ఇదే మా కథ మూవీ రివ్యూ

Published On: October 4, 2021   |   Posted By:

ఇదే మా కథ మూవీ రివ్యూ

 

బ్రేక్ లతో రోడ్ జర్నీ  :‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE) : 

👍


ఇలాంటి సినిమాలపై ఏ విధమైన ఎక్సపెక్టేషన్స్ ఉండవు. సినిమా బాగుందని టాక్ వస్తే కలిసివస్తుంది. లేకుంటే రిలీజ్ అయ్యిందని పట్టించుకునే వాళ్లే కరువు అవుతారు. అయినా ఏదో నమ్మకంతో ఇలాంటి సినిమాలు తెరకెక్కుతూనే ఉంటాయి. ముఖ్యంగా స్టార్ క్యాస్టింగ్ లేని చిత్రాలకు కథే స్టార్ అవ్వాలి. అదే జరిగిందని కూడా దర్శక,నిర్మాతలు రిలీజ్ కు ముందు చెప్తూంటారు. ఈ సినిమాకు కూడా విభిన్నమైన లఢక్ బ్యాక్ డ్రాప్, నాలుగు కథల సమాహారం ,రోడ్ జర్నీ గా తెరకెక్కించారు. అయితే అవి అన్ని సరిగ్గా కలిస్తేనే వర్కవుట్ అవుతాయి. ఈ సినిమాలో అలాంటి మ్యాజిక్ ఏదన్నా జరిగిందా..సినిమా కథేంటి, శ్రీకాంత్,సుమంత్ అశ్విన్ కెరీర్ లకు ఏమైనా పనికొస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

కాన్సర్ తో బాధపడుతున్న మహేంద్ర(శ్రీకాంత్‌) ఎప్పుడో పాతికేళ్ల క్రితం మిస్సయిన తన ప్రేయసిని వెతుక్కుంటూ ల‌ద్దాఖ్ బయిలుదేరతాడు. తన చివరి లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం బైక్‌పై లడఖ్‌కి బయలుదేరుతాడు. ఇక ల‌క్ష్మీ (భూమిక‌)కి ఓ జీవితాశయం ఉంటుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ మెకానిక్ గా పనిచేస్తూ, ఆ బండి ఇంజన్ ను అప్ డేట్ చేసే క్రమంలో లక్ష్మీ (భూమిక) తండ్రి కన్ను మూస్తాడు. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై త‌న తండ్రి చేసిన ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ల‌ద్దాఖ్‌లో జ‌రిగే ఈవెంట్‌లో పొందుప‌రిచేందుకు వ‌స్తుంది. గృహిణిగా భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా ఆమె.. తన తండ్రి కల నెరవేర్చటం కోసం ఈ ప్రయాణం పెట్టుకుంటుంది. ప్రేమించివాడు మోసం చేయటంతో  మేఘన (తాన్యా హోప్) ఆ డిప్రెషన్ నుంచి బయిటపడటానికి బైక్ రైడింగ్‌కి వస్తుంది.  ఇక  మల్టీ మిలియనీర్ కొడుకు, యూ ట్యూబర్ , అడ్వెంచ‌ర్ బైక్‌ రైడ‌ర్ అజ‌య్ (సుమంత్ అశ్విన్‌)తన చిరకాల స్వప్నం..  ఇంట‌ర్నేష‌న‌ల్ అడ్వెంచ‌ర్  ఛాంపియ‌న్ షిప్‌లో పాల్గొనాల‌నేది. ఆ పోటీల్లో పాల్గొనాలంటే ముందుగా ల‌ద్దాఖ్‌లో జ‌రిగే అడ్వెంచర్ రేస్‌లో గెల‌వాలని బయిలుదేరతాడు. అతని ఫ్యామిలీకు ఇది ఇష్టం ఉండదు. దాంతో ఓ బైక్ దొంగతనం చేసి మరి బయిలుదేరి వస్తాడు. వీరంతా అనుకోకుండా మార్గమధ్యలో కలుసుకుంటారు. ఒక‌రి స‌మ‌స్యను మ‌రొకరు ఎలా పంచుకున్నారు. వాళ్ల ల‌క్ష్య సాధ‌న‌లో సక్సెస్ అ్యయారా?   ఈ క్రమంలో మేఘన – అజయ్ మధ్య ప్రేమ ఎలా పుట్టింది ? చివరకు మహేంద్ర జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? ఈ నలుగురు బైక్‌ రైడర్స్‌ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నదే ‘ఇదే మా కథ’ స్టోరీ.  


ఎనాలసిస్ …

ఇది నలుగురు బైక్ రైడర్స్ కథ. హైద‌రాబాద్ నుంచి ల‌ద్దాఖ్ వ‌ర‌కూ జరిగే ట్రావిలింగ్ లో ఏమి జరిగింది. వారి జీవితంలో ఏమి మార్పు వచ్చిందనేదే కథ ప్రధాన లక్ష్యం. ఎమోషన్స్ తో నడిచే ఇలాంటి రోడ్ జర్నీ కథలు తెలుగులో తక్కువనే చెప్పాలి. గతంలో తెలుగులో వచ్చిన రోడ్ జర్నీ మూవీస్ ‘గమ్యం, ఎవడే సుబ్రహ్మణ్యం, పాఠశాల’ వంటివి ఈ సినిమా చూస్తూంటే గుర్తుకు వస్తాయి.ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లేనే ప్రధానంగా ఇంట్రెస్టింగ్‌ నడిపించాలి. క్యారక్టర్స్ ,వారి ఎమోన్స్ అయితే రాసుకున్నారు కానీ, వాటి మధ్య జరిగే సంఘర్షణ మాత్రం సరిగ్గా సెట్ చేయలేదు. దాంతో నేపధ్యం బాగున్నా నడక బాగోలేనట్లు తయారైంది. ఈ రోడ్ జర్నీ డెస్టినేషన్ ని చేరలేదు. చాలా సీన్స్ మాత్రం స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి.  ఫస్టాఫ్‌లో క్యారక్టర్స్ ని, వారి బ్యాక్ స్టోరీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథా నేపధ్యం సెట్ చెయ్యడానికి డైరక్టర్ ఎక్కువ సమయం తీసుకున్నాడు. అందులో శ్రీకాంత్, భూమిక పాత్రలు అసలు ఆసక్తికలిగించలేకపోయాయి. ఈ నాలుగు కలిశే దాక కానీ సినిమాలో కదలిక రాదు. ఈ రోడ్ జర్నీ మూవీని ఓ డాక్యుమెంటరీ లానో, ఫిలసాఫికల్ ఫిల్మ్ గానో చూపిస్తూనే అక్కడక్కడ వినోదాన్ని జత చేశారు. అలానే కథలో ఇరకకపోయినా కొద్ది పాటి యాక్షన్ సీన్స్ నూ మిక్స్ చేశారు. సాఫీగా నడిచిపోతున్న  ఈ కథలో యాక్షన్ మిక్స్ చేసేందుకు డైరక్టర్ బాగా కష్టపడ్డారు. కథలో అవకాశం లేకపోయినా ఓ విలన్ ను  సాంస్కృతిక పరిరక్షకుడి రూపంలో హఠాత్తుగా తెర మీదకు తీసుకొచ్చాడు. అయితే ఈ జర్నీ మూవీ పేరు చెప్పి కొత్త కొత్త ప్రదేశాలను చూపించడం బాగుంది.

టెక్నికల్ గా ..

రోడ్ ట్రిప్ నేపథ్యంలో సినిమా అంటే మంచి విజువల్స్ ఆశిస్తాం కానీ.. ఇందులో అలాంటివి ఏమీ లేవు. ఉన్నంతలో ఈ సినిమాలో చెప్పుకోదగినది సునీల్‌ కశ్యప్‌ నేపథ్య సంగీతం. పాటలు జస్ట్ ఓకే.  సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫి సినిమా కూడా సాదాగా సాగింది‌. బైక్‌ విన్యాసాలు బాగా తీసారు. నిర్మాణ విలువలు ఫరవాలేదు. డైలాగులు బాగున్నాయి. ఇక డైరక్టర్ సినిమా ని బాగానే డీల్ చేసారు.  తొలి చిత్రం మూసలో కొట్టుకుపోకుండా ఇలాంటి  కథను రాసుకుని, అర్థవంతంగా దానిని తెరకెక్కించాలని ప్రయత్నించిన డైరక్టర్ గురు పవన్ ను అభినందించాలి. అయితే డైరక్టర్ గా తన ముద్ర అంటూ ఏమీ వేయలేకపోయారు.

నటీనటుల్లో..

 శ్రీకాంత్ చాలా కాలం తర్వాత పూర్తి నిడివి ఉన్న అర్థవంతమైన పాత్ర చేశాడు. . భూమికను అసలు ఇలాంటి  పాత్రలో ఊహించం.  సుమంత్ అశ్విన్  చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. తాన్య హోప్ కు, సుమంత్ కు మధ్య  సాగే సీన్స్ బాగున్నాయి. తాన్య హోప్ కూడా తన అందంతో పాటు తన అభినయంతోనూ ఆకట్టుకుంది. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక మధ్యలో వచ్చే  సప్తగిరి, రాంప్రసాద్,  పృథ్వీ ల కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సప్తగరి పంచ్‌లు..బాగా పేలాయి.   తన్యా హోప్ పాత్ర సినిమాకు గ్లామర్ పరంగా హోప్ ఇచ్చింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

నచ్చినవి‌:
రొటీన్ కాని క‌థా నేప‌థ్యం
శ్రీకాంత్‌, భూమిక మెచ్యూర్డ్ న‌ట‌న
సెకండాఫ్
అక్కడక్కడా కొన్ని డైలాగ్స్  

నచ్చనవి‌:
గతంలో వచ్చిన రోడ్ జర్నీలాగేనే ఉండటం
తేలిపోయిన రైటింగ్
దర్శకత్వ  మెరుపులు ఏమీ లేకపోవటం

చూడచ్చా
ఓటీటిలో లేదా టీవిలో వచ్చేదాకా వెయిట్ చేయచ్చు

ఎవరెవరు..

నటీనటులు :  శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ తదితరులు
నిర్మాణ సంస్థ :  శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్
నిర్మాత : జీ మహేష్  
దర్శకత్వం : గురు పవన్‌
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ : రాంప్రసాద్
ఎడిటింగ్‌:  జునైద్ సిద్దిఖీ
రన్ టైమ్: రెండు గంటల 12 నిముషాలు
విడుదల తేది : అక్టోబర్‌ 2,2021