దర్శకుడు మదన్ ఇంటర్వ్యూ

Published On: February 5, 2018   |   Posted By:
దర్శకుడు మదన్ ఇంటర్వ్యూImage result for దర్శకుడు మదన్
షార్ట్ గ్యాప్ తర్వాత మరోసారి గాయత్రి సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు దర్శకుడు మదన్. ఆ నలుగురు, పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు.. మోహన్ బాబు హీరోగా గాయత్రి అనే సినిమాను రూపొందించాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా గురించి మదన్ ఏమంటున్నాడో చూద్దాం.
ఎక్కువ మాట్లాడను
మనిషి జీవితంలో కష్టసుఖాలు రెండూ ఉంటాయి. ఆ రెండింటితో ముడిపడి ఉండేదే గాయత్రి సినిమా. డిఫెరెంట్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఈ మూవీ గురించి ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు చెప్పను. రిలీజ్ తర్వాత మళ్లీ మాట్లాడతా. సినిమా ఎమోషన్స్ మాత్రం భారీగా ఉంటాయని చెప్పగలను.
విష్ణు పాత్ర అదే
సినిమాలో యంగ్ మోహన్ బాబు పాత్రలో మంచు విష్ణు కనిపిస్తాడు. ఇంతకు మించి సినిమా రిలీజ్ కి ముందు ఈ క్యారెక్టర్ గురించి చెబితే థ్రిల్ మిస్ అవుతాం. దయచేసి విష్ణు పాత్ర గురించి ఎక్కువగా అడగొద్దు.
తండ్రికూతురు కథ
తండ్రీ కూతుళ్ళ మధ్య ఉండే బాండింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉండే అనురాగ బంధమే ఈ సినిమా. మోహన్ బాబు గారి కూతురు గాయత్రిగా నిఖిలా విమల్ నటించింది. ఆమెకు ఈ సినిమా పెద్ద పేరు తీసుