కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ

Published On: April 12, 2018   |   Posted By:
కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ
బ్యాన‌ర్ :  షైన్ స్క్రీన్స్‌
స‌మ‌ర్ప‌ణ‌:  వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి
న‌టీన‌టులు:  నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ , బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శీను, దేవ‌ద‌ర్శిని, నాగినీడు, విద్యుల్లేఖా రామ‌న్‌, సుద‌ర్శ‌న్‌, మ‌హేశ్ త‌దిత‌రులు
ఆర్ట్‌:  సాహి సురేశ్‌
ఎడిటింగ్‌: స‌త్య. జి
మ్యూజిక్ :  హిప్ హాప్ త‌మిళ‌
కెమెరా:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
నిర్మాత‌లు:  సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  మేర్ల‌పాక గాంధీ
రిలీజ్ డేట్ – 12.04.2018
రన్ టైం – 158 నిమిషాలు
సెన్సార్ –  యు/ ఎ సర్టిఫికేట్
సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కించ‌డ‌మే కాదు.. ఏదో ఒక అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ను ట‌చ్ చేసేలా ఉండే క‌థాంశం ఉంటే అలాంటి సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాల్లో మెప్పించిన మేర్ల‌పాక గాంధీ ఈసారి కామెడీకి చిన్న ఎమోష‌న‌ల్ కంటెంట్ జోడిచేసి చ‌క్క‌గా తెర‌కెక్కించిన చిత్రం `కృష్ణార్జున యుద్ధం`. ఇక ఇప్ప‌టికే ఎనిమిది వ‌రుస స‌క్సెస్‌లు అందుకున్న నానికి.. మ‌రి ఈ కృష్ణార్జున యుద్ధం ట్రిపుల్ హ్యాట్రిక్ ను తెచ్చి పెట్టిందా?  లేదా ? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.
క‌థ‌:
 ఓ అమ్మాయిని కొంత మంది వ్య‌క్తులు కిడ్నాప్ చేయ‌డంతో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. వెంట‌నే క‌థ చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామంలోకి వెళుతుంది. అక్క‌డ ఉండే కృష్ణ‌(నాని) మొర‌టోడు. చుట్టూ ఉండే అమ్మాయిల‌ను ప్రేమించ‌మంటూ ప్ర‌పోజ్ చేస్తుంటాడు. వారితో చీవాట్లు తింటుంటాడు. డాక్ట‌రు చ‌దివే రియా(రుక్స‌ర్) త‌న తాత‌య్య‌(నాగినీడు)ని చూడ‌టానికి అదే గ్రామానికి వ‌స్తుంది. ఆమెను చూసిన కృష్ణ ఆమెతో ప్రేమ‌లో ప‌డి.. ఆమెతో పరిచ‌యం పెంచుకుంటాడు. రియా కూడా కృష్ణ‌ను ప్రేమిస్తుంది. వీరికి స‌మాంత‌రంగా అర్జున్(నాని) క‌థ సాగుతుంటుంది. ప్లేబోయ్ అయిన అర్జున్ ప్రాగ్‌లో ఉంటాడు. త‌ను ఫోటోగ్రాఫ‌ర్ సుబ్బ‌ల‌క్ష్మిని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కోసం మంచిగా మారిపోతాడు. కానీ సుబ్బ‌ల‌క్ష్మి అర్జున్‌ని న‌మ్మ‌దు. కృష్ణ‌, రియా ప్రేమ వ్య‌వ‌హారం న‌చ్చని ఆమె తాత‌య్య ఆమెను హైద‌రాబాద్ పంపేస్తాడు. అలాగే అర్జున్ వ్య‌వ‌హారం న‌చ్చ‌క సుబ్బ‌ల‌క్ష్మి హైద‌రాబాద్ వ‌చ్చేస్తుంది. హైద‌రాబాద్ చేరుకున్న ఇద్ద‌రూ మిస్ అవుతారు. ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. కృష్ణ‌, అర్జున్‌లు వారి ప్రేయ‌సిల‌ను వెతుక్కుంటూ హైద‌రాబాద్ చేరుకుంటారు. చివ‌ర‌కు సుబ్బ‌ల‌క్ష్మి, రియాల‌ను ఎవ‌రు కిడ్నాప్ చేశారు?  కృష్ణ, అర్జున్‌లు వారి ప్రేయ‌సిల‌ను క‌లుసుకున్నారా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్ల‌స్ పాయింట్స్‌:
– నాని న‌ట‌న‌
– ఫ‌స్టాఫ్ కామెడీ
– నేప‌థ్య సంగీతం
– సినిమాటోగ్ర‌పీ
మైన‌స్ పాయింట్స్‌:
– సెకండాఫ్‌లో క్లైమాక్స్ ముందు వ‌చ్చే పాట అసంద‌ర్భంగా ఉండ‌టం
– సెకండాఫ్ రొటీన్‌గా ఉండ‌టం
– క్లైమాక్స్ సాగ‌దీత‌గా ఉండ‌టం
విశ్లేష‌ణ‌:
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది నాని గురించి ఎప్ప‌టిలాగానే నాని త‌న నేచుర‌ల్ న‌ట‌న‌తో మెప్పించాడు. సినిమా అంత‌టినీ త‌న భుజాల‌పై మోశాడు. కృష్ణ‌, అర్జున్ అనే రెండు పాత్ర‌ల్లో న‌ట‌న ప‌రంగా.. లుక్ ప‌రంగా చ‌క్క‌టి వేరియేష‌న్ చూపించాడు. చిత్తూరు జిల్లా యాసలో నాని న‌ట‌న ఫెంటాస్టిక్‌.  కృష్ణ పాత్ర త‌న స్నేహితులు సుద‌ర్శ‌న్ అండ్ గ్యాంగ్‌తో క‌లిసి చేసిన కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. ఇక  రాక్‌స్టార్ అర్జున్‌గా కూడా మంచి ఎన‌ర్జీతో న‌టించాడు. ఇక హీరోయిన్స్ అనుప‌మ‌, రుక్స‌ర్‌లు పాత్ర పరిధుల మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక అర్జున్ స్నేహితుడు, మేనేజ‌ర్‌గా న‌టించిన బ్ర‌హ్మాజీ.. అనుప‌మ పిన్నిగా దేవ‌ద‌ర్శిని కామెడీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌తుంది. ముఖ్యంగా వారి మ‌ధ్య సంగీతం నేర్చుకోవ‌డం.. బ్ర‌హ్మాజీ కోమాలోకి వెళ్లిపోవ‌డం త‌దిత‌రం కామెడీగా ఉన్నాయి. ఇక నాగినీడు, ప్ర‌భాస్  శీను త‌దిత‌రులు వారి వారి పాత్రల‌కు త‌గ్గ‌ట్లు న్యాయం చేశారు. ఇక దర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ సినిమా క‌థ‌కు హ్యుమ‌న్ ట్రాఫికింగ్ అనే స‌మ‌స్య‌ను యాడ్ చేసి చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొత్త‌దనం లేక‌పోయినా.. స్క్రీన్‌ప్లే ప‌రంగా ఆక‌ట్టుకున్నాడు. కార్తీక్ ఘ‌ట్ట‌మనేని సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. హిప్ హాప్ త‌మిళ అందించిన ట్యూన్స్‌లో మూడు .. విన‌డానికి.. చూడ‌టానికి బావున్నాయి. నేప‌థ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
చివ‌ర‌గా.. కృష్ణార్జనులు.. ఆక‌ట్టుకుంటారు
రేటింగ్‌: 3/5