ఇంద్ర‌ప్ర‌స్థం చిత్రం థీమ్ పోస్ట‌ర్ విడుద‌ల

Published On: August 14, 2020   |   Posted By:
ఇంద్ర‌ప్ర‌స్థం చిత్రం థీమ్ పోస్ట‌ర్ విడుద‌ల‌
 
ఎన్‌సీబీఎన్‌, వైఎస్సార్ మ‌ధ్య స్నేహం, శ‌త్రుత్వంపై దేవా క‌ట్టా కాల్పనిక గాథా చిత్రం ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ థీమ్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉండి, త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన ఇద్ద‌రి రాజ‌కీయ పోరును త‌న త‌దుప‌రి సినిమా ఇతివృత్తంగా టేక‌ప్ చేశారు డైరెక్ట‌ర్ దేవా క‌ట్టా. ఆయ‌న ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ (వ‌ర్కింగ్ టైటిల్‌) థీమ్ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్నేహాన్నీ, శ‌త్రుత్వాన్నీ పంచుకున్న ఇద్ద‌రు దిగ్గ‌జ రాజ‌కీయ నాయ‌కులు 30 సంవ‌త్స‌రాల కాలం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల ముఖ‌చిత్రాన్ని పున‌ర్నిర్మించ‌డంలో సాగించిన ప్ర‌యాణం ప్ర‌ధానాంశంగా కాల్ప‌నిక స‌న్నివేశాల‌తో ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ రూపొంద‌నున్న‌ది.

“ప్ర‌పంచంలో జ‌రిగే పోటీల‌న్నిటికీ ప‌ర్ప‌స్ ఒక్క‌టే.. విన్న‌ర్స్‌ని ఎంచుకోవ‌డం. విన్న‌ర్స్ ర‌న్ ద వ‌ర‌ల్డ్‌. ఆ పోటీలో అనుకోకుండా ఇద్ద‌రు స్నేహితులు ఎదురైతే ఆ ఆట‌కున్న కిక్కే వేరు” అని యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్‌లో దేవా క‌ట్టా వాయిస్ ఓవ‌ర్ చెబుతుంది. దీన్న బ‌ట్టి ఈ సినిమా దేని గురించ‌నేది అర్థ‌మ‌వుతోంది.

పోస్ట‌ర్‌పైన “నైతిక‌త‌లు మార‌తాయి, అధికారం కోసం యుద్ధం స్థిరంగా ఉంటుంది (Moralities change, the battle for power remains constant.)” అనే కొటేష‌న్ క‌నిపిస్తోంది.

చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌ను సిలోయెట్ ఇమేజెస్‌తో చూపించారు.

ప్రూడోస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్ష వి., తేజ సి. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇద్ద‌రు రాజకీయ దిగ్గ‌జాల స్నేహానికీ, రాజ‌కీయాల్లో వారి శ‌త్రుత్వానికీ, ఆ ఇద్ద‌రికీ వారి అనుచ‌రులు ఇచ్చే గౌర‌వానికీ స‌మాన ప్రాధాన్యం ఇస్తుంది ‘ఇంద్ర‌ప్ర‌స్థం’.

టీజ‌ర్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సురేష్ బొబ్బిలి స‌మ‌కూర్చారు. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ 14వ చిత్రాన్ని దేవా  క‌ట్టా రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. దాని త‌ర్వాత ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రానికి సంబంధించి త‌గిన‌ స‌మ‌యంలో మ‌రిన్ని వివ‌రాలను చిత్ర బృందం వెల్ల‌డిస్తుంది.