గల్ఫ్ సినిమా హీరో చేతన్ మద్దినేని ఇంటర్వ్యూ

Published On: October 12, 2017   |   Posted By:

గల్ఫ్ సినిమా హీరో చేతన్ మద్దినేని ఇంటర్వ్యూ

ఈ శుక్రవారం(13.10.2017) గల్ఫ్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు హీరో చేతన్ మద్దినేని. ఓ మంచి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాడు చేతన్. సునీల్ కుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ బోర్డ్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల్ని మీడియాతో పంచుకున్నాడు చేతన్.

గల్ఫ్ కార్మికుల కష్టాలన్నీ ఇందులో కనిపిస్తాయి

దిల్ రాజు గారు తీసిన “రోజులు మారాయ్” సినిమా నా మొదటి మూవీ. గల్ఫ్ సినిమా నా రెండో సినిమా. ఓ చేనేత కార్మికుడి కొడుకు పాత్రలో కనిపిస్తాను. డబ్బులు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్తాను. అక్కడ నిర్మాణ రంగంలో కార్మికుడిగా పనిచేస్తుంటాను. మిగతా స్నేహితుల్ని చూసి దుబాయ్ లో ఏదో ఉందని భ్రమపడి అక్కడికి వెళ్తాను. కానీ అక్కడన్నీ కష్టాలే ఉంటాయి.

“గల్ఫ్” అనేది ఓ కమర్షియల్ సినిమా

గల్ఫ్ సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అలాఅని సినిమా అంతా బాధలే చూపించం. రొమాన్స్, ఫైట్స్, స్పెషల్ సాంగ్ అన్నీ ఉన్నాయి. ఓ కమర్షియల్ గా హీరోగా మారేందుకు నాకు గల్ఫ్ చిత్రం హెల్ప్ అవుతుంది.

నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను

నేను పుట్టి పెరిగింది వైజాగ్ లో. కానీ ఈ సినిమాలో తెలంగాణ యువకుడి పాత్ర పోషించాను. అందుకే డబ్బింగ్ చెప్పడం కాస్త కష్టమైంది. అయినప్పటికీ రోజుల తరబడి రిహార్సల్స్ చేసి, తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను.

మారుతి మా ఫ్యామిలీ ఫ్రెండ్

సినిమాల్లో నటించాలని చిన్నప్పట్నుంచి కోరిక. అందుకే సత్యనంద్ గారి దగ్గర ట్రయినింగ్ తీసుకున్నారు. మారుతి గారు మాకు దాదాపు ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివారు. అందుకే అతనితో కలిసి రోజులు మారాయ్ సినిమా చేశాను. సత్యానంద్ గారి దగ్గర ట్రయినింగ్ తీసుకున్నప్పుడే దర్శకుడు సునీల్ గారిని కలిశాను. నిజానికి గల్ఫ్ తోనే ఎంట్రీ జరగాల్సింది. కానీ మూవీకి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టంది. ఈలోగా రోజులు మారాయ్ సినిమా చేశాను. ఇప్పుడు నా రెండో సినిమా గల్ఫ్ తో మీ ముందుకొస్తున్నాను.

అన్ని ఎమోషన్స్ ఉన్న పాత్ర

ఇందులో నా పాత్రను సునీల్ గారు చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మంచి జరిగితే చట్టవిరుద్ధంగా అయినా వెళ్లడానికి రెడీ అవుతాడు హీరో. సేమ్ టైం నటించడానికి మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఫైట్స్, డాన్స్ కూడా ఉన్నాయి. నన్ను నేను హీరోగా నిరూపించుకోవడానికి గల్ఫ్ సినిమాను సరైన వేదికగా భావిస్తున్నాను.

నెక్ట్స్ సినిమా కూడా..

నా నెక్ట్స్ సినిమా మళ్లీ మారుతి నిర్మాణంలోనే ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ రాజు అనేది ఆ సినిమా పేరు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాకు రీమేక్. అది కూడా క్యారెక్టర్ బేస్డ్ సినిమా. చదువుల్ల ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే ఓ కుర్రాడికి లోకజ్ఞానం మాత్రం ఉండదు. అలాంటి పాత్రను నేను పోషిస్తున్నాను. కన్నడ వెర్షన్ ను డైరక్ట్ చేసిన నరేష్ కుమారే.. తెలుగు రీమేక్ కు కూడా దర్శకుడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరో 3 వారాల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

దిల్ రాజుతో చర్చలు

దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అది చర్చల దశలోనే ఉంది. ఇంకా ఫైనలైజ్ కాలేదు. సునీల్ కుమార్ రెడ్డి గారితో కూడా మరో సినిమా చేయాలని ఉంది. కానీ వేరే నటీనటులతో ఆయన ఒక రొమాంటిక్ థీమ్ తీసుకొని సినిమా చేస్తున్నారు.