ఉందా లేదా మూవీ రివ్యూ

Published On: December 16, 2017   |   Posted By:

ఉందా లేదా మూవీ రివ్యూ

న‌టీన‌టులు: రామ‌కృష్ణ, అంకిత, కుమార్ సాయి, జీవా, రామ్‌‌జ‌గ‌న్, ఝాన్సీ, ప్రభావ‌తి
బ్యాన‌ర్: జ‌య‌క‌మ‌ల్ ఆర్ట్స్
ఎడిట‌ర్: మ‌ణికాంత్ తెల్లగూటి
కొరియోగ్రఫీ: నందు జెన్నా
పాట‌లు: నాగరాజు కువ్వార‌పు, శేషు మోహ‌న్
సింగ‌ర్స్: సింహ, హేమ‌చంద్ర, స్వీక‌ర్ అగ‌స్సీ
మ్యూజిక్: శ్రీముర‌ళీ కార్తికేయ
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె బంగారి
స‌హానిర్మాత‌లు: అల్లం సుబ్రహ్మణ్యం, అల్లం నాగిశెట్టి,
నిర్మాత: అయితం ఎస్ క‌మ‌ల్
ద‌ర్శక‌త్వం: అమ‌నిగంటి వెంక‌ట శివప్రసాద్

ఈమధ్య హారర్ సినిమాలు ఎక్కువైపోయాయి. మొన్నటివరకు హారర్ కామెడీ సీజన్ నడించింది. కానీ తాజాగా ప్యూర్ హారర్ సినిమాలు వస్తున్నాయి.  ఇదే కోవలోకి వస్తుంది ఉందా లేదా సినిమా. మరి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని భయపెట్టిందా.. అసలు ఈ సినిమాలో విషయం ఉందా లేదా?

కథ:
ఓ లేడీస్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది రుబీనా అనే అమ్మాయి. దెయ్యాలంటే అస్సలు నమ్మదు. దెయ్యాలు లేవని వాదిస్తుంటుంది. అయితే అదే హాస్టల్ లో, అదే రూమ్ లో కొన్ని నెలల కిందట ఓ అమ్మాయి చనిపోతుంది. ఆమె ఓ ముస్లి యువతి. కానీ హిందూ సంప్రదాయంలో దుస్తులు ధరించి మరీ ఉరేసుకుంటుంది. ఆ విషయం తెలిసినా కూడా రుబీనా దాన్ని పట్టించుకోదు. ఈ వ్యవహారంపై పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా అదే హాస్టల్ లోకి, అదే రూమ్ లోకి నందిని అనే డాక్టర్ వచ్చి చేరుకుంది. ఆమెకు కూడా దెయ్యలంటే నమ్మకం ఉండదు. అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయంపై రుబీనా, నందిని ఎప్పటికప్పుడు చర్చించుకుంటారన్నమాట. నందినిని ఒక సందర్భంలో చూసిన హీరో ప్రేమలో పడతాడు. ఫిలిం డైరక్టర్ అవ్వాలనుకునే ఈ కుర్రాడు నిత్యం నందినిని ఫాలో అవుతుంటాడు.
అంతా సాఫీగా సాగిపోతున్న టైమ్ లో నందిని ఉరేసుకోవడానికి సిద్ధపడుతుంది. దీన్ని హీరో ఆపుతాడు. సరిగ్గా ఇంటర్వెల్ కార్డు పడుతుంది ఇక్కడ. సెకెండాఫ్  ప్రతిసారి నందిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, హీరో ఆపుతుంటాడు. మరీ ముఖ్యంగా గతంలో ముస్లిం యువతి చనిపోయిన విధంగానే ముస్తాబై ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది నందిని. దీంతో సీన్ లోకి పోలీసులు మరోసారి ఎంటర్ అవుతారు. ఫైనల్ గా తన ప్రేయసి నందినిని హీరో ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ కథ.

ప్లస్ పాయింట్స్
–      స్టోరీలైన్
–      రామ్ జగన్, ఝాన్సీ పాత్రలు
మైనస్ పాయింట్స్
–      హీరోహీరోయిన్లు
–      మ్యూజిక్
–      దర్శకుడు
–      సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ
ఉందా లేదా అనే టైటిల్ తో బాగానే ఎట్రాక్ట్ చేశాడు దర్శకుడు వెంకట శివప్రసాద్. కానీ సినిమా అంతా చూసిన తర్వాత అసలు ఇందులో కథ ఉందా లేదా అని ప్రేక్షకులు అనుకునేలా చేశాడు. మంచి కథ సెలక్ట్ చేసుకున్న దర్శకుడు.. దాన్ని తెరపై చూపించడంలో అట్టర్ ఫెయిల్ అయ్యాడు. చిన్న సినిమా కాబట్టి అన్ని హంగులు చూపించేద్దాం అనుకున్నాడు. అసలు వ్యవహారాన్ని గాలికి వదిలేశాడు.
హీరోహీరోయిన్ల విషయానికొస్తే హీరోగా నటించిన రామకృష్ణ చాలా డెవలప్ అవ్వాలి. యాక్టింగ్ లో మంచిగా ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. ఒక్కటంటే ఒక్క సీన్ లో కూడా మెప్పించలేకపోయాడు. క్లయిమాక్స్ లో అయితే రామకృష్ణను భరించడం చాలా కష్టం. హీరోయిన్ పరిస్థితి కూడా అంతే. కళ్లు పెద్దవి చేసి చూస్తే చాలనుకుంది.  అంతకుమించి ఎలాంటి హావభావాలు పలికించలేకపోయింది అంకిత. లో-బడ్జెట్ లో తెరకెక్కిక ఈ సినిమాలో నటీనటుల గురించి మాట్లాడాల్సి వస్తే రామ్ జగన్, ఝాన్సీ గురించి మాత్రమే కూసింత చెప్పుకోవాలి.
టెక్నికల్ గా కూడా సినిమా చాలా వీక్. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, ఆర్ట్.. ఇలా ఏ ఒక్క అంశం ఈ మూవీకి కలిసికాలేదు. చివరికి కాస్ట్యూమ్ డిపార్ట్ మెంట్ కూడా “ఉందా లేదా” అనిపించింది.  నిర్మాత అయితం కమల్ మాత్రం ఉన్నంతలో సినిమాను కాస్త బాగానే తీయడానికి ప్రయత్నించాడు. కానీ సరైన సపోర్ట్ లేక అతడి డబ్బులు వృధా అయ్యాయి.
ఓవరాల్ గా ఉందా లేదా సినిమా ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేస్తుంది. భయపెట్టడం మాట అటుంచి చిరాకు తెప్పిస్తుంది.
రేటింగ్ – 2/5