జెస్సీ మూవీ రివ్యూ

Published On: March 16, 2019   |   Posted By:

జెస్సీ మూవీ రివ్యూ

భయపెట్టింది కానీ…(‘జెస్సీ’ మూవీ రివ్యూ)

రేటింగ్  : 2/5  

అనగనగా ఓ దెయ్యం. అది ఓ ఇంటిని ఆక్యుపై చేసి అక్కడ నివాసం ఉంటూంటుంది. అయితే మనష్యులకు ఆ ఇల్లుకావాలి. కానీ దెయ్యం ఆల్రెడీ కాపురం పెట్టేసిన ఇంట్లో కాపురం చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది. అప్పుడు హీరో రంగంలోకి దిగి ఆ ఇంట్లో దుకాణం పెట్టి.. ఆ దెయ్యాలతో దాదాపు మాట్లాడినంత పనిచేసి, వాటి ప్లాష్ బ్యాక్ తెలుసుకుని, వాటి కోరికలు ఏమన్నా ఉంటే తీర్చి అక్కడ నుంచి వాటిని వెళ్ల కొడుతూంటారు. ఇది దెయ్యం కథలు కామన్ కాన్సెప్టు . ఇందులో వైవిధ్యం చూపెట్టి..భయపెట్టి, నవ్వించిన వాళ్లు సక్సెస్ అయ్యారు. లేనివాళ్లు  దెయ్యాలంటే జనాల్లో మోజు తగ్గిపోయిందని వాపోతూంటారు. ఈ వారం కూడా ఇలాంటి ఓ దెయ్యం కథ ధియోటర్స్ లలో దిగింది. మరి ఈ దెయ్యం …నవ్వించే దెయ్యమా..కవ్వించే దెయ్యమా..అసలు మన డబ్బులు గిట్టుబాటు చేసే దెయ్యమేనా ..చూద్దాం..

దెయ్యం కా కహాని..

ఘోస్ట్ హంటర్స్  పావణి గంగిరెడ్డి, అభినవ్ గౌతమ్, అభిషేక్, పూర్ణిమలు ..దెయ్యాలు నివాసముండే ఇళ్లకు వెళ్లి తమ ప్రొఫెషన్ ని ప్రాక్టీస్ చేస్తూంటారు. అసలు  దెయ్యాలు ఉన్నాయో లేదో ప్రాక్టికల్ గా నిరూపించే పనిలో ఊరు చివర్లో  ఉన్న విక్టోరియా హౌస్‌కి వెళ్తారు. ఈ జర్నిలో వాళ్లకు    విక్టోరియా హౌస్ యజమాని సమీర (అర్చన) పరిచయం అవుతుంది. విక్టోరియా  హౌస్‌లో ఉండే ఇద్దరు అక్కచెల్లెల్లు జెస్సీ (అష్మిత నర్వాల్), యమి (శ్రీత చందన) యాక్సిడెంట్‌లో చనిపోయి దెయ్యాలుగా మారారని చెప్తుంది. అక్కడ ఆ దెయ్యాలు ఉన్నాయనే కారణంతో తన విక్టోరియా హౌస్‌ని ఎవరూ కొనడం లేదని.. అక్కడ దెయ్యాలు లేవని ప్రూవ్ చేయాల్సిందిగా ఈ  ఘోస్ట్ హంటర్స్‌ ని కోరుతుంది. వారితో కలిసి విక్టోరియా హౌస్‌కి  వెళ్తుంది. 

ఆ హౌస్ కు  వెళ్లిన ఘోస్ట్ హంటర్స్‌కి  అక్కడ రకరకాల హారర్  అనుభవాలు ఎదురౌతుంటాయి. తమ ఇన్విస్టిగేషన్ లో   జెస్సీ, యమిలు నిజంగానే చనిపోయి ఆత్మలుగా అదే ఇంటిలో నివాసం ఉంటున్నారని  అర్దం చేసుకుంటాటారు. అసలు ఇంతకీ ఈ జెస్సీ,యమీలు ఎవరు..

