ఇగో మూవీ రివ్యూ

Published On: January 19, 2018   |   Posted By:
ఇగో మూవీ రివ్యూ
నటీనటులు – ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షా పంత్, రావు రమేష్, పోసాని, పృథ్వి, అజయ్, శకలక శంకర్ తదితరులు
ఎడిటర్: శివ వై ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి. కె
స్టిల్స్: వికాస్
వీఎఫ్ఎక్స్:  తేజ్ దిలీప్
మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తీక్
ప్రొడ్యూసర్స్: విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్
కథ- డైరెక్షన్: సుబ్రహ్మణ్యం ఆర్.వి. (సుబ్బు)
గతంలో ప్రేమా గీమా జాంతానై సినిమా తీసిన దర్శకుడు సుబ్రమణ్యం, ఆకతాయి సినిమాలో నటించిన హీరో ఆశిష్ రాజ్ కలిశారు. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ఇగో. ఇగో అంటే ఇందు, గోపి అని అర్థం. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ సక్సెస్ అందుకుంటుందా. బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
కథ
రావులపాలెం బ్యాక్ డ్రాప్ లో హీరోహీరోయిన్ల కథ మొదలవుతుంది. ఇందు, గోపి ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు. ఇద్దరికీ కాస్త ఇగో ఎక్కువ.  ప్రతి చిన్న విషయానికీ అహం చూపిస్తుంటారు. అలానే పెరిగి పెద్దవుతారు. ఇక పెళ్లీడుకొచ్చిన తర్వాత.. గోపి కంటే అందగాడ్ని, ఆస్తిపరుడ్ని పెళ్లి చేసుకుంటానని ఛాలెంట్ చేస్తుంది ఇందు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన
ఓ ఎన్నారైని ప్రేమిస్తుంది. అతడితో పెళ్లి కూడా దాదాపు ఖరారైపోతుంది. ఇది తెలుసుకున్న గోపి, ఇందు కంటే ముందే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇందు కంటే అందగత్తెను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని శపథం చేసి హైదరాబాద్ వచ్చేస్తాడు. చెప్పినట్టుగానే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెతో సెల్ఫీ దిగి ఫ్రెండ్స్ కు పంపించి ఇందుకు చూపించమంటాడు.
ఫొటో చూసిన ఇందు చాలా బాధపడుతుంది. అప్పుడు తన మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని బయటపెడుతుంది. కేవలం అహం కారణంగా తన ప్రేమను చెప్పలేకపోయానని, గోపి అంటే తనకు చాలా ఇష్టమని ఫ్రెండ్స్ కు చెబుతుంది. వెంటనే గోపీని కలిసేందుకు స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్తుంది.
సరిగ్గా అదే టైమ్ లో తనకు సంబంధం లేకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు గోపి. కేవలం తన ఇగో కారణంగానే పోలీసులతో ఫేస్ టు ఫేస్ తలపడతాడు. అయితే అదే సమయంలో ఓ స్మగ్లింగ్ కేసును ఛేదిస్తాడు. ఈ క్రమంలో స్టార్టింగ్ నుంచి మంచోడిగా కనిపించిన రావురమేష్.. క్లైమాక్స్ లో విలన్ అని తెలుస్తుంది. ఆ మర్డర్ కేసు నుంచి గోపి ఎలా బయటపడ్డాడు. ఇందు ప్రేమను ఎలా అర్థం చేసుకున్నాడు.. ఇద్దరూ ఎలా ఒకటయ్యారు అనేది స్టోరీ.
ప్లస్ పాయింట్స్
– హీరోహీరోయిన్ల పెర్ఫార్మెన్స్
– బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– రావురమేష్ నటన
మైనస్ పాయింట్స్
– అందరికీ తెలిసిన కథ
– సీరియల్ ను తలపించే సన్నివేశాలు
– పాటలు
– కామెడీ పండకపోవడం
– దర్శకత్వంలో లోపాలు
– ఘోరమైన స్క్రీన్ ప్లే
బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ
చిన్న సినిమాగా వచ్చి పెద్ద మేజిక్ క్రియేట్ చేసిన మూవీస్ కొన్ని ఉన్నాయి. ఆనందోబ్రహ్మ, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఇగో కూడా అలాంటి చమక్కులు చూపిస్తుందని ఆశిస్తే ఘోరంగా మోసపోయినట్టు అవుతుంది. ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనీసం కథలో కొత్తదనం ఉన్నా సరిపెట్టుకోవడానికి అది కూడా లేదు.
నటీనటుల విషయానికొస్తే ఆకతాయితో గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్ రాజ్ బాగానే చేశాడు. ఆశిష్ కు సిమ్రాన్ నుంచి ఫుల్ సపోర్ట్ దక్కింది. ఇద్దరూ ఫస్టాఫ్ లో బాగా చేశారు. కానీ దర్శకుడు రాసుకున్న పేలవమైన సీన్ల ముందు వీళ్లు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. సెకెండ్ హీరోయిన్ గా చేసిన దీక్షాపంత్ కు చెప్పుకోదగ్గ స్కోప్ లేదు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం మంచి స్కోప్ దక్కింది. బ్యాడ్ పోలీసాఫీసర్ గా అజయ్ చక్కగా నటించాడు. రావు రమేష్ స్టార్టింగ్ లో మంచిగా కనిపించి,క్లైమాక్స్ లో విలన్ గా రూపాంతరం చెందడం బాగుంది.  థర్టీ ఇయర్స్ ఫృధ్వి, పోసాని, షకలకశంకర్ కామెడీ చేయడానికి విశ్వప్రయత్నం చేశారు. రెండు పంచ్ లు మినహా ఏవీ పేలలేదు.
టెక్నికల్ గా కూడా సినిమాలో ఆశించిన స్టఫ్ లేదు. ఒక్క రీ-రికార్డింగ్ మినహా. సెకెండాఫ్ లో సాయికార్తీక్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు మాత్రం ఒక్కటి కూడా కనెక్ట్ కాలేదు. సినిమా మొత్తానికి ఒక్క సాంగ్ మంచిదిచ్చినా సరిపోయేది. అలాంటి ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అన్నీ సీరియల్ ను తలపించాయి.
ఓవరాల్ గా ఇగో మూవీ ఆడియన్స్ ను మెప్పించదు.
రేటింగ్ – 2/5