  ఓ పనావిడిని ఫైనలైజ్ చేసి రష్యా వెళ్తాడు. వెళ్లిన కొన్నాళ్లకే ఆమె పని మానేస్తుంది. తండ్రికి అనారోగ్యం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సుబ్రమణ్యం…ఇండియా వస్తాడు. అయితే ఈ సారి తన వెంట ఆండ్రాయిడ్ వెర్షన్ 5.25 రోబోని తీసుకువచ్చి ప్రోగ్రామింగ్ చేసి తండ్రి బాగోగులు చూసుకోవడానికి వదిలి పెట్టి తిరిగి రష్యాకి వెళ్ళిపోతాడు.

మొదట్లో ఆ రోబోని  వద్దన్న భాస్కర్ మెల్లి మెల్లిగా  దానికి దగ్గర అవుతాడు.  దాన్ని ఓ కొడుకులా భావిస్తాడు. దానితో మానసికంగానూ అనుబంధం పెంచుకుంటాడు. దానికి కట్టప్ప అని పేరు పెడతాడు. అయితే ఆ రోబోతో తన సమస్యలన్నీ తీరిపోతాయని భావించిన ఆ కొడుకు కు త్వరలోనే ఆ రోబోతో అది పెద్ద సమస్య రాబోతోందని అర్దమవుతుంది. అక్కడ నుంచి తండ్రిని, రోబోని విడతీయ ప్రయత్నం చేస్తాడు. కానీ తండ్రి నిరాకరిస్తాడు. ఆ క్రమంలో అనేక ఎమోషనల్ సంఘనటలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ రోబో నుంచి ఆ తండ్రికి వచ్చిన ముప్పు ఏంటి..చివరకు రోబో ఏమైంది…కొడుకు రష్యాలోనే ఉండిపోయారా..ఈ మధ్యలో జపాన్ అమ్మాయితో  మొదలైన కొడుకు లవ్ స్టోరీ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం…

పూర్తి స్క్రిుప్టు బేసెడ్ కథ ఇది. చక్కటి స్క్రీన్ ప్లేతో కథను నడిపించారు. దర్శకుడు కు ఇది తొలి చిత్రమే అయ్యినప్పటికీ ఎక్కడా ఆ తడబాటు కనపడనీయడు. చాలా సినిమాలకు ఆయన ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన అనుభవం ఉపయోగపడింది. అలాగే  సినిమాని సీరియస్ గా కాకుండా చక్కటి ఫన్ , చెణుకులతో కూడిన డైలాగ్స్ తో నడిపారు. అక్కడక్కడా జీవిత సత్యాలను షుగర్ కోటింగ్ తో చెప్పే ప్రయత్నం చేసారు. ఒంటరి వృధ్దుల జీవితాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. మొదట్లో ఈ రోబోను ఛీ కొట్టే తండ్రి, ఆ తర్వాత మెల్లిగా దానితో స్నేహం చేయడం ప్రారంభించటం, తర్వాత దానిపై ఎమోషన్ పెంచుకుని, చివరకు దాని జాతకం చూపించి, అరిస్టం ఉందంటే బ్రతికుంచుకోవటానికి మృత్యంజయ హోమం చేయాలనుకునే దాకా వెళ్తాడు. ఇక ఈ సినిమా 2012  వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్ రోబోట్ అండ్ ఫ్రాంక్ ఆధారంగా  రూపొందించారు.

నటీనటులు…

ఈ సినిమాలో భాస్కర్ గా నటించిన సూరజ్  నటన చాలా బాగుంది.ఈయన తన వయస్సు 40 కన్నా రెట్టింపు వయస్సు వాడిలా కనపించటమే కాకుండా జీవించాడు. ఆయన నటన రీసెంట్ గా వచ్చిన వికృతి,డ్రైవింగ్ లైసెన్స్ మలయాళ సినిమాలో కూడా  చాలా బాగుంటుంది.  

టెక్నకిల్ గా ..

ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్, కెమెరామెన్ చేసిన వర్క్ తెరపై స్పష్టంగా కనపడుతుంది. కొన్ని సీన్స్ దర్శకుడు ఊహను ఎలివేట్ చేసి నిలబెట్టడంలో వారి ప్రతిభ మనం గమనించవచ్చు. రోబోకి ఒక మోనిటర్ ను ఏర్పాటు చేసి.. బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వడం కూడా ఆకట్టుకుంటుంది.  అతడి కొడుకు సుబ్రమణియన్ గా సౌబిన్ షాహిర్ చాలా సహజంగా నటించాడు. ఎడిటింగ్ బాగుంది. తెలుగు డబ్బింగ్ డైలాగులు సైతం ఆకట్టుకుంటాయి.

చూడచ్చా

ఏ మొహమాటం లేకుండా మీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవచ్చు.

నటీనటులు : సురాజ్ వెంజారమూడ్, సౌబిన్ షాహిర్, మాలా పార్వతి, సైజు కురుప్పు, రాజేష్ మాధవన్, ఉన్నిరాజా, శివదాస్ కణ్ణూర్ తదితరులు
నిర్మాణం: సంతోష్ టి.కురువిల్లా
దర్శకత్వం : రతీష్ బాలకృష్ణన్ పొదువాల్
సంగీతం :  బిజీబల్
ఎడిటర్:సైజు శ్రీధరన్  
సినిమాటోగ్రఫీ: సను జాన్ ఉరుగేసి  
రన్ టైమ్: 2.20  నిముషాలు
ఎక్కడ చూడాలి?: ఆహా
రిలీజ్ డేట్:  09-10-2020