జార్జ్‌రెడ్డి మూవీ రివ్యూ

Published On: November 22, 2019   |   Posted By:

జార్జ్‌రెడ్డి మూవీ రివ్యూ

జస్ట్ ఓకే  రెడ్డిగారూ!  (‘జార్జ్‌రెడ్డి’ రివ్యూ)

Raging: 2.5/5
 
గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా జార్జిరెడ్డి పేరే వినిపిస్తోంది. ఎప్పుడో నలబై ఏళ్ల క్రితం జరిగిన ఓ జీవితాన్ని, జనం మర్చిపోతున్న చరిత్రను తెరకెక్కిస్తున్నారనే విషయం చాలా మందికి ఉత్సాహానిస్తోంది. ఆ రోజుల నాటి ఉస్మానియాని చూడచ్చు…అప్పటి మనుష్యుల ఆశలు, ఆనందాలు, ఆవేశాలు చూడచ్చు అని ఆశపడినవారు ఉన్నారు. దానికి తోడు వివాదాలు,వాదులాటలు టీవి మీడియాకు ఎక్కి ఈ సినిమాని మరింత పాపులర్ చేసి, తప్పకుండా చూడాలనే ఉత్సుకతను కలిగించాయి. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఏమేరకు అంచనాలను అందుకుంది…జార్జిరెడ్డి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించారా లేక మార్పులు చేసారా..అసలు కథేంటి…వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

చిన్నప్పటినుంచీ జార్జిరెడ్డి (సందీప్‌ మాధవ్‌)చురుకైన కుర్రాడు. కేవలం చదువు మాత్రమే కాక, సామాజిక అంశాలు పట్ల కాన్షష్ గా ఉంటూంటాడు. అలాగే  కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో మంచి నేర్పు సాధిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ విషయంలో అయినా ధైర్యంగా దూసుకుపోయే నైజం అతని సొంతం. జార్జిరెడ్డి (సందీప్‌ మాధవ్‌)ది అప్పటివరకూ ఒకరకంగా జరిగిన జీవితం. కానీ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీకి అతని లైఫ్ ని పూర్తిగా మార్చేస్తుందని ఊహించలేదు.
 
ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఎం.ఎస్సీలో జాయిన్ అయిన జార్జిరెడ్డికి అక్కడ జ‌రుగుతున్న అన్యాయాలు, అస‌మాన‌త‌లు చూస్తూంటే రక్తం మరిగిపోతుంది. దాంతో ఓ రోజు పూర్తిగా ఆ బ్యాచ్ పై ఎదురు తిరుగుతాడు. స్టూడెంట్స్ లో చాలా భాగం జార్జిరెడ్డికి సపోర్ట్ ఇస్తారు. అయితే తమపై తిరగబడిన వాడ్ని వెంటనే తొక్కేయపోతే తమని జనం తొక్కేస్తారనేది ఆ చ్యాచ్ నాయకులు సత్య(సత్యదేవ్‌), అర్జున్‌(మనోజ్‌ నందం) భయం. దాంతో వాళ్లు ఈ విషయాన్ని కాస్త ఎక్కువ సీరియస్ గానే తీసుకుని రివర్స్ ఎటాక్ చేస్తారు. అక్కడ నుంచి జార్జిరెడ్డికు రకరకాల సమస్యలు, స్టూడెంట్స్ భాధ్యతలు వెతుక్కుంటూ వస్తాయి.  మిత్రులతో పాటే శత్రువులు పెరుగుతారు.

మిత్రులు కళ్లదెరుగా కనిపిస్తే..శత్రువులు వెనక నుంచి దాడి చేస్తూంటారు. ఈ క్రమంలో ఇరవై మూడు కత్తిపోట్లు పడినా జార్జి రెడ్డి వెనకడుగు వెయ్యడు. యూనవర్శిటీ క్యాంపస్ ఎలక్షన్స్ లో పోటీ చేసి భారీ మెజారిటీతో  నెగ్గుతాడు. జార్జిరెడ్డి ఇచ్చే ఉపన్యాసాలు చాలా మందిని ఎట్రాక్ట్ చేయటం, ఈ గెలుపు …ప్రత్యర్దులకు నిద్రపట్టనివ్వకుండా చేస్తాయి. దాంతో వాళ్లు జార్జి రెడ్డిని చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఓ పథకం ప్రకారం అమలు చేస్తారు. ఇంతకీ జార్జీ రెడ్డిని మర్డర్ చేసిందెవరు…అతని లవ్ స్టోరి ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
కథ,కథన విశ్లేషణ

బయోపిక్ ల ట్రెండ్ బయిట నడుస్తోందని ఈ దర్శకుడు ఈ సినిమాని తీసాడో లేక…జార్జిరెడ్డి సినిమా చెయ్యాలనే జీవితాశయంతో చేసాడో అయితే తెలియదు. అయితే ట్రెండ్ తగినట్లు టాపిక్ ని ఎత్తుకున్నా..అందుకు తగ్గ రీసెర్చ్ చేసి స్క్రిప్టు రూపొందించలేదనిపిస్తుంది. ఎందుకంటే జార్జిరెడ్డి జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి. వాటిని ఎలివేట్ చేయకుండా ప్లాట్ గా కథనం నడుపుకుంటూ వెల్లిపోయారు. దాంతో జార్జిరెడ్డి పాత్ర యాక్టివ్ ప్యాసివ్ అనే స్క్రిప్టు  సిండ్రోమ్ కు లోనైంది. సినిమా అంతా జార్జిరెడ్డి యాక్షన్ చేస్తున్నట్లు కనపడతాడు. కాని అది ఎదురుగావచ్చే పరిస్దితులకు  స్పందించటం అన్నట్లు తయారైంది. అలా చేయటం వల్ల పాయింటాఫ్ ఇంట్రస్ట్ సినిమాపై తగ్గిపోయింది.
 
అలాగే ‘అమ్మ ఈయన ఎవరు.. భగత్‌ సింగ్‌. ఎక్కడున్నారు?. చంపేశారు. మళ్లీ రారా?. చావు ఒక్కసారే వస్తుంది’జార్జిరెడ్డి చిన్నప్పుడు తన తల్లితో మాట్లాడిన మాటలు ఇవి. తన చిన్నప్పట్నుంచే భగత్‌ సింగ్‌, చెగువేరా పుస్తకాలు చదవడంతో జార్జిరెడ్డికి చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా వచ్చేసింది. అయితే ఆ విషయాలను ఎస్టాబ్లిష్ చేయటంలో మొదటే దర్శకుడు తడబడ్డాడని చెప్పాలి. ఓ డైలాగుతో లాగేసాడు. అయితే ఆ చేగువేరా అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పాలో చెప్పలేదు.  ఇలా స్క్రీన్ ప్లే వైపు నుంచి కథ వైపు నుంచి రకరకాల స్క్రిప్టు సమస్యలు వచ్చాయి.

ఇక ఈ సినిమా ఫస్టాఫ్ ఫరవాలేదనిపించుకున్నా సెకండాఫ్ మాత్రం  ఇబ్బంది పెడుతుంది. సినిమా మొత్తం అక్కడికి అక్కడే తిరుగుతున్నట్టు ఫీల్ రావటం కొంత దెబ్బ కొట్టంది. దానికి తోడు వేరే ఎలిమెంట్స్ ఏమీ లేకుండా కేవలం విద్యార్థులు, వాళ్ల గొడ‌వ‌లే చూపించ‌డం మీదే కాన్సర్టేట్ చేయటం విసుగొస్తుంది.  క్లైమాక్స్ సైతం పెద్ద గొప్పగా లేదు ..తేలిపోయింది.

నటీనటుల్లో…
 
జార్జిరెడ్డిగా నటించిన హీరో సందీప్ మాధ‌వ్ …జార్జిరెడ్డి పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి.  డ్రస్, డైలాగు డెలవరీ విషయంలో దర్శకుడు తీసుకున్న శద్ద ముచ్చటేస్తుంది. ఇక జార్జిరెడ్డి త‌ల్లిపాత్రలో న‌టించిన దేవిక, ఆ పాత్రకు ఫెరఫెక్ట్ సింక్. ఇక మిగతా వాళఅలలో హీరోయిన్‌గా న‌టించిన ముస్కాన్‌, రాజ‌న్న అనే స్నేహితుడిగా న‌టించిన అభ‌య్‌, ప‌వ‌న్‌, స‌హా కీల‌క పాత్ర‌లో న‌టించిన స‌త్యదేవ్‌, మ‌నోజ్ నందం త‌దిత‌రులు వంక పెట్టలేని విధంగా నటించారు.  తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక జీవించిందనే చెప్పాలి.

సాంకేతికంగా చూస్తే…

ఈ సినిమాకు ముందు ఆర్ట్ డైరక్టర్ ని మెచ్చుకోవాలి. 1972 ముందు ప‌రిస్థితుల‌ను,వాతావరణం గుర్తు చేసేలా ఉస్మానియా యూనివర్శిటీ సెట్ ని అద్బుతంగా డిజైన్ చేసారు. అలాగే  న‌టీన‌టులు అప్పటి హెయిర్ స్టైల్‌, డ్రెస్సింగ్ స్టైల్‌ల‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేయటం ప్లస్ అయ్యింది.పాట‌ల్లో ఓ రెండు బాగున్నాయి‌.  కెమెరా వర్క్ కేక  పుట్టిస్తుంది.  డైలాగులు బాగున్నాయి.
 
చూడచ్చా…
జార్జిరెడ్డి జీవితం గురించి మొదట ఎంతో కొంత అవగాహన చేసుకుని సినిమా చూస్తే ఎక్కుతుంది. లేకపోతే  కష్టమనిపిస్తుంది.
 

ఎవరెవరు….
నటీనటులు: సందీప్‌ మాధవ్‌, అభయ్‌, సత్యదేవ్‌, శత్రు, మనోజ్‌ నందన్‌, ముస్కాన్‌ తదితరులు
సంగీతం: సురేష్‌ బొబ్బిలి, హర్షవర్థన్‌ రామేశ్వర్‌(నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ: సుధాకర్‌ యక్కంటి
కళ: గాంధీ నడికుదురు
ఎడిటింగ్‌: జె.ప్రతాప్‌ కుమార్‌
నిర్మాత: అప్పిరెడ్డి, సంజీవ్‌రెడ్డి
దర్శకత్వం: జీవన్‌రెడ్డి
బ్యానర్‌: మిక్‌ మూవీస్‌, సిల్లీ మాంక్స్‌, అభిషేక్‌పిక్చర్స్‌
విడుదల తేదీ: 22-11-2019