కురుప్ మూవీ రివ్యూ

Published On: November 16, 2021   |   Posted By:
కురుప్ మూవీ రివ్యూ
Kurup Telugu Movie Review - Captivating Criminal Biopic
 
 
దుల్కర్ సల్మాన్ ‘కురుప్’ రివ్యూ


 Emotional Engagement Emoji (EEE) 
 
👍

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కేరళలోనే కాదు మహానటి రిలీజ్ తర్వాత ఇక్కడ కూడా  ఫాలోయింగ్ వచ్చింది. అందుకే ఆయన చేసిన సినిమాలు ఇక్కడ కూడా మంచి ఓపినింగ్స్  కలెక్షన్స్‌ని అందుకుంటూ ఉంటాయి. తాజాగా ఆయన చేసిన కొత్త చిత్రం ‘కురుప్’ విడుదలై మళయాళంలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. తెలుగులో ఈ సినిమా పరిస్దితి ఏమిటి..అసలు ఈ చిత్రం కథ ఏమిటి..చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్

కేర‌ళ‌లో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి గోపీకృష్ణన్ కురుప్ అలియాస్ జీకే (దుల్కర్ సల్మాన్) పరీక్షలో ఫెయిల్ అవటంతో వేరే దారిలేక ఇంట్రస్ట్ లేకపోయినా.. ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవుతాడు. అయితే  గోపి కృష్ణన్ ది మొదటి నుంచి కన్నింగ్ ప్రవర్తన,స్వేచ్చా జీవితం కోరుకునే వ్యక్తి. దాంతో మిలటరీలో ఇమడటం కష్టంగా ఉంటుంది. అక్కడ మందు బాటిళ్లు,షూలు అన్ని అమ్మేసి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూంటాడు.  ఈ క్రమంలో పనిమనిషి కూతురు శారదాంబ (శోభితా ధూళిపాళ)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఇంక ఆ ఎయిర్ ఫోర్స్ లో ఆయుధాలు సైతం అమ్మేయటానికి స్కెచ్ వేసి దొరికిపోయే సిట్యువేషన్ వస్తుంది. దాంతో తను సూసైడ్ చేసుకున్నట్లు నమ్మించి వేరే పేరుతో సుధాకర్ కురుప్ గా దుబాయి పారిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి దుబాయి నుంచి వచ్చి మరోసారి ఓ  బిగ్ క్రైమ్ చేసి తాను చనిపోయినట్లు అందర్నీ నమ్మించే ప్రయత్నం చేద్దామనుకుంటాడు. , అచ్చం తన పోలికలతో ఉండే ఓ శవాన్ని వెతికి పట్టుకుని, అది తన శవంగానే భ్రమింపచేసి ఇన్సూరెన్స్‌ డబ్బు తీసుకోవాలనుకున్నాడు.కానీ ఈ సారిపోలీస్ ల  దృష్టిలో పడిపోయాడు. అప్పుడు ఏమైంది ? అలాగే సుధాకర్ కురుప్ నుంచి మళ్ళీ అలెగ్జాండర్ గా ఎలా మారాడు ? అన్నిటికీ మించి అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ?  అత‌ని కోసం అన్వేష‌ణ ప్రారంభించిన పోలీసు అధికారుల‌కు ఎలాంటి విష‌యాలు తెలిశాయి?  చివరకు అతను ఏమి సాధించాడు ? అనేది మిగిలిన కథ.
 

ఎనాలసిస్ …

వాస్తవానికి దుల్కర్‌ సల్మాన్ హీరోగా వస్తున్న కురుప్‌ సినిమా విడుదలకు ముందే బోలెడంత క్యూరియాసిటీని జనరేట్‌ చేసింది. అందుకు కారణం అది ఓ భయంకరమైన క్రిమినల్‌ జీవిత కథ ఆధారంగా రూపొందినక్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ కావడమే!   ఇంచుమించు 38 ఏళ్లయినా ఇప్పటికీ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడు సుకుమార్‌ కురుప్‌ కథ నిజంగానే ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే అతడి కథ ఆధారంగా ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. దుల్కర్‌ నటించిన కురుప్‌ సినిమా మూడోది. 1984లో ఎన్‌హెచ్‌ 7 అనే సినిమాకు ఆధారం కురుప్‌ జీవితకథే! 2016లో ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తీసిన పిన్నెయుమ్‌ సినిమా కూడా కురుప్‌ క్రైమ్‌ స్టోరీ ఆధారంగా తీసిందే! కేరళ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను ముప్పు తిప్పలు పెట్టిన సుకుమార్‌ కురుప్‌ ఎవరు? అతడు చేసిన ఘోరమైన నేరమేమిటి? తెరకెక్కించాల్సినంతగా పాపులర్‌ ఎలా అయ్యాడు? అతడి పాతకానికి బలైన వారు చెబుతున్నదేమిటి? అనే యాంగిల్ లోనే ఈ కథను చెప్పటం మొదలెట్టారు. ఓ పోలీస్ రాసుకున్న డైరీ మీదగా కథను ఓపెన్ చేసారు.  
 
