ఈసారి బిగ్ బాస్ ఏకంగా హైదరాబాద్ వచ్చేస్తున్నాడు

Published On: September 12, 2017   |   Posted By:

ఈసారి బిగ్ బాస్ ఏకంగా హైదరాబాద్ వచ్చేస్తున్నాడు

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం షూటింగ్ మొత్తం పూణెలోనే జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఒరిజినల్ హిందీ వెర్షన్ బిగ్ బాస్ ను ఎక్కడైతే షూట్ చేశారో.. అదే విల్లాలో తెలుగు బిగ్ బాస్ షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే నెక్ట్స్ సీజన్ నుంచి ఇలా పూణెకు వెళ్లాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ రియాలిటీ షో కోసం హైదరాబాద్ లోనే ఏర్పాట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ షో కోసం తారక్ ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిందే. ప్రతి వారం ఈ షూటింగ్ కోసం పూణె వెళ్లాల్సి వస్తోంది. అంతేకాదు, దీని కోసం తన జై లవకుశ షూటింగ్ ను కూడా పూణెలో పెట్టుకున్నాడు. ఆ టైమ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈసారి తారక్ కోసమైనా బిగ్ బాస్ లొకేషన్ ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని నిర్ణయించింది సదరు టీవీ ఛానెల్.

జై లవకుశ సినిమా షూటింగ్ పూర్తిచేసిన ఎన్టీఆర్.. ఆ మూవీ విడుదలైన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు.. బిగ్ బాస్ సెట్ ను హైదరాబాద్ లోనే వేయాలని కోరాడు ఎన్టీఆర్. త్వరలో అదే జరగనుంది.