‘ఎబిసిడి’ సినిమా రివ్యూ

Published On: May 17, 2019   |   Posted By:

‘ఎబిసిడి’ సినిమా రివ్యూ

అక్కడితోనే ఆగిపోయాడు ( ‘ఎబిసిడి’ రివ్యూ )

రేటింగ్  :  2/5

టైమ్, డబ్బు ఖర్చు పెట్టి ఖచ్చితంగా థియేటరుకు వెళ్లి సినిమా చూడాలంటే  ఆ  హీరోకు ఒక రేంజ్ ఉండాలని సగటు ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. దాంతో  చిన్న హీరోల  సినిమాలకు మంచి రోజులు ముగిసిపోయాయి. అయితే అదే సమయంలో మంచి కంటెంట్ ఉంటే హీరో ఎవరనేది కూడా చూడకండా చిన్న సినిమాని ఆదరిస్తున్నాడు. ఈ చిత్రమైన నేఫధ్యంలో అల్లు శిరీష్ తన కొత్త చిత్రం ‘ఏబీసీడీ’తో బాక్సాఫీస్ వేటకు వచ్చాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో ఒడ్డున పడినట్లే  కనిపించిన అల్లు శిరీష్  ‘ఒక్కక్షణం’తో ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో ఈ సినిమాపై శిరీష్, అల్లు ఫ్యామిలీ చాలా ఆశలే పెట్టుకున్నారు. వాటిని ఈ సినిమా రీచ్ అవుతుందా ? మళయాళ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అక్కడలాగే ఇక్కడ కూడా మంచి హిట్ అవుతుందా ? రీమేక్ చేసేటంత గొప్ప కథ ఈ సినిమాలో ఏముంది ? వంటి విషయాలు  రివ్యూలో చూద్దాం.

కథేంటి…

రూపాయి విలువ తెలియకుండా పెరుగుతాడు ఎన్నారై అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్). తన తండ్రి విద్యా ప్రసాద్(నాగబాబు) మిలియనీర్ కావటంతో ఎప్పుడూ పార్టీలు, పబ్ లు అంటూ భాధ్యత లేకుండా డబ్బు ఇష్టానుసారం ఖర్చుపెడుతూంటాడు. అరవింద్ కు తోడు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌). ఇలా బేవర్స్ గా బలాదూర్ తిరుగుతూ నెలకు ఇరవై వేల డాలర్లు ఖర్చు పెట్టేస్తారు. దాంతో తండ్రికు జ్ఞానోదయం అయ్యి ఇక్కడుండే తన కొడుకు ఎందుకు పనికిరాకుండా పోతాడని అర్దం చేసుకుంటాడు. కొడుకు బాగుపడాలంటే ఇండియాలో కొంతకాలం గడపటమే మార్గం అని నమ్మి అక్కడకు వెకేషన్ కు వెళ్లమంటాడు. 

ఆ తర్వాత వాళ్లకు డబ్బు అందే మార్గాలు అన్ని కట్ చేసి, క్రెడిట్ కార్డ్ లు బ్లాక్ చేసి రూపాయి చేతికి అందకుండా ఆపుతాడు. దాంతో డబ్బుల్లేక గిజగిజలాడే అరవింద్ కు నెలకు ఐదు వేలు ఇస్తానంటాడు దాంతో అక్కడ ఎంబీఏ పూర్తి చేసి రావాలనే కండీషన్ పెడతాడు. వేరే దారి లేక హైదరాబాద్ లో ఆ ఐదువేలతో ఆ అపరకుబేరుడి కొడుకు ఎలా మేనేజ్ చేసాడు ? ఇక్కడ పరిస్దితులను ఎలా తట్టుకున్నాడు ? లోకల్ పొలిటిషన్ కొడుకు శిరీష్ (రాజా )తో వచ్చిన విరోధం ఏమిటి ? నేహా (రుక్సార్ థిల్లాన్) తో ఎలా  ప్రేమలో పడ్డాడు? చివరకు అరవింద్ లో మార్పు వచ్చిందా ? డబ్బు విలువ తెలుసుకున్నాడా ? అమెరికా తిరిగి వెనక్కి వెళ్లాడా  లేదా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