ఈ కథ  కేరళ నేటివ్ అయిన వారికి చాలామందికి తెలుసు. కురుప్‌ గురించి వాళ్లు చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నారు. ఇదొక కిల్లర్‌ కథ. ఆ ఘటనల మీద ఎన్నో వార్తలూ వచ్చాయి. కాబట్టి మళయాళవాళ్లు ఈ సినిమాకు కనెక్ట్ అవటంలో విచిత్రమేమీ లేదు. అలాగే ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే…క్రైమ్ సినిమా అని మొత్తం నేర నేపథ్యంలో కాకుండా బాల్యం, యవ్వనం దశల్ని స్పృశిస్తూ కథనం రాసుకున్నారు. యాక్షన్‌, రొమాన్స్‌, థ్రిల్లర్‌, బయోపిక్‌ తదితర జానర్లన్నీ ఇందులో కనిపించాయి. అలాగే ఇందులో కురుప్‌ని హీరోలా చూపించడం లేదు. అతని పాత్రని పోషించిన దుల్కర్ బ్యాడ్‌ బాయ్‌గానే కనిపిస్తారు. కురూప్ ని ఓ క‌ర‌డుగ‌ట్టిన కిల్లర్‌గానే చూపించాడు.  చివరికి ఎలాంటి సందేశమూ లేదు కానీ సీక్వెల్ కు లీడ్ అయితే ఇచ్చారు. 1970, 80, 90 లలో జరిగే  పీరియాడికల్‌ కథగా చూపించినా మనకు ఆ ఇబ్బంది ఎక్కడా ఎదురుకాదు.  అయితే ఫస్టాఫ్ మొత్తం క్యారక్టర్స్, ప్రధాన సంఘటన ఎస్టాబ్లిష్ చేయటానికే టైమ్ తీసుకోవటంతో..ఏమీ జరిగినట్లు అనిపించదు. అయితే ఇంటర్వెల్ నుంచి కథనం పరుగెడుతుంది.  సెకండాఫ్ లో చివ‌రి 30 నిమిషాల డ్రామా అలా కట్టిపారేస్తుంది. ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. కురూప్ మర్డర్ చేయటం వెనక ఉన్న అసలు క్రైమ్ బయిటపడి షాక్ ఇస్తుంది. ఇక శోభిత‌తో లవ్ సీన్స్ నాచురల్ గా అనిపించి ఆక‌ట్టుకుంటాయి. అయితే  క్రైమ్ ఇన్విస్టిగేషన్ సినిమాల్లో  ఉండే స్పీడు మాత్రం  ఇందులో కనపడదు.

నటీనటులు ,టెక్నికల్

దుల్కర్ గురించి చెప్పాలంటే.. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ‘కనులు కనులు దోచాయంటే’తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు దుల్కర్‌ సల్మాన్‌  ‘కురుప్‌’తో మన ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఆయన కురూప్ గా నటించారనటం కన్నా జీవించారని చెప్పాలి.  దాదాపు దుల్కర్ స‌ల్మాన్ వ‌న్ మేన్ షోలా సాగిందీ చిత్రం. ఇక కురూప్ భార్యగా శోభిత‌, పోలీసాఫీస‌ర్‌గా ఇంద్రజిత్ సుకుమార‌న్ త‌మ న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు

టెక్నికల్ గా సినిమా హై స్టాండర్డ్స్ లో  ఉంది. ఫస్టాఫ్ లో స‌న్నివేశాలు కొన్ని సాగ‌దీత‌గా అనిపిస్తాయి. సంగీతం, కెమెరా వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పీరియాడిక్‌గా సాగే ఈ సినిమా కోసం ఆర్ట్ డిపార్టమెంట్ తీసుకున్న జాగ్రత్తలు చిత్రానికి ప్రధాన బ‌లం. ద‌ర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్‌ ఎక్సపీరియన్స్ ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది.  ఓ క్రిమిన‌ల్ క‌థ‌ని, ఎలాంటి హీరోయిజం లేకుండా దుల్కర్ స‌ల్మాన్‌ లాంటి ఓ హీరోతో తీయ‌డం మామూలు విషయం కాదు. ఎడిటింగ్ బాగుంది. డైలాగులు తెలుగు వెర్షన్ కు బాగున్నాయి. డబ్బింగ్ బాగా చెప్పించారు.


చూడచ్చా
దుల్కర్ ఫ్యాన్స్ కు  మాత్రమే కాకుండా క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

తెర వెనక , ముందు
 న‌టీన‌టులు: దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ్ల, ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, సన్నీ వేన్, భరత్ నివాస్ త‌దిత‌రులు;
సంగీతం: సుశీన్ శ్యామ్,
 సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి,
దర్శకత్వం: శ్రీనాథ్ రాజేంద్రన్;
నిర్మాణం: వే ఫారర్ ఫిల్మ్స్ & ఎం-స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్;
విడుద‌ల‌: 12 నవంబ‌ర్ 2021
రన్ టైమ్:2 గంటల 20నిముషాలు