జోడి మూవీ రివ్యూ

Published On: September 6, 2019   |   Posted By:

జోడి మూవీ రివ్యూ

కనువిప్పు కథా ఒడి (‘జోడి’మూవీ రివ్యూ)
 
Rating: 1.5/5
 
అనగనగా ఓ కమలాకర్ (నరేష్). ఆయనకు క్రికెట్ అన్నా, వాటిపై బెట్టింగ్ లు కాయటమన్నా భలే పిచ్చి. ఆ పిచ్చిలోనే తన కొడుక్కు కపిల్ (ఆది) అనే పేరు పెట్టేసి..తను బెట్టింగ్ లలో బిజీ అయ్యిపోతాడు. ఇలా భాధ్యతలు గాలికి వదిలేయటం వల్ల …వేరే దారి లేక ఆ కొడుకు కపిల్ ….చక్కగా చదివేసుకుని సాప్ట్ వేర్ కంపెనీలో సిస్టమ్ ఎడ్మిన్ అయ్యిపోయి..కుటుంబాన్ని సాకుతూంటాడు. ఇలా రోజులు గడుస్తూంటే ఓ రోజు ఫ్రెంచ్ పాఠాలు చెప్పుకునే పంతులమ్మ కాంచనమాల (శ్రధ్ద శ్రానాధ్) పరిచయం అవుతుంది. ఆమె హీరోయిన్ కావటం వలన, వెంటనే ప్రేమలో పడి, పాటలు గట్రా పాడుకోవటం లో బిజీ అవుతాడు. ఎంతకాలం ఆ పాటలు వాటికి స్టెప్ లు వేస్తామని ఇక పెళ్లి చేసుకుని స్దిర పడదామని నిర్ణయించుకుంటారు. ప్రేమకంటే వీళ్లద్దరూ చాలు..కానీ పెళ్లంటే రెండు కుటుంబాలు ఆమోద ముద్ర వెయ్యాలి. కపిల్ తండ్రి కమలాకర్…ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించకుండానే సరే అనేస్తాడు. కానీ ఆమె బాబాయి (సిజ్జు),తాతయ్య మాత్రం నో చెప్తారు. ఎందుకంటే కపిల్ తండ్రి వల్లే ఆమె తండ్రి మరణించాడు. ఆయన క్రికెట్ బెట్టింగ్ పిచ్చే ఆయన ప్రాణాలు పోయేలా చేసింది. ఇప్పుడెలా …ఏం చెప్పి ఒప్పించి కపిల్ ఆమెను వివాహం చేసుకున్నాడు. కమలాకర్ లో మార్పు వచ్చిందా..అసలు క్రికెట్ బెట్టింగ్ ఆమె తండ్రి మరణానికి ఎలా కారణం అయ్యింది.
 
చూసుకోలేదా..కథ వినలేదా
 
ఈ మధ్యకాలంలో కనువిప్పు కథల హవా తగ్గిందనే చెప్పాలి. అప్పట్లో పత్రికల్లో ..సినిమాల్లో ఈ తరహా కథలు ఎక్కువగా వచ్చేవి. అయితే ఎవరూ ఎవరిమాటా వినటం లేదనో …మరేమో కానీ కనువిప్పు కథలు తగ్గిపోయాయి. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఈ దర్శకుడు మనసావాచా బాగా నమ్మినట్లున్నాడు. అందుకే క్రికెట్ బెట్టింగ్ వాటివల్ల ఓ ప్రేమ కథలో వచ్చే కలతలు..వాటిని హీరో ఎలా ఎదుర్కొని చక్కదిద్దాడు అనే పాయింట్ చుట్టూ కథ అల్లి సినిమా తీసాడు. క్రికెట్ బెట్టింగ్ బదులుగా ఏ పేకాటో అనుకుని చివర్లో మరీ బాగోదని ఈ కాలం జూదం అయిన క్రికెట్ బెట్టింగ్ పెట్టాడని అనిపించేలా స్క్రీన్ ప్లే నడుస్తుంది. అయితే ఆ దర్శకుడు కథ అనుకున్నాడు..తీసాడు బాగానే ఉంది కానీ..మధ్యలో వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న ఆదికు ఆ మాత్రం అర్దం కాలేదా..అతను కుర్రాడే కదా…. ఈ కనివిప్పు కథలేంటి ప్రపంచం గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటూ ముందుకు వెళ్తూంటే అనిపించలేదా…

ఎవరెలా చేసారు…ఏ డిపార్టమెంట్ సూపర్

ఆది సాయికుమార్ కు ఇలాంటి క్యారక్టర్స్ కొట్టిన పిండి. ఎందుకంటే కెరీర్ ప్రారంభం నుంచీ చేస్తున్నవి ఇవేగా. మంచి ఈజ్ ఉన్న ఈ ఆర్టిస్ట్ ….ఇలాంటి కథలో తన టాలెంట్ ని బయిటపడనివ్వటం లేదు. ఇక కాంచనమాల పాత్రలో శ్రద్దా శ్రీనాధ్ …ఒదిగింది అనాలో..ఎక్కువైంది అనాలో అర్దంకాదు..బాగా చేసింది కానీ గుర్తుండదు. తండ్రిగా నరేష్ …తన పాత నటననే మరోసారి నటించేసాడు. వెన్నెల కిషోర్ కామెడీ ఓకే. మిగతా పాత్రల్లో శిజ్జు, గొల్లపూడి వంటివారు …ఇలాంటివెన్నో చేసాం అన్నట్లు గా అలవోకగా చేసేసారు.
 
కథగా ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే…ఎక్కడా కొత్తదనం అనేది మచ్చుకు కూడాలేకుండా జాగ్రత్త పడి తీయటం. ఫస్టాఫ్ ఎంత నీరసంగా సాగుతుందో సెకండాఫ్ అంతకు మించి అన్నట్లు పోటీ పడుతుంది. ఫణి కల్యాణ్‌ సంగీతం సోసో.   సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు ఏవీ గొప్పగా లేవు.అలాగని మరీ తీసిపారేసేలా లేవు. అంటే స్పెషల్ గా చెప్పుకోదగిన స్దాయిలో లేవని అర్దం.

చూడచ్చా
తప్పకుండా…మీకు కనువిప్పు కథలపై ఇంట్రస్ట్ ఉంటే..
 ————
తెర ముందు..వెనక

నటీనటులు: ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్, వికే నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ తదితరులు
సంగీతం : ‘నీవే’ ఫణికళ్యాణ్,
 సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్,
ఎడిటర్ : రవి మండ్ల,
ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ వర్మ,
మాటలు : త్యాగరాజు (త్యాగు),
నిర్మాతలు: శాంతయ్య, పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం,
దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల
బ్యానర్: భావనా క్రియేషన్స్ బ్యానర్