వర్కవుట్ అవుతుందా…

నిజానికి ‘ఏబీసీడీ’ ప్రోమోలు చూస్తే బాగానే అనిపించాయి. దాంతో ఓపినింగ్స్ ఎలా ఉన్నా మౌత్ టాక్ బాగుంటే వర్కువుట్ అయ్యే అవకాసం ఉందని అంతా భావించారు. అయితే ఇలాంటి హీరో  సినిమాకు ఓ మాదిరి టాక్ వస్తే మాత్రం కష్టమే. అదిరిపోయిందన్న టాక్ రావాలి. అది స్ప్రెడ్ కావాలి. అప్పుడే ‘ఏబీసీడీ’ హిట్ లో పడుతుంది అని లెక్కలు వేసారు. కానీ ఈ సినిమా పరిస్దితి చూస్తే అలాంటి సీన్ కనపడటం లేదు.   మళయాళంలో ఈ సినిమా హిట్ అవటానికి కారణాలు కేవలం కథ మాత్రమే కాదు అక్కడ దుల్కర్ కు ఉన్న క్రేజ్, అతని నటన. అతి సామాన్యమైన  స్టోరీ లైన్ ని సైతం తన అసాధారణ ప్రతిభతో నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే అతని గొప్పతనం. ఇక్కడ శిరీష్ లో అది మిస్సైంది. సాదాసీదాగా చేసుకుంటూ పోయారు. దాంతో ఓ సాదా సీదా కథలో మరో సాదాసీదా నటుడు నటిస్తే ఏమి అవ్వాలో అదే జరిగింది. ఏ మాత్రం ఆకర్షణ లేని అతి సాధారణ చిత్రం బయిటకు వచ్చింది. అసాధారణంగా ఉంటే గానీ అల్లు శిరీష్ సినిమాకు వెళ్ళలేని పరిస్దితి బయిట ఉంటే ఇలాంటి అతి సాధారణ చిత్రం ఏం చెయ్యగలుగుతుంది. 

స్క్రీన్ ప్లే నే సమస్య…

ఈ సినిమాలో సబ్ ప్లాట్స్, ఒరిజనల్ లో లేని హీరోయిన్, విలన్ వంటివి కూడా తీసుకొచ్చి కలిపారు. ఎన్ని కలిపినా అవి పాలలో నీళ్లలాగ కలిసిపోతే ఏ సమస్యా లేదు. కానీ ఇందులో దేనికదే విడివిడిగా కనపడి మనని కంగారుపెడుతుంది. డైరక్టర్ కన్ఫూజన్ కనపడుతుంది. ఒరిజనల్ మళయాళ వెర్షన్ లోనే సెకండాఫ్ సమస్య ఉంది. హీరో లో వచ్చే మార్పుని ఆ సినిమా సరిగ్గా ఎలివేట్ చెయ్యదు. అదే ఇక్కడా రిపీట్ అయ్యింది. అక్కడ దుల్కర్ దాన్ని కవర్ చేసారు.ఇక్కడ శిరీష్ దాన్ని దాయలేకపోయాడు. ఆ విషయం దర్శకుడు ముందే గమనించి స్క్రీన్ ప్లేనే దాన్ని సరిచేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. 

శిరీష్ ఎలా చేసినా…

శిరీష్ బాగా నటించాడు కానీ సినిమాలో క్యారక్టర్ కు తగినట్లు కనపడలేదు. హీరో బిహేవియర్ కానీ, హీరో డ్రస్సింగ్ కానీ ఏ విషయంలోనూ సీన్స్ కు తగినట్లు ఉండదు. రూపాయి చేతిలో లేక విలవిల్లాడే హీరో బ్రాండెడ్ డ్రస్ లు కాస్ట్ర్లీవి వేసుకుని తిరుగుతూంటాడు. ఇది చిన్న ఉదాహరణే. ఇలాంటివి ఈ సినిమాలో కోకొల్లలు. ఇక హీరోయిన్ కు పెద్దగా మాట్లాడుకునేంత సీన్స్ లేవు. మిగతా సీనియర్స్ ఎప్పటిలాగే అలవాటు కొద్దీ నటించుకుంటూ పోయారు. వారికి వంకపెట్టేదేముంది. సినిమాలో హైలెట్ వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్. 

టెక్నికల్ గా…

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్.  ఇక సంగీత దర్శకుడు జుధా సాంధీ అందించిన పాటలు జస్ట్ ఓకే. అయితే  సెకండాఫ్ లో వచ్చే  మెల్లగా మెల్లగా సాంగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సరైన అవుట్ పుట్ తీసుకునే డైరక్టర్ పడితే ఈ మ్యూజిక్ డైరక్టర్ మంచి స్దాయికు వెళ్తాడు. నవీన్ నూలి ఎడిటింగ్ షాప్ప్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి. 

చూడచ్చా…

అక్కడక్కడా నవ్వించే ఈ సినిమా ముక్కముక్కలగా టీవీల్లో చూసినా పెద్ద ఇబ్బందిగా అనిపించదు

తెర వెనక, ముందు…

నటీనటులు: అల్లు శిరీష్‌, రుక్సార్ ధిల్లన్‌‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు, రాజా, కోట శ్రీనివాస‌రావు, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల‌ కిషోర్ త‌దితరులు

సినిమాటోగ్రఫీ: రామ్‌ 

కూర్పు‌: న‌వీన్ నూలి

నిర్మాత‌లు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని

సంగీతం: జుదా సాందీ

స‌మ‌ర్పణ‌: డి.సురేష్‌బాబు

సంస్థ: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ 

దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి

విడుద‌ల‌: 17-05-2019