ఏదైనా జరగొచ్చు మూవీ రివ్యూ

Published On: August 24, 2019   |   Posted By:
ఏదైనా జరగొచ్చు మూవీ రివ్యూ
 

ప్చ్..అదే జరిగింది(‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ)

Rating: 2/5


ఏప్రియల్ ఒకటిన పుట్టిన  ముగ్గురు కుర్రాళ్లు తాము ఫూల్స్ కాదని నిరూపించుకోవాలని ఆరాట పడుతూంటారు. అందుకోసం ఏదైనా చేయటానికి సిద్దపడతారు.సాహసాలు చేస్తూంటారు. ఆ క్రమంలో ముగ్గరులో ఒకరైన జై (విజయ్ రాజా) ఓ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా జాయిన్ అవుతాడు. ఆ ఉద్యోగంలో భాగంగా శశిరేఖ (పూజా సోలంకి) దగ్గర డబ్బు వసూలు చేయటానికి వెళ్తాడు. ఆమె హీరోయిన్ కావటంతో ప్రేమలో పడతాడు. ఆమె ఓ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి నష్టపోయి ఉందనే విషయం తెలుసుకుని ఆమెను ఎలా ఆ ఆర్దిక కష్టాల నుంచి బయిటపడేయాలని తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ ఆలోచన చేస్తాడు జై. అందుకోసం క్రికెట్ బెట్టింగ్ కట్టి గెలిచి , ఆ డబ్బు వసూలు చేసుకోవటానికి కాళీ (బాబీసింహా) అనే ఓ రౌడీని కలుస్తారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్. కాళీ ఓ దెయ్యంతో ఉంటాడు . ఆ దెయ్యం వీళ్లను చూసి వెంటబడుతుంది. అక్కడ నుంచి వీళ్లు ముగ్గరూ పరుగో పరుగు. ఇంతకీ దెయ్యమైన ఆ అమ్మాయి ఎవరు. కాళీతో ఎందుకు ఉంటోంది. తమ డబ్బుని జై వసూలు చేసుకోగలిగాడా..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
డార్క్ కామెడీనే కానీ..


కొత్త నీరు ఎప్పుడూ ఆహ్వానమే.కొత్త దర్శకులు ఇండస్ట్రీకి రావటం అవసరమే. కానీ కొత్త పేరుతో చెత్త వస్తేనే ఇబ్బంది.  ఓ ప్రక్కన క్రియేటివిటీతో కొత్త వాళ్లు తెరపై తామేంటో ప్రూవ్ చేసుకుంటూంటే..మరికొంత మంది కొత్త దర్శకులు మాత్రం ఇండస్ట్రీకి వచ్చాం…ఏదో ఒక సినిమా చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లుగా చుట్టేస్తున్నారు. అయితే వీటి వల్ల ఎవరికి ఏం ఉపయోగమో..వాళ్లకీ తెలియదు. చూసినవాళ్లకు అంతకుమించి అర్దం కాదు. ఈ సినిమాలకు బిజినెస్ ఉండదు. చూసే ప్రేక్షకులు ఉండరు. కేవలం రివ్యూ లు రాసే జనం తప్ప. ఇలాంటి చిత్ర రాజమే ఇది. ఓపినింగ్స్ ఏ మాత్రమూ రప్పించుకోలేని ఈ చిత్రం  ధైర్యం చేసి థియోటర్ లో దూరిన వారికి సహన పరీక్ష పెడుతుంది.  ఈ డార్క్ కామెడీ సినిమా ఎప్పుడు అయ్యిపోతుందా అని ఎదురుచూసేలా చేస్తుంది. బయిట ఏ కుండపోతగా వర్షమో వస్తే తప్ప చివరి దాకా సినిమా చూడటం కష్టమనిపిస్తుంది. లేకపోతే ఎంత కామెడీ కోసమైతే మాత్రం మరీ ఇంతలా దెయ్యం తో గోల చేయించాలా అని డైరక్టర్ తో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది. దెయ్యం ఎంట్రీ ఇచ్చాక కథ …డామిట్ కథ అడ్డం తిరిగింది స్దాయిలో చూసేవాళ్ల చేత డిస్కో డాన్స్ లు వేయించాల్సింది పోయి..రిపీట్ సీన్స్ తో ..తెరపై ఏమీ జరగక డల్ గా మారిపోతుంది. 

సాంకేతికంగా..


ఇలాంటి ఈ సినిమాలకు రీరికార్డింగ్  చాలా ఇంపార్టెంట్. అయితే సంగీత దర్శకుడు శ్రీకాంత్ పెండ్యాల ఆ విషయం గమనించినట్లులేరు. ఇక సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మిగతా విభాగాల్లో చెప్పుకునేంత ఏమీ లేదు. హార్రర్ గ్రాఫిక్స్ సోసో. కొత్త దర్శకుడు కథ ఎంచుకోవటంలోనే దారి తప్పాడు. మళ్లీ ఇంకో సినిమా పట్టి కెరీర్ ను సరైన దారిలో పెట్టుకోవటం తప్ప వేరే దారి లేదు.  నటీనటుల్లో బాబీ సింహా, అజయ్ ఘోష్ ..వీళ్లిద్దరూ ఇరగదీసారు.

చివరి మాట

ప్రేమ కథా చిత్రం వచ్చి చాలా కాలమైనా ఆ కథా ఛాయలు వదిలి పెట్టబుద్ది ముందుకు వెళ్లకపోతే ఎలా.  ఆ సినిమా హిట్ అప్పుడు చేసుకున్న కథతో ఇన్నాళ్లకు తెరకెక్కించారనుకోవాలా…ఎలా అనుకున్నా..ఏమి అనుకున్నా…సినిమా బాగోపోతే …ఏదైనా జరగచ్చు అనే పాజిటివ్ థృక్పధానికి నీళ్లు వదిలేసుకోవాల్సిందే. 

చూడచ్చా…

హర్రర్ కామెడీలకు ఎడిక్ట్ అయ్యిపోయి..ఏదో ఒకటైనా చూసేద్దాం అనుకునేవాళ్లు వెళ్లచ్చు. 
 
   
తెర ముందు వెనక…

నటీనటులు : విజయ్‌ రాజా, బాబీ సింహా, పూజా సోలంకి, సాషా సింగ్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు.
సంగీతం : శ్రీకాంత్‌ పెండ్యాల
నిర్మాత : సుదర్శన్‌ హనగోడు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రమాకాంత్‌