తొలుబొమ్మలాట సినిమా రివ్యూ

Published On: November 23, 2019   |   Posted By:

తొలుబొమ్మలాట సినిమా రివ్యూ

పాత ఆటే… (‘తోలు బొమ్మలాట’ మూవీ రివ్యూ)

రేటింగ్ : 2/5

రైసు మిల్ ఓనర్ సోడాల రాజు అలియాస్ సోమరాజు (రాజేంద్ర ప్రసాద్) తన పల్లెలో చాలా గౌరవనీయమైన జీవితం గడుపుతూంటాడు. అయితే ఆయన అనుకోకండా హఠాత్తుగా చనిపోతాడు. చనిపోవటానికి ముందు తన  మనవడు రిషి (విశ్వంత్)  ప్రేమను తెలుసుకున్న సోడాల రాజు ఎలాగైనా ప్రేమించిన అమ్మాయి, తన మనవరాలు వర్ష (హర్షితా చౌదరి)కి ఇచ్చి పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే చనిపోవటంతో ఏం చేయాలో అర్దం కాదు. ఆ తర్వాత కుటుంబంలో జరిగిన  పరిణామాల్లో ప్రేమికులు ఇద్దరూ విడిపోతారు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఆస్ది తగాదాలు వస్తాయి. వాటిని అన్నిటిని ఆత్మగా మారిన సోమరాజు ఆ ఇంట్లోనే ఉండి చూస్తూ బాధపడుతూంటాడు. అయితే తన చుట్టం అయిన సంతోష్ (వెన్నెల కిషోర్) రాకతో ఆత్మకు కాస్త రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే సంతోష్ ..ఆత్మలను చూడగలడు..సంభాషించగలడు. అప్పుడు సంతోష్ సాయం తీసుకుని సోమరాజు ఏం చేసారు. తన మనవలను తిరిగి ఎలా కలిపి పెళ్లి చేసాడు అనేది మిగతా కథ.
 
కథా..కథనం

ఆ నలుగురు సినిమాని గుర్తు చేస్తూ ప్రారంభమయ్యే ఈ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ముందుకు వెళ్తుంది. సోమరాజు మృతితో కథలో కదిలిక వచ్చినా ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ అవటం మొదలవుతుంది. స్క్రీన్ ప్లేనే ప్రధాన సమస్యగా మారుతుంది. రాజేంద్రప్రసాద్ ని సోలోగా చూసే పరిస్దితి లేదు. చాలా టైట్ గా కథ,కథనం ఉంటే తప్ప అంతసేపు ఆయన్ని చూడటం కష్టమే. ఆ విషయం దర్శకుడు గమనించినట్లు లేదు. రాజేంద్రప్రసాద్ చుట్టూ సీన్స్ రాసుకున్నాడు. అవీ కథని నడపటానికే తప్ప ఇంట్రస్టింగ్ గా ఉండవు. అలాగే మేకింగ్ కూడా ఈ జనరేషన్ కు తగ్గట్లు ఉండదు. పాతకాలం డ్రామా చూస్తున్న ఫీల్ వస్తుంది. మెల్లిమెల్లిగ మన సమాజంలో మాయమైపోతున్న మానవ సంబంధాలు. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను గుర్తు చేయాలని దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే దాన్ని సరిగ్గా నడవనివ్వలేదు. హీరో,హీరోయిన్స్ లవ్ స్టోరీ కూడా జస్ట్ ఓకే అన్నట్లుంటుంది. రాజేంద్రప్రసాద్ ని ఎడాప్ట్ చేసుకోగలిగితేనే ఈ సినిమా నచ్చుతుంది.  ఉన్నంతలో సంతోష్ (వెన్నెల కిషోర్)  పాత్రతోనే సినిమాలో జోష్ పెరుగుతుంది. సంతోష్‌కు ఆత్మలు కనబడటమనేది ఫన్ పండించింది. ఇక తన మనవడు, మనవరాలు పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా లేరని తెలుసుకోవడంతో సోమరాజు షాక్‌కు గురవడం లాంటి అంశాలు బాగానే పేలాయి. సెకండాఫ్ కు వచ్చేసరికే ఆ జోష్ తగ్గిపోయింది.

నటీనటుల విషయానికి వస్తే…

 సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్ చుట్టూ తిరిగే కథ ఇది. మధ్యలో కమెడీయన్‌గా  వెన్నెల కిశోర్‌ సినిమా వచ్చి భారాన్ని షేర్ చేసుకున్నాడు. మిగతావాళ్లంతా సోసో.  యంగ్‌ హీరో విశ్వంత్ ఫరవాలేదు. కానీ రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ల ముందు అతడు తేలిపోయాడు. ఇక హీరోయిన్‌ హర్షిత చేయటానికి పెద్దగా సీన్స్ లేవు.  దర్శకుడి నుంచి నటుడిగా మారిన దేవీప్రసాద్‌ ఈ సినిమాలో బాగా చేసారు. చలపతిరావు, నారాయణరావు, తాగుబోతు రమేశ్‌, రాజు, దొరబాబు  వీళ్లంతా పాత్రల పరిధి మేరకు చేసుకుంటూ పోయారు.

టెక్నికల్ గా

ఈ సినిమా స్టోరీ లైన్ గా బాగున్నప్పటికీ…మలుపులు గట్రా కథలో లేకపోవటంతో చాలా సార్లు తేలిపోయింది. ఆ నలుగురు సినిమానే చాలా సార్లు గుర్తు వస్తుందంటే అది స్క్రిప్టు సమస్యే.కొత్త దర్శకుడు డైరక్ట్ చేసారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.కెమెరా వర్క్ పల్లె అందాలను బాగా పట్టుకుంది. ఎడిటింగ్‌, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.  

ఎవరెవరు..
 
నటీనటులు : డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ తదితరులు.
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ : సతీష్ ముత్యాల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
దర్శకత్వం : విశ్వనాథ్‌ మాగంటి
నిర్మాత‌లు : దుర్గాప్రసాద్‌ మాగంటి