ఏజెంట్ వినోద్ మూవీ ప్రి-లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Published On: August 6, 2020   |   Posted By:

ఏజెంట్ వినోద్ మూవీ ప్రి-లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

ఆస‌క్తిక‌ర‌మైన అభిషేక్ పిక్చ‌ర్స్ ‘ఏజెంట్ వినోద్’ ప్రి-లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

టాలీవుడ్‌లోని పేరు పొందిన డిస్ట్రిబ్యూష‌న్‌, ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌లో ఒక‌టైన అభిషేక్ పిక్చ‌ర్స్ మ‌రో ఉత్తేజ‌క‌ర‌మైన ప్రాజెక్ట్‌తో వ‌స్తోంది. ‘ఏజెంట్ వినోద్’ అనే టైటిల్‌తో రూపొందే ఈ సినిమా ప్రి-లుక్‌ను గురువారం విడుద‌ల చేశారు.

ఆ లుక్‌లో పుస్త‌కాలు, తాళాలు, లాంత‌రు, టైపింగ్ మెషీన్‌, పెన్ను, కెమెరా, గ‌డియారం, ప్ర‌పంచ‌ప‌టం వంటి పాత కాలం నాటి వ‌స్తువులు క‌నిపిస్తున్నాయి. వాటితో పాటు గ‌న్‌, ర‌క్త‌పు మ‌ర‌క‌లు, ఒక వ్య‌క్తి నీడ క‌నిపిస్తుండ‌టంతో ఇది ఉత్కంఠ‌భ‌రిత‌మైన క్రైమ్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతోంది. ఆ నీడ ఎవ‌రిది? ఏజెంట్ వినోద్‌దా? లేక ఎవ‌రైనా క్రిమిన‌ల్‌దా? ఏదేమైనా ఈ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తున్న‌దెవ‌రో తెలుసుకోవాలంటే ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేవ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

ప్రి-లుక్ ఆస‌క్తి రేపుతుండ‌గా, టైటిల్ డిజైన్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

వింటేజ్ స్పై డిటెక్టివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ‘ఏజెంట్ వినోద్‌’లో ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.

వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా దాదాపు 40 హాలీవుడ్ ఫిలిమ్స్‌కు వ‌ర్క్ చేసిన న‌వీన్ మేడారం ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇది ఆయ‌న‌కు మూడో చిత్రం. ఆయ‌న వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేసిన వాటిలో హారీపోట‌ర్‌, పైరేట్స్ ఆఫ్ ద క‌రీబియ‌న్‌, ప్రిన్స్ ఆఫ్ ప‌ర్షియా, 2012, బ్యాట్‌మ్యాన్: ద డార్క్ నైట్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి.

అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవాన్ష్ నామా, ర‌వి పుట్టా స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, జ‌గ‌దీష్ చీక‌టి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సాంకేతిక బృందం:
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీష్ చీక‌టి
ఎడిటింగ్‌: అన్వ‌ర్ అలీ
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌: దేవాన్ష్ నామా, ర‌వి పుట్టా
నిర్మాత‌: అభిషేక్ నామా
ద‌ర్శ‌కుడు: న‌వీన్ మేడారం
బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