తిప్పరా మీసం మూవీ రివ్యూ

Published On: November 8, 2019   |   Posted By:

తిప్పరా మీసం మూవీ రివ్యూ

లేదురా విషయం ( `తిప్పరా మీసం` రివ్యూ)
 
Rating: 1.5/5

చిన్న వయస్సులోనే డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు మణిశంకర్‌ (శ్రీవిష్ణు) . అతని పరిస్దితి చూసి అతని తల్లి లలితాదేవి (రోహిణి)కి  కంగారుపడుతుంది. డాక్టర్లు సలహాతో .. అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తుంది. అయితే ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తనని ఇంటికి తీసుకు వెళ్లకుండా అక్కడే రిహాబిటేషన్ సెంటర్ లో ఉంచేసిందని..తల్లి మీద ద్వేషం పెంచుకుంటూ పెరుగి పెద్దవుతాడు.  ఆ తర్వాత ఓ పబ్‌లో డీజేగా జాయిన్ అయ్యి నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. అంతే కాకుండా క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటుపడతాడు.దాంతో ఓ సారి క్రికెట్ బుకీకి రూ.30 లక్షలు అప్పుప‌డ‌తాడు. ఆ అప్పుని తీర్చటానికి అతని దగ్గర రూపాయి కూడా ఉండదు. దాంతో ఆ అప్పు  తీర్చేందుకు త‌ల్లి ద‌గ్గర‌కి వెళ్లి త‌న వాటా ఆస్తి ఇవ్వమంటూ గొడవ చేస్తాడు. తన దగ్గర  అంత ఎమౌంట్ లేదని కేవలం…, రూ.5 ల‌క్షలు మాత్రమే ఉన్నాయని చెక్ ఇస్తుంది.

అయితే తనకు ఐదు లక్షలు సరిపోవు కాబట్టి …ఆ చెక్ ని  ఫోర్జరీ చేసి బ్యాంక్ లో వేస్తాడు.  అంతకు తగ్గ డబ్బు బ్యాంక్ లో లేకపోవటంతో చెక్ బౌన్స్ అవుతుంది. దాంతో తన  త‌ల్లిపైనే చెక్ బౌన్స్ కేసు పెడ‌తాడు. తన కొడుకు కు బ్యాడ్ నేమ్ రాకూడదని కోర్టులో తనదే తప్పు అని ఒప్పుకుని తనకు ప్రాణప్రదమైన ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తుంది. దాంతో సమస్య తీరిపోయిందనుకుంటాడు మణి.కానీ మరో సమస్య అతని కోసం ఎదురుచూస్తోంది. ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభివిస్తాడు. అయితే జైలుకు వెళ్లే ముందు అతని గురించిన ఓ నిజం తెలుస్తుంది. దాంతో కదిలిపోతాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు ఏమైంది…ఇంతకు అతను తెలుసుకున్న నిజం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

కనువిప్పు కథే..

ఇలాంటి కనువిప్పు కథలు గతంలో చాలా వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో రాలేదు. దాంతో ప్రెష్ గా ఉంటుందనుకున్నారో ఏమో కానీ మీసం మెలేసే పనిలో పడ్డారు. కానీ స్టోరీలైన్ పాతదయినా స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్ సరిగ్గా ఉంటే బాగుండేది. అయితే సినిమాలో ఎక్కడా అంతగా చెప్పుగోదగ్గ అంశాలు కనపడవు. ఎపిసోడ్స్ గా కొన్ని బాగున్నా… టోటల్ గా చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది.  మెయిన్ సన్నివేశాలు కూడా బోర్ కొట్టడం విసిగించింది. దానికి తోడు ఫస్టాఫ్ లో ల్యాగ్ ఎక్కువై మరీ ఇబ్బందిగా అనిపించింది.  హీరో ఎమోషన్ జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. కాంప్లిక్ట్ లేకపోవటంతో కలిసిరాలేదు.

ఇక దర్శకుడు సెకెండాఫ్ ని తల్లి సెంటిమెంట్ తో ఎమోషనల్ గా నడుపుదామని  ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.  ఎంతసేపూ హీరో… డ‌బ్బు కోసం త‌ల్లిని వేధించ‌డం త‌ప్ప క‌థంటూ ఏమీ ఉండ‌దు.  ‘తిప్పరామీసం’ అనే టైటిల్ కు ఉన్నంత  పవర్ అస్సలు క‌నిపించ‌దు.  క్లైమాక్స్ లో తను వదిలేసిన ఫ్యామిలీ  కోసం హీరో చేసే ప‌నులు ఇంట్రస్ట్ కలిగిస్తాయి. అందుకే శ్రీవిష్ణు ఈ క‌థ‌ని ఒప్పుకొనుంటాడేమో అనిపిస్తుంది.
 
టెక్నికల్ గా…

శ్రీవిష్ణు యాక్టింగ్  పరంగా చాలా మెరుగయ్యారు. నెగిటివ్ షేడ్స్ తో కూడిన క్యారక్టర్ తో ఆకట్టుకున్నాడు. ఇక  శ్రీవిష్ణు త‌ల్లి పాత్రలో ఎప్పటిలాగే రోహిణి నటించుకుంటూ పోయింది.  హీరోయిన్ నిక్కీ తంబోలీ చిన్న పాత్ర,అది కూడా బాగోలేదు. ఇక టెక్నికల్ గా ఈ  సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం పాటల్లో కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో  బాగుంది. సిధ్ కెమెరావర్క్ నైట్ షూట్ ని కాప్చర్ చేసింది. ద‌ర్శకుడు కృష్ణ‌ విజ‌య్  నిరాశపరిచారు. ఆయన సరైన కథాకథనాలను రాసుకోలేకపోయారు.  ఎడిటర్ సినిమాలోని సాగతీత  సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాణ విలువలు గొప్పగా లేవు.  

“కన్నతల్లిని రోడ్డుమీదకు ఈడ్చిన కొడుకుగా చరిత్రలో మిగిలిపోతావ్.” ,  “నా గతాన్నీ, నా సమస్యనీ గుర్తించని ఈ పనికి మాలిన సమాజం నేను చేసింది తప్పూ అని ముద్ర వేసింది” , “అందరూ నన్ను అర్థంకాని యెదవననుకుంటారు. ఎవడేమనుకుంటే నాకేంటి?.. నేననుకున్నదే చేస్తా” వంటి డైలాగులు బాగున్నాయి.


చూడచ్చా…

శ్రీ విష్ణు అభిమానులకు తప్ప మిగతా వారు చూడటం కష్టమే.

తెర ముందు..వెనక

న‌టీన‌టులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి, బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్యర్ త‌దిత‌రులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహ‌ణం: సిధ్
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
క‌ళ‌: షర్మిల యెలిశెట్టి
పాట‌లు: పూర్ణాచారి, అల రాజా
నిర్మాత‌: రిజ్వాన్‌
దర్శకుడు: ఎల్‌. కృష్ణ విజయ్
నిర్మాణ సంస్థలు: రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కృష్ణ విజయ్ ఎల్‌. ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా
విడుద‌ల‌ తేదీ: 8-11-2019