ఇష్క్‌ మూవీ రివ్యూ

Published On: August 2, 2021   |   Posted By:

 

ఇష్క్‌ మూవీ రివ్యూ

విసుగెత్తించే లవ్ స్టోరీ :’ఇష్క్‌’ మూవీ రివ్యూ
Rating:2/5

కరోనా టైమ్ అయినా ధైర్యం చేసి థియోటర్ లోకి దూకుతున్నారంటే సినిమాపై ఆ దర్శక,నిర్మాతలకు మంచి నమ్మకాలు ఉన్నట్లే. అందులోనూ మనకు నమ్మకం కలిగించే ఎలిమెంట్ ..ఆ సినిమా మళయాళంలో ఇదే టైటిల్ తో వచ్చిన సూపర్ హిట్ కు రీమేక్. దానికి తోడు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌  వచ్చింది. ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ బాగానే ఏర్పడ్డాయి. మరి వాటిని‘ఇష్క్‌’ ఏ మేరకు అందుకుంది?  ‘జాంబి రెడ్డి’తో హీరోగా మారిన తేజ స‌జ్జా మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

వైజాగ్‌ కుర్రాడు  సిద్దు కు ఓ లవర్ అను(ప్రియా ప్రకాశ్‌ వారియర్‌). అను పుట్టిన రోజు కు మంచి ట్రీట్ ఇద్దామని ఆమెతో లాంగ్‌ డ్రైవ్‌ ప్లాన్‌ చేస్తాడు. ఇద్దరూ సరదాగా ఎంజాయ్‌ చేస్తారు. ఆఖరున అనుని ఓ ముద్దు ఇవ్వమని కోరతాడు సిద్దు. వీరిద్దరు ఏకంతంగా ఉన్న సమయంలో మాధవ్ (రవీంద్ర విజయ్).. పోలీసునంటూ వచ్చి వీళ్లను బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు.  రాత్రంతా కారులోనే వారితో ప్రయాణం చేసి, అనుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. పోలీసు ఆఫీసర్‌ అనే భయంతో మాధవ్‌ని సిద్దు ఏం చేయలేకపోతాడు. అయితే మరుసటి ఉదయం సిద్ధుకి మాధవ్‌ గురించిన నిజం తెలుస్తుంది. మాధవ్‌ నిజంగా పోలీసు ఆఫీసర్ కాదని అర్దం అవుతుంది. దాంతో తన లవర్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన మాధవ్‌కు సిద్ధు ఏ విధంగా బుద్ది చెప్పాడు? చివరకు అను, సిద్ధుల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.
 
విశ్లేషణ

చిన్న పాయింట్ కానీ దాన్ని ట్రీట్మెంట్ పరంగా తెలుగులో విస్తరించలేకపోయారు. మళయాళంలో అటువంటి సినిమాలు ఆడుతున్నాయి.కానీ తెలుగుకు వచ్చేసరికి మనకి మరిన్ని ఎలిమెంట్స్ అవసరం అవుతున్నాయి. అది డైరక్టర్ గమనించలేదు. యాజటీజ్ మళయాళ ఒరిజనల్ ని దింపేసే ప్రయత్నం చేసారు. దాంతో సబ్ ప్లాట్స్ లేని సింగిల్ లైన్ కథలా ఈ సినిమా సాగుతుంది. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి ..ఒకే పాయింట్‌ని పట్టుకొని డైరక్టర్ సాగదీస్తున్నాడే అనే ఫీలింగ్ వస్తోంది. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్‌. వాస్తవానికి జంటలపై దాడుల, వేధింపులు అనే పాయింట్‌ తెలుగు తెరపైకి కొత్తగానే ఉన్నా.. ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. అయితే ప్రీ క్లైమాక్స్ లో సిద్ధు, అనుల మధ్య వచ్చిన ట్విస్ట్ బాగుందనిపించింది. కానీ అప్పటికే మన సహనం నశిస్తుంది. సినిమా లా అనిపించలేదు ..ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్నట్లు అనిపించింది.  మొయిన్ పాయింట్ తీసుకుని స్క్రిప్టులో తెలుగు సినిమా గ్రామర్,గ్లామర్ కు తగ్గట్లు మార్పులు చేసి ఉంటే బాగుండేదేమో. ఏదైమైనా రీమేక్‌ సినిమాను పూర్తి స్థాయిలో తెరకెక్కించడంలో విఫలం అయినట్లుగా అనిపించింది. అనేక సందర్బాల్లో సన్నివేశాలు అర్థరహితంగా ఉండటం లేదా రిపీట్ అయినట్లుగా ఉండటం అనిపించింది.

నటీనటులు, మిగతా విభాగాలు

కొత్త దర్శకుడు ఎస్ ఎస్‌ రాజు రీమేక్ ని సరిగ్గా డీల్ చేయలేకపోయాడనిపిస్తుంది. ఎక్కడా మనని కథతో పాటు ప్రయాణం చెయ్యనివ్వడు. నేరేషన్ విసిగిస్తుంది.దర్శకుడు  కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. స్క్రీన్‌ ప్లే కూడా సాదా సీదాగా ఉంది. చాలా సీన్స్ వాస్తవానికి దూరంగా ఉన్నాయనిపించింది. అలాగే  చాలా వరకు సన్నివేశాలు ఇంతకు ముందు చూసిన ఫీల్ ను కలిగించాయి.   కొన్ని సన్నివేశాల్లో ఇంటెన్సిటీని పెంచడానికి ట్రై చేశాడు కానీ ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి ఇష్క్‌ సినిమా నిజంగానే ఒక ప్రేమ కథ కాదు.

అయితే టెక్నీషియన్స్ నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నాడు. స్వర సాగర్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ బాగుంది. అయితే పాటల విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్  అలాగే ఉంది. అనేక సీన్స్ సాగతీసినట్లుగా ఉన్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గొప్పగా లేవు. ఏదో చుట్టేసిన ఫీలింగ్ వచ్చింది. అయితే ఈ సినిమాకు ఒక  ప్లస్ సిద్ శ్రీరామ్ పాడిన పాట.. ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్ధులను చేసింది.

మొత్తానికి ఇష్క్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కాలేకపోయాడు తేజా సజ్జా. పక్కింటి కుర్రాడి లుక్స్ లో తేజ, పక్కింటమ్మాయి లుక్స్ లో ప్రియా వారియర్ బాగానే కుదిరారు కానీ  ఫలితం లేదు.  సెకండ్ హాఫ్ లో మాత్రం తేజ నటన బాగుంది.  విలన్ వేసినతను మాత్రం బాగా చేసాడు. ఫస్ట్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ గా నటనతో భయపెట్టాడు. ఇక మిగతా నటీనటులు పాత్రల మేరకు బాగానే రాణించారు.

చూడచ్చా…
ఒరిజనల్ ఇష్క్ సినిమా ఓటీటిలో దొరుకుతోంది. రిస్క్ చేసి థియోటర్ కు పోయి చూసేటంత సీన్ ఈ సినిమాకు లేదనిపిస్తుంది.

ఎవరెవరు..

నిర్మాణ సంస్థ‌:  మెగా సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్‌;
న‌టీన‌టులు: తేజ స‌జ్జా, ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌, ర‌వీంద‌ర్‌ త‌దిత‌రులు;
 సంగీతం: మ‌హ‌తి స్వర సాగ‌ర్‌;
ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు;
కూర్పు: ఎ.వ‌ర‌ప్రసాద్;
నిర్మాత‌లు: ఎన్వీ ప్రసాద్‌‌, ప‌రాస్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌;
 ద‌ర్శక‌త్వం: ఎస్‌.ఎస్‌.రాజు;
విడుద‌ల తేదీ: 30-07-2021
రన్ టైమ్:  2 గంట 1 నిమిషం