చరిత్రాత్మక బాహుబలి-2 సినిమాకు వంద రోజులు

Published On: August 5, 2017   |   Posted By:
చరిత్రాత్మక బాహుబలి-2 సినిమాకు వంద రోజులు
కొన్ని సినిమాలు వచ్చినప్పుడు ఎవరూ గుర్తించరు. చరిత్ర సృష్టించిన తర్వాత వాటిని గుర్తించాల్సిన అవసరం ఉండదు. బాహుబలి-2 కూడా ఇలాంటిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని బాలీవుడ్ ఎనలిస్టులు కూడా ఊహించలేకపోయారు. ఇప్పుడు కళ్లముందు చరిత్ర కనిపిస్తోంది. టాలీవుడ్ లోనే కాదు.. భారతీయ సినీచరిత్రలోనే నంబర్ వన్ చిత్రంగా నిలిచింది బాహుబలి-2. అలా విడుదలైన మొదటి రోజు నుంచే అప్రతిహతంగా విజయయాత్ర కొనసాగిస్తున్న ఈ సినిమా చూస్తుండగానే కళ్లముందే వంద రోజులు పూర్తిచేసుకుంది. అవును.. బాహుబలి-2 విడుదలై వంద రోజులైంది.
ఈ వంద రోజుల్లో రోజుకో రికార్డుతో చెలరేగిపోయింది బాహుబలి-2 సినిమా. ఇక్కడ, అక్కడ అనే తేడాలేకుండా విడుదలైన ప్రతి చోటా ఈ సినిమా హిట్ అయింది. అలా 1730కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి ఇండియన్ నంబర్ వన్ మూవీగా అవతరించింది. అయితే ఈ లెక్కలు పాతవే. సవరించిన వసూళ్ల జాబితాను నిర్మాతలు ఇంకా విడుదల చేయలేదు. అలా చూసుకుంటే ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశముంది.
పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకతో పాటు టాలీవుడ్ అంటే ఏంటో కూడా తెలియని బీహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ బాహుబలి-2 ఆడుతోందంటే.. ఈ సినిమా సాధించిన ఘనతకు ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదేమో. వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బాహుబలి యూనిట్ కు మరోసారి సాహో అందాం.