ఏంజెల్ హీరో నాగ అన్వేష్ ఇంటర్వ్యూ

Published On: November 2, 2017   |   Posted By:

ఏంజెల్ హీరో నాగ అన్వేష్ ఇంటర్వ్యూ

ఒకప్పుడు బాలనటుడు.. ఇప్పుడు హీరోగా మారాడు. కేవలం హీరోగా మారడం కాకుండా ఏకంగా 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా చేశాడు. అతడే నాగ అన్వేష్. ఏంజెల్ సినిమాతో కమర్షియల్ హీరోగా సెటిలవ్వడానికి దూసుకొస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో చాలా ఎట్రాక్షన్స్ ఉన్నాయంటున్న నాగ అన్వేష్.. మీడియాతో మాట్లాడాడు.

రెండేళ్ల శ్రమ

ఏంజెల్ సినిమాపై దాదాపు ఏడాదిన్నర స్క్రిప్ట్ వర్క్ చేశాం. 5 నెలలు షూట్ చేశాం. మరో 6 నెలలు గ్రాఫిక్ వర్క్ చేశాం. చాలా లాంగ్ ప్రాసెస్ లో తెరకెక్కిన సినిమా ఇది.

మెయిన్ హైలెట్స్ ఇవే

ఈ మూవీలో మెయిన్ హైలెట్స్ కామెడీ, విజువల్ ఎఫెక్ట్స్, సరికొత్త స్టోరీలైన్. సోషియో ఫాంటసీ అంటే సీరియస్ గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇదొక ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. సోషియో ఫాంటసీని కమర్షియల్ యాంగిల్ లో ప్రజెంట్ చేశారు దర్శకుడు పళని.

ముందే సినిమా చూపించాం

సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లకు కాస్త ముందుగానే సినిమా చూపించాం. అంతా హ్యాపీ. నా సెకెండ్ సినిమాకే ఇంత బడ్జెట్ పెట్టడం, ఇలాంటి స్టోరీ చేయడంతో చాలా టెన్షన్ పడ్డాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓ మంచి సినిమా వస్తే, అది చిన్నదా పెద్దగా అని ప్రేక్షకులు చూడ్డం లేదు. కంటెంట్ బాగుంటే హిట్ చేస్తున్నారు. కేవలం ఆ నమ్మకంతోనే ఈ సినిమాకు 30 కోట్లు పెట్టాం.

ఓవర్సీస్ పై కూడా నమ్మకం ఉంది

కనీసం 10 సినిమాలు చేస్తేనే ఓవర్సీస్ లో అంతోఇంతో గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు కొత్తవాళ్లకు కూడా ఓవర్సీస్ లో గుర్తింపు వస్తోంది. స్టోరీ బాగుంటే కొత్త హీరో అయినా ఓవర్సీస్ లో చూస్తున్నారు. ఆ నమ్మకంతోనే రంగంలోకి దిగాం.

నేను ఓ స్మగ్లర్

సినిమా నా క్యారెక్టర్ స్మగ్మర్. నేను సప్తగిరి కలిసి మంచి మంచి విగ్రహాల్ని బోర్డర్ దాటిస్తుంటాం. పక్కా మాస్ క్యారెక్టర్లు. అలా విగ్రహాల్ని దాటిస్తుంటే.. దారిలో హెబ్బా మాకు తగులుతుంది. మధ్యలో విగ్రహం మిస్సింగ్. అప్పుడు సీన్ లోకి షియాజీ షిండే వస్తారు. ఇలా కథ ఓ ఫ్లోలో వెళ్తుంది. కంప్లీట్ కామెడీలో సినిమా వెళ్తుంది. అసలు మేం కొట్టేసిన విగ్రహానికి, స్వర్గానికి లింక్ ఏంటి.. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఎలా ఎంటర్ అవుతాయనేది స్టోరీ.

45 నిమిషాలు గ్రాఫిక్స్

ఈ సినిమాకు రమేష్ గారు లైన్ చెప్పారు. పళని గారు దాన్ని స్క్రిప్ట్ గా మార్చారు. నిజానికి స్టార్టింగ్ లో ఈ సినిమాను నేను అంగీకరించలేకపోయాను. ఎందుకంటే గ్రాఫిక్స్ సరిగ్గా రాకపోతే సినిమా పోతుంది. అందుకే గ్రాఫిక్స్ ను 12 నిమిషాలకే కుదించి సినిమా నెరేట్ చేశారు. అప్పుడు ఒప్పుకున్నాడు. కానీ గ్రాఫిక్స్ టీం చేసిన అవుట్ పుట్ చూసి 12 నిమిషాల్ని 45 నిమిషాల గ్రాఫిక్స్ కు పెంచాం. అవుట్ పుట్ చాలా బాగుంది

త్వరలోనే తమిళ్, హిందీలో కూడా..

ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేయబోతున్నాం. రేపు తెలుగులో వస్తుంది. తర్వాత తమిళ్, హిందీలో వస్తుంది. అక్కడ్నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలో నేనే లీడ్ తీసుకున్నాను. కానీ నాతో పాటు సినిమా అంతా సప్తగిరి ఉంటాడు. మా ఇద్దరి కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయింది. కామెడీ అద్భుతంగా పండింది.

సినిమాలో స్వర్గాన్ని చూపించాం

ఈ సినిమాలో స్వర్గాన్ని చూపిస్తున్నాం. బాహుబలితో కంపేర్ చేయలేం కానీ బాగానే వర్కవుట్ చేశాం. స్వర్గం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. కాబట్టి కాస్త ఫిక్సన్ జోడించి బాగానే చూపించాం. దీని తర్వాత క్లయిమాక్స్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో గ్రాఫిక్స్ అద్భుతంగా వచ్చాయి. సినిమా కంప్లీట్ అయిన తర్వాత అందరికీ గుర్తుండిపోయేది క్లైమాక్స్ ఫైటే.

గ్యాప్ తీసుకున్నది అందుకే

ఫస్ట్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోవడానికి కారణం మేకోవర్. అప్పట్లో మరీ చిన్న పిల్లాడిలా ఉండే వాడ్ని. ఈ సినిమాకు లుక్, ఫిజిక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. డబ్బింగ్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇంట్లో ప్రతి సీన్ రిహార్సల్ చేశాను. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా డెవలప్ అయ్యానని అనుకుంటున్నాను.

దర్శకుడు పళని గురించి..

దర్శకుడు పళని పై మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో రుద్రమదేవి, బాహుబలి సినిమాలకు ఈయన వర్క్ చేశారు. ఆ రెండింటిలో గ్రాఫిక్స్ ఉన్నాయి. కాబట్టి గ్రాఫిక్స్ ను పళని హ్యాండిల్ చేయగలరనే నమ్మకంతో.. ఏంజెల్ ప్రాజెక్టును అతనికి అప్పగించాం.

లేట్ అవ్వడానికి కారణం

రిలీజ్ డేట్ వాయిదాపడ్డానికి కారణం గ్రాఫిక్సే. అనుకున్న టైమ్ కు గ్రాఫిక్స్ వర్క్ కాకపోవడంతో రిలీజ్ వాయిదాపడింది. ఆర్థికంగా కూడా పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి వెయిట్ చేశాం. గ్రాఫిక్స్ బాగున్నాయి కాబట్టే హిందీ శాటిలైట్ కు మంచి రేట్ వచ్చింది. ఆంధ్రా బయ్యర్లు కూడా మంచి రేటుకు కొన్నారు. ఇదంతా గ్రాఫిక్స్ మూలంగానే సాధ్యమైంది.

వినాయక్ సహకారం మరువలేనిది

ఈ సినిమాకు వినాయక్ గారు చాలా హెల్ప్ చేశారు. స్క్రిప్ట్ దశ నుంచి వినాయక్ కేర్ తీసుకున్నారు. చాలా కరెక్షన్లు చెప్పారు. ప్రతి స్టేజ్ లో సహాయ సహకారాలు అందించారు. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఎడిటింగ్ దశలో కూడా కూర్చున్నారు. వినాయక్ సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాతే విడుదల చేస్తున్నాం. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని వినాయక్ నాతో వ్యక్తిగతంగా చెప్పారు.

నెక్ట్స్ సినిమా బయట బ్యానర్ లో..

నా మూడో సినిమాను బయట బ్యానర్ లో చేయాలని అనుకుంటున్నాను. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయింది. బయట ప్రొడక్షన్ ఒప్పుకుంటే చేస్తాను. స్క్రిప్ట్ కు న్యాయం చేసే ప్రొడ్యూసర్లు దొరికితే బయట ప్రొడక్షన్ లోనే చేస్తాను.