దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ

Published On: October 17, 2017   |   Posted By:
దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ
దీపావళి కానుకగా రేపు థియేటర్లలోకి రానుంది రాజా ది గ్రేట్. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించడం విశేషం. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు అనిల్ రావిపూడి.
ఈ మూవీ చేయడానికి మెయిన్ రీజన్
అందరూ హారర్ సినిమా చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ చేశారు. ఓ అంధుడి పాత్రతో పక్కా కమర్షియల్ సినిమా రాలేదు. ఆ యాంగిల్ లో చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి రాజా ది గ్రేట్ పుట్టింది. ఈ సినిమా చేయకముందు కాబిల్, ఫనా, కనుపాప లాంటి చాలా సినిమాలు చూశాం. కానీ ఇలాంటి యాంగిల్ ఎవరూ టచ్ చేయలేదనిపించి చేశాం.
ఇందులో లాజికల్ యాక్షన్ ఉంటుంది
ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. ఒక అంధుడు ఫైట్స్ ఎలా చేస్తాడని అంతా అనుకోవచ్చు. కానీ ఇందులో అన్ని లాజిక్స్ ఉంటాయి. బాగా హోంవర్క్ చేసి చేశాం. ఇది ఏ మూవీకి రీమేక్ కాదు. ఏ దర్శకుడైనా కొన్ని సినిమాలు చూసి స్పూర్తి పొందుతాడు. నేను కూడా అలానే కొన్ని సినిమాలు చూసి వాటి స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది. మక్కికి మక్కి ఏ సినిమా
చూసి కాపీకొట్టలేదు. సినిమాలో మన తెలుగు నేటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి.
రవితేజ షాకయ్యారు
కథ చెబుతాంటే రవితేజ రమ్మన్నారు. అప్పటికే నాపై ఉన్న నమ్మకంతో పిలిచారు. కానీ నేను ముందే అంధుడి పాత్ర అని చెప్పలేదు. నెరేషన్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి అర్థమై రవితేజ షాకయ్యారు. 2-3 సీక్వెన్స్ లు చెప్పిన తర్వాత ఇంట్రెస్ట్ చూపించారు. ట్రీట్ మెంట్ చాలా వెరైటీగా ఉంటుంది. నా నెరేషన్ మీద నమ్మకంతో ఓకే చేశారు.
రామ్, ఎన్టీఆర్.. తర్వాత రవితేజ
ఈ కథ అనుకున్నప్పుడు మొదట రామ్ కు వినిపించిన మాట వాస్తవమే. తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు కూడా వెళ్లాను. రామ్ కు చెప్పిన కథనే ఎన్టీఆర్ కు కూడా చెప్పాను. కానీ రవితేజతో ఇప్పుడు చేసిన రాజా ది గ్రేట్ సినిమా మాత్రం రామ్, ఎన్టీఆర్ కు చెప్పిన కథ కాదు. లైన్ అదే అయినప్పటికీ టోటల్ కథ మార్చుకున్నాను. ఎన్టీఆర్ కు చెప్పిన కథకు రాజా ది గ్రేట్ కు
సంబంధం లేదు.
అంధుడితో వినోదం
సాధారణంగా కనిపించే క్యారెక్టర్స్ తో ఎంత ఎంటర్ టైన్ మెంట్ పండించామో.. అంధుడి పాత్రతో కూడా అంతే వినోదం అందించాం. ఇంకా చెప్పాలంటే కొత్తగా కూడా ట్రై చేశాం. కానీ ఎప్పుడూ రిస్క్ అనిపించలేదు. ఓ అంధుడు ఎలా వినోదం పంచగలడో అంతా లాజికల్ గా ఇందులో కనిపిస్తుంది.
మొదటి శ్రోత దిల్ రాజు
పదేళ్ల కిందట ఓ ఇంగ్లిష్ సినిమా చూశాను. అంతకంటే ముందు మోహన్ లాల్ నటించిన యోధ సినిమా చూశాను. ఆ రెండు సినిమాల్లో హీరోకు కళ్లు ఉండవు. అలాంటి క్యారెక్టర్ తో ఎంటర్ టైన్ మెంట్ చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. అలా రాసుకున్న కథను మొదట దిల్ రాజుకు వినిపించాను. దిల్ రాజుకు చాలా నచ్చింది. వెంటనే స్టోరీ డెవలప్ చేయమని చెప్పారు. అలా రాజా ది గ్రేట్ పుట్టుకొచ్చింది.
రాధికకు రీఎంట్రీ ఇది
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రాధిక పాత్రలు చాలా హైలెట్. రవితేజకు తల్లిగా నటించారు. ఆమెపై వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఆమెపై తీసిన ఎపిసోడ్స్ అన్నీ ది బెస్ట్ అనిపిస్తాయి. రీసెంట్ గా తెలుగులో రాధికకు గ్యాప్ వచ్చింది. ఇది ఆమెకు రీఎంట్రీ అనే చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసరెడ్డి కూడా చాలా బాగా చేశారు.
రాజా ది గ్రేట్ స్టోరీలైన్ ఇదే
హీరోయిన్ కు ఎదురయ్యే సమస్యతో కథ మొదలవుతుంది. హీరో మధ్యలోకి ఎంటర్ అవుతాడు. రాధిక ఓ పోలీస్ కానిస్టేబుల్. అంధుడైన తన కొడుకును పోలీస్ చేయాలనుకుంటుంది. చివరికి హీరోయిన్ సమస్యను పరిష్కరించిన హీరో, పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ.
మహాధన్ మహా ముదురు
హీరో చిన్ననాటి పాత్రను రవితేజ కొడుకు మహాధన్ చేశాడు. అంధుడైన పిల్లాడికి ట్రయినింగ్ ఇచ్చే సన్నివేశాలవి. ఆ క్యారెక్టర్ లో మహాధన్ చాలా బాగా చేశాడు. నిజానికి ఈ క్యారెక్టర్ కు ఎవర్నో పెట్టి తీసేయమన్నారు రవితేజ. కానీ మహాధన్ అయితే క్యారెక్టర్ మరింత పండుతుందని నేను, దిల్ రాజు బలవంతంగా రవితేజను ఒప్పించాం. మహాధన్ చాలా బాగా చేశాడు. మొదటి సినిమాకే అంధుడిగా భలే మెప్పించాడు.
సినిమాలో రొమాన్స్ అనేది కనిపించదు 
హీరోకు కళ్లు ఉండవు కాబట్టి రొమాన్స్ పెట్టలేదు. కానీ హార్ట్ టచింగ్ ఫీలింగ్స్ ఉంటాయి. హీరోకు హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేసే సీన్స్ చాలా బాగా వచ్చాయి. సాయి కార్తీక్ మంచి రీ-రికార్డింగ్ ఇచ్చాడు. అంధుడి పాత్రలో రవితేజ అద్భుతంగా నటించారు. ఎక్కడైనా తప్పులు పట్టుకుందామని చాలా జాగ్రత్తగా పరిశీలించేవాడ్ని. కానీ రవితేజ మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఎక్కడా నాకు దొరకలేదు. ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది.
పవర్ వల్ల పటాస్ మిస్ అయింది
రవితేజ దరువు సినిమా చేస్తున్నప్పుడు పటాస్ కథ చెప్పాను. ఆ తర్వాత కొన్ని రోజులకు పవర్ కథ తెరపైకి వచ్చింది. ఆ టైమ్ లో మరోసారి పటాస్ కథ చెప్పాను. కానీ అప్పటికే పవర్ స్టోరీకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పటాస్ స్టోరీని కల్యాణ్ రామ్ తో చేశాను.
మెహ్రీన్ చాలా బాగా చేసింది
రాజా ది గ్రేట్ సినిమా మెహ్రీన్ కు మూడో సినిమా. సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేసింది. పాటల కోసం కాకుండా.. కథ ప్రారంభమే మెహ్రీన్ తో ఉంటుంది. ఆమెను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుంది.
రవితేజ సినిమా ఎప్పుడూ చూడరు
దిల్ రాజు నన్ను ఎప్పుడూ పొగడరు. పటాస్ చూశాక మంచి హిట్ సినిమా తీశావ్ అని మాత్రమే అన్నారు. సుప్రీమ్ చూసిన తర్వాత బయటపడ్డావ్ అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం 2-3 పొగడ్తలు ఇచ్చారు. చాలా హ్యాపీ. ప్రివ్యూ చూసిన వాళ్లు కూడా చాలా మెచ్చుకున్నారు. ఇక మిగిలింది ఆడియన్స్ తీర్పు మాత్రమే. రవితేజ రిలీజ్ కు ముందు సినిమా ఎప్పుడూ చూడరు. ఈ సినిమా మాత్రం మొత్తం చూశారు.