దర్బార్ మూవీ రివ్యూ

Published On: January 9, 2020   |   Posted By:

దర్బార్ మూవీ రివ్యూ

ఫ్యాన్స్ కు సూపర్.. (‘దర్బార్’ రివ్యూ)
 
Rating: 2.5/5
 
రజనీ సినిమాలు తెలుగులోనూ తెగ ఆడాయి. గత కొద్ది కాలంగా ఆడటం ఆగిపోయాయి. రొటీన్ కథలు, వయస్సు మీదపడి డల్ అయిన రజనీ స్టైల్…భాక్సాఫీస్ కు బోర్ కొట్టేసాయి. ఏదో కొత్తదనం కావాలి…ఈ తరాన్ని సైతం ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి. ట్రైలర్స్ కే పరిమితమయ్యే ‘కబాలి’, ‘పేట’ ల వద్ద పెద్ద కలిసొచ్చేదేమీ లేదు. ఈ టైమ్ లో రజనీని కొత్తగా ప్రెజెంట్ చేస్తాను..పాత రజనీని మీ ముందు నిలుపుతాను అంటూ దర్శకుడు మురగదాస్ ముందుకు వచ్చాడు. సరే అన్న సూపర్ స్టార్ ని ఏ విధంగా ‘దర్బార్’ లో చూపెట్టాడు. ఈ సినిమా అయినా థియోటర్స్ లో కొద్దికాలం నిలబడుతుందా…మన తెలుగు స్టైయిట్ సంక్రాంతి సినిమాలకు పోటీ ఇస్తుందా…అసలు కథేంటి, మురగదాస్ చూపించిన స్పెషాలిటీస్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్
 
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఆదిత్య అరుణాచ‌లం(ర‌జ‌నీకాంత్‌) ముంంబై రాగానే అండర్ వరల్డ్ ఉలిక్కిపడుతుంది. వరసపెట్టి చట్టంతో సంభందం లేకుండా క్రిమినల్స్ ని ఏరేస్తూంటాడు.  నేను బ్యాడ్  పోలీసునని చెప్పే అతనికి ఎదురు చెప్పేవారే ఉండరు. ఎవరైనా  త‌ప్పని ఎవ‌రడ్డొచ్చినా లెక్కచేయకుండా ముందుకు వెళ్తూంటాడు.  ఈ క్రమంలో డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ ముఠా నుంచి ఛాలెంజ్ ఎదురౌతుంది. ఆ కేసులోకి మరింత లోతుగా వెళ్లి ఓ హై ఫ్రొఫైల్ అరెస్ట్ చేస్తాడు. అతనే అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్). అతన్ని అరెస్ట్ చేసి నాసిక్ జైల్లో పెడితే..తప్పించుకుని పారిపోతాడు. దాంతో అతన్ని వెతికి పట్టుకున్న ఆదిత్య అతన్ని ఎనకౌంటర్ చేసేస్తాడు. అప్పుడు  అజయ్ తండ్రి హ‌రిచోప్రా (సునీల్ శెట్టి) ఎంటరవుతాడు.  తన కొడుకుని చంపిన వాడిపై పగ తీర్చుకోవటానికి విదేశాల నుంచి ముంబై వస్తాడు. అతనితో ఆదిత్యకు పాత పగలు ఉంటాయి. అసలు ఎవరీ ఆదిత్య…అతనికి హరి చోప్రాకు మధ్య ఏం జరిగింది. ర‌జ‌నీ లైఫ్ లోకి వ‌చ్చిన లిల్లీ (న‌య‌న‌తార) క‌థేమిటి?  వ‌ల్లి (నివేదా థామ‌స్) ..రజనీకాంత్ కు ఏమౌతుంది..హరి చోప్రా ను ..ఆదిత్య ఎలా మట్టుపెట్టాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్టోరీ, స్క్రీన్ ప్లే ఎనాలసిస్
 
నిజానికి ఇది కొత్త కథ కాదు. కానీ రజనీ స్టైల్స్, మురగదాస్ మ్యాజిక్ మీద ఆధారపడి అల్లుకున్నది.  డ్రగ్స్, అమ్మాయిల అక్రమ రవాణా వంటి సోషల్ ఎలిమెంట్స్‌ కు చోటిచ్చినా వాటిపై పెద్ద చర్చ లేదు. కథ నడవటానికి అడ్డం పెట్టుకున్నారంతే. దాంతో ఎక్కువగా స్క్రీన్ ప్లే పై ఆధారపడాల్సి వచ్చింది. అప్పటికీ ఫస్టాఫ్ ..రజనీ సినిమాలా కొంత,తన తుపాకి చిత్రంలా మరికొంత చేసి ఇంట్రవెల్ దాకా సక్సెస్ ఫుల్ గా నడిపేసాడు. అయితే సెకండాఫ్ లోనే ఇబ్బంది ఎదురైంది. కథ పెద్దగా లేక పూర్తిగా స్లో అయ్యిపోయింది. ట్విస్ట్ లు, టర్న్ లు లేని క్లైమాక్స్ నీరసం తెప్పించింది. మురగదాస్ వంటి దర్శకుడు కూడా రజనీ అనేసరికి రొటీన్ గానే ఆలోచించాడే అనిపిస్తుంది. అయితే తండ్రి కూతుళ్ల మధ్య అనురాగాలు, ప్రేమను కొత్తగా చూపించాడు. అలాగే నయనతారతో లవ్ ట్రాక్‌లో ప్రెష్‌ గా అనిపిస్తుంది. కానీ దాన్ని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. డిప్యూటీ సీఎం కుమార్తె కిడ్నాప్‌ని ఛేదించే సీన్స్ బాగున్నాయి.
 
టెక్నికల్ గా ..
సంతోష్ శివ‌న్ కెమెరా వర్క్ కు ఎక్కడా వంకపెట్టలేం. అలాగే.., అనిరుధ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా  నిలుస్తాయి. దుమ్ము ధూళి పాట‌ అదరకొట్టారు. ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌, ఆయన స్టైల్‌పైనే ఎక్కువ‌గా ఆధార‌పడటంతో కొన్ని సార్లు పాత సినిమా చూసిన ఫీల్ వస్తూంటుంది. ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో మరింత షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

రజనీ ఈ సినిమాలో మరీ కుర్రాడిలా ఫైట్స్, డాన్స్ లు అదరకొట్టారు.  కూతురుతో వ‌చ్చే స‌ీన్స్ లో ఆయన అనుభవం కనిపిస్తుంది. నివేదా థామ‌స్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించింది. న‌య‌న‌తార క్యారక్టర్ చిన్నదే అయినా ఉన్నంత‌లో ఆక‌ట్టుకుంది. సునీల్ శెట్టి విలన్ గా పెద్దగా మెప్పించలేదనే చెప్పాలి. యోగిబాబు మరో వడివేలుగా మారేటట్లున్నారు.


చూడచ్చా
రజనీ ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చుతుంది..మిగతావాళ్లకు ఫరావలేదనిపిస్తుంది

తెర వెనుక …ముందు
సంస్థ‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, తంబి రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు.
ఫైట్స్: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్
పాటలు: భాస్కర‌భ‌ట్ల‌, కృష్ణకాంత్‌
ఛాయాగ్రహ‌ణం: స‌ంతోష్ శివ‌న్‌
సంగీతం: అనిరుద్ ర‌వి చంద్రన్
నిర్మాత: ఎ.సుభాస్కరన్
స్క్రీన్ ప్లే, ద‌ర్శక‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌
స‌మ‌ర్పణ‌: ఎన్వీప్రసాద్‌
విడుద‌ల‌: 9 జ‌న‌వ‌రి 2020