జెస్సీ, అమీ అక్క‌చెల్లెళ్లు. జెస్సీకి చెల్లెలంటే  విపరీత‌మైన ప్రేమ‌. అందుకు కార‌ణం అమీకి ఓ వ్యాధి ఉంటుంది. దాని ప్రభావంతో రివర్స్ లో వయస్సు త‌గ్గుతూ ఉంటుంది. త‌న వ‌య‌సు పెర‌గాల్సింది పోయి… త‌గ్గుతూ ఉంటుంది. మ‌తిమ‌రుపు, కోపం ఆమె స‌హ‌జ ల‌క్ష‌ణాలు. అప్పుడ‌ప్పుడూ దెయ్యం ప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటుంది. 

ఇలా అమీ  మాన‌సికంగా, శారీర‌కంగా కూడా వెనక్కి వెళ్తూ ఉండటం చూసి  జెస్సీ కుంగిపోతూ ఉంటుంది. తన బోయ్‌ఫ్రెండ్ సాయంతో అమీని వైద్యుడి ద‌గ్గ‌రకు తీసుకెళ్తుంటుంది. అయితే వ్యాధి నయం అవటం అటుంది.., అమీ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెడుతుంది. ఆమెకు దెయ్యం పట్టిందని అర్దమవుతుంది. 

దాంతో యామికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి జెస్సీ తన బోయ్ ఫ్రెండ్ రాజీవ్ (విమల్ క్రిష్ణ) కలిసి భూత వైద్యుడు కబీర్ దుహాన్ సింగ్‌ దగ్గరకు వెళ్లడం.. అతను విక్టోరియా మహల్‌కి వచ్చి యామికి పట్టిన దెయ్యాన్ని వదిలించే క్రమంలో అసలు  దెయ్యం ‘జెస్సీ’ అని తెలుసుకుంటాడు.  అమీకి వైద్యం చేయడానికి  బదులుగా జెస్సీ ని క‌ట్టివేసి, ఆమెకు న‌యం చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. ఇంతకీ జెస్సీని ఆవహించిన ఆత్మ ఎవరిది? యామి ఎందుకు దెయ్యం పట్టినట్టు ప్రవర్తించింది?  యాక్సిడెంట్‌లో చనిపోయిన అక్కచెల్లెల్లు ఎవరు? ఘోస్ట్ హంటర్స్ నిజమైన దెయ్యాన్ని పట్టుకోగలిగారా? అసలు జెస్సీ ఎవరన్నదే మిగతా కథ.

హాలీవుడ్ లైన్ కు థాయ్ ట్విస్ట్

ఒకప్పుడు దెయ్యం సినిమా అంటే కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమే చేసేవారు. భయపడాలి అనుకునే వాటిని చూసి ఎంజాయ్ చేసేవారు. అయితే కాలక్రమేణా చిన్న సినిమా చెయ్యాలనుకునేవాళ్లకు దెయ్యం కథలు అక్షయపాత్రలా మారాయి. ఈ క్రమంలో తెలుగులో చిన్న సినిమాని గత కొంతకాలంగా దెయ్యం ఆవహించింది.  ఇంటిని ఆవహించుకునే దెయ్యాలు..వాటిని వదిలించే మంత్రగాళ్లు కథలు ఈ మధ్యకాలంలో కామన్ అయ్యిపోయాయి.  దెయ్యం కథలు చిన్న సినిమాకు బడ్జెట్ తక్కువలో సహకరించటంతో ఈ జానర్ ని ఎంచుకోవటం మొదలెట్టారు.  కొత్తలో ఆ దెయ్యాలు నవ్వించాయి..భయపెట్టాయి ..కానీ ఈ మధ్యన పనికిమాలిన దెయ్యాలు ఎక్కువై విసుగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో దెయ్యం కథతో సినిమా సినిమా వస్తోందంటే ఎగ్జైట్ అయ్యేవారు తక్కువైపోతున్నారు. దాంతో అవి ఎప్పుడు వస్తున్నాయో..ఎప్పుడు వెళ్తున్నాయో తెలియని పరిస్దితి నెలకొని ఉంది. అయితే ఈ దెయ్యం సినిమా బాగానే భయపెట్టిందనే చెప్పాలి.ట్విస్ట్ లుకూడా బాగానే పండాయి. 

ఘోస్ట్ హంటర్స్ హాలీవుడ్  సినిమాల్లో  రెగ్యులర్ గా వచ్చే పాయింట్ ని తీసుకొచ్చి సినిమాని ఎత్తుకొచ్చి, Alone (2007) కు కలిపాడు. అంతవరకూ బాగుంది. కానీ రెండు ఫెరఫెక్ట్ గా మిక్స్ అవ్వలేదు. ముఖ్యంగా … సినిమా చివరకి వచ్చేసరికి  ఈ మిక్సెడ్ క‌థ‌ని ఎలా ముగించాలో ద‌ర్శ‌కుడికి అర్థం రాలేదు. అప్ప‌టి వ‌ర‌కూ కొత్త‌గా ఆలోచించి..క్లైమాక్స్ సీన్స్ ని మాత్రం ఓ పరమ రొటీన్  హార‌ర్ సినిమాలా మ‌లిచాడు. అయితే సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ బాగా పేలింది. కానీ ఆ ఒక్కటే సినిమాని నిలబెట్టడం కష్టం కదా.

టెక్నికల్ గా ..

హారర్ సినిమా అంటే చీప్ లో చుట్టేసే సినిమా అని చాలా మంది అనుకుంటారు కానీ నిజానికి భయపెట్టడానికి చాలా టెక్నిక్, టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. ముఖ్యంగా  బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్స్‌ అదరకొట్టాలి. ఆ విషయంలో ఈ సినిమా బాగానే సక్సెస్ అయ్యింది. సౌండ్స్  తో భ‌య‌పెట్టాడు. కెమెరా వర్క్ కూడా కొత్త యాంగిల్స్ తో హార‌ర్ లుక్ తెచ్చిపెట్టింది.  ఎడిటింగ్ విషయానికి వస్తే ..భ‌య‌పెట్టడం కోసం సీన్స్ ని సాగతీస్తున్నట్లుగా అనిపిస్తుంది.  కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. రన్ టైమ్ తక్కువ ఉండటం కూడా ఈ సినిమాకు మరో ప్లస్ . 

నటీనటుల్లో అర్చ‌న, అతుల్ కుల‌క‌ర్ణి, క‌బీర్ సింగ్ తప్ప అంతా కొత్త‌వాళ్లే. అర్చ‌న క్యారక్టర్ ప‌రిధి కూడా చిన్న‌దే. క‌బీర్ సింగ్ భూత వైద్యుడిగా వెరైటీగా ఉన్నాడు.  పోలీస్ అధికారిగా అతుల్ కూడా బాగా చేసారు. 

చూడచ్చా

రెగ్యులర్ గా హారర్ సినిమాలు చూసేవారికి పెద్ద కిక్ ఇవ్వదు కానీ..అప్పుడప్పుడూ చూసేవాళ్లకు ఈ ట్విస్ట్ లు, భయపెట్టడం నచ్చుతాయి.

చివరి మాట…

దెయ్యాల ప్లాష్ బ్యాక్ ల్లో కూడా ట్విస్ట్ లు ఉంటాయి

ఎవరెవరు..

సంస్థ‌: ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి
న‌టీన‌టులు: అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్, శ్రీతా చంద‌నా.ఎన్‌, విమ‌ల్ కృష్ణ త‌దిత‌రులు
విఎఫ్ఎక్స్‌: వెంక‌ట్‌.కె,
మేక‌ప్‌: చిత్రా మోద్గిల్‌,
సౌండ్ డిజైన్‌, మిక్సింగ్‌: విష్ణు పి.సి, అరుణ్.ఎస్‌,
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: అశ్వంత్,
మాట‌లు, పాట‌లు: కిట్టు విస్సాప్ర‌గ‌డ‌,
కొరియోగ్రాఫ‌ర్‌: ఉద‌య్‌భాను(యుడి),
ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం,
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌,
సినిమాటోగ్రఫీ: సునీల్‌కుమార్‌.ఎన్‌,
నిర్మాత‌: శ్వేతా సింగ్‌,
సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌,
ద‌ర్శ‌క‌త్వం: అశ్విని కుమార్‌