ఉంగ‌రాల రాంబాబు మూవీ రివ్యూ

Published On: September 15, 2017   |   Posted By:

ఉంగ‌రాల రాంబాబు మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌:  యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్‌
తారాగ‌ణం:  సునీల్‌, మియాజార్జ్, ప్ర‌కాశ్‌రాజ్‌, వెన్నెలకిశోర్‌, హ‌రితేజ‌, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణ‌ముర‌ళి, న‌ల్ల‌వేణు త‌దిత‌రులు
సంగీతం:  జిబ్రాన్‌
కెమెరా: స‌ర్వేష్ మురారి
ఎడిటింగ్‌:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు,
ఫైట్ మాస్ట‌ర్‌:  వెంక‌ట్‌
మాట‌లు: చ‌ంద్ర‌మోహ‌న్ చింతాడ‌,
ఆర్ట్: ఎ.ఎన్‌.ప్ర‌కాశ్‌
ద‌ర్శ‌క‌త్వం:  కె.క్రాంతి మాధ‌వ్‌
నిర్మాత‌: ప‌రుచూరి కిరీటి

సునీల్ కి క‌మెడియ‌న్‌గా ఉన్న‌ప్పుడు ఉన్న క్రేజ్ వేరు. ఆ త‌ర్వాత హీరోగా అడ‌పాద‌డ‌పా సినిమాలు క్లిక్ అయినా మ‌ర్యాద‌రామ‌న్న సినిమాతో ఫుల్ ప్లెడ్జ్ డ్ హీరోగా మారిపోయాడు. ఆ త‌ర్వాత కూడా ఒక‌టీ అరా హిట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు సునీల్. ఆ హిట్టు `ఉంగ‌రాల రాంబాబు` రూపంలో వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. `ఓన‌మాలు`, `మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు` సినిమాల‌తో సెన్సిబుల్ డైర‌క్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా సునీల్ న‌టించిన సినిమా ఎలా ఉంది?  ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? అనేది ఆస‌క్తిక‌రం.

క‌థ‌:
రాంబాబు (సునీల్‌) సంప‌న్న కుటుంబానికి చెందిన వ్య‌క్తి. ఓ సంద‌ర్భంలో తాత‌తో పాటు ఆస్తిని కూడా పోగొట్టుకుని రోడ్డుమీద ప‌డ‌తాడు. అక్క‌డ బాదం బాబా (పోసాని కృష్ణ‌ముర‌ళి) ఆశ్ర‌మం చూసి లోప‌లికి వెళ్తాడు. బాబా చెప్పిన ఓ స‌ల‌హా మేర‌కు రాంబాబుకు రూ.200కోట్లు ల‌భిస్తాయి. వాటితో ట్రావెల్ బిజినెస్ చేసుకుంటుంటాడు. ఆ క్ర‌మంలో కొన్ని చికాకుల‌ను ఎదుర్కొంటాడు. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అత‌నికి బాబా ఓ స‌ల‌హా ఇస్తాడు. ఆ స‌ల‌హా మేర‌కు ఉంగ‌రాల రాంబాబు త‌న ఆఫీసులో ప‌నిచేసే సావిత్రి (మియాజార్జి)ని ప్రేమిస్తాడు. ఇంత‌కీ మియాజార్జి ఏం చెప్పింది?  రాంబాబును పెళ్లి చేసుకోవ‌డానికి ఒప్పుకున్నదా?  లేదా? అస‌లు రాంబాబు ఎప్పుడు, ఎలా ఉంగ‌రాల రాంబాబు అయ్యాడు వంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.
ప్ల‌స్ పాయింట్లు

సునీల్ ఎప్ప‌టిలాగానే న‌టించాడు. ఆస్తిని పోగొట్టుకున్న మ‌న‌వ‌డిగా, బాదం బాబా మాట‌ల ప‌ట్ల భ‌క్తి ఉన్న భ‌క్తుడిగా, హీరోయిన్ ప్రేమ‌ను పొంద‌డానికి ఆరాట‌ప‌డే వ్య‌క్తిగా బాగా న‌టించాడు. ఇంత‌కుముందుతో పోలిస్తే ఈ సినిమాలో డ్యాన్సులు కూడా బావున్నాయి. రంగ‌నాయ‌ర్ పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌ట‌న‌, బాదంబాబాగా పోసాని న‌ట‌న‌, ఆయ‌న శిష్యులుగా వేణు, ఆశిష్ విద్యార్థి, వెన్నెల కిశోర్ న‌ట‌న మెప్పించాయి. పాట‌లు విన‌డానికి బావున్నాయ‌నిపించాయి. కెమెరా కూడా ఫ‌ర్వాలేదు.

మైన‌స్ పాయింట్లు

క‌థ పేల‌వంగా ఉంటుంది. ఎక్క‌డైనా మ‌లుపు తీసుకుంటుందేమోన‌ని ఆశించే ప్రేక్ష‌కుడికి నిరాశ త‌ప్ప‌దు. క‌థ‌నంలోనూ కొత్త‌ద‌నం లేదు. స‌న్నివేశాలు ఒక ర‌కంగా సాగుతుంటే, బ్యాక్‌గ్రౌండ్ దాన్ని ఎలివేట్ చేయాల్సింది పోయి.. ఒకానొక సంద‌ర్భంలో హోరుగా త‌యార‌వుతుంది. ఉంగ‌రాల రాంబాబు అనే పేరు చూసే బోలెడంత కామెడీ ఉంటుంంద‌ని ఆశించే ప్రేక్ష‌కులకు మ‌న‌సారా, క‌డుపారా న‌వ్వుకునే ఛాన్స్ అంత‌గా ఉండ‌దు. కొన్ని సంద‌ర్భాల్లో స‌న్నివేశాల్లో ల్యాగ్ మ‌రీ ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంది. మందారం మందారం అంటూ కుక్క కోసం వెతికే సీన్లు స‌హ‌నానికి ప‌రీక్షే.
విశ్లేష‌ణ‌

ఎప్ప‌టినుంచో హిట్ కోసం వెయిట్ చేస్తున్న సునీల్ ఈ సారి క‌థ విష‌యంలో గ‌ట్టి జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు క‌నిపించ‌దు. క్రాంతిమాధ‌వ్‌ను గుడ్డిగా న‌మ్మి చేసిన‌ట్టు అనిపిస్తుంది. క్రాంతిమాధ‌వ్ కూడా క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రింత దృష్టి సారించి ఉంటే బావుండేది. ఉంగ‌రాల రాంబాబు అనే టైటిల్‌ను చూసిన ప్రేక్ష‌కులు ఆశించే వినోదం పాళ్లు ఇందులో మెప్పించ‌వు. పోసాని, ప్ర‌కాష్‌రాజ్ వంటి న‌టులున్నా వారిని స‌రిగా ఉప‌యోగించుకోలేక‌పోయార‌నే భావం క‌లుగుతుంది. మియాజార్జి కేవ‌లం ఆట‌పాట‌ల‌కు, కొన్ని సీన్ల‌కు ప‌రిమిత‌మైపోయింది త‌ప్ప పెద్ద‌గా చెప్పుకునే పాత్ర‌లో చేయ‌లేదు. సునీల్ పాత్ర‌లోనూ వైవిధ్యం లేదు.

ఊరించి ఊరించి ఊసేలేకుండా చేసిన‌ట్టు `ఉంగ‌రాల రాంబాబు` ఊరించినంత‌, ఊహించినంత గొప్ప‌గా లేడు.

రేటింగ్‌: 2/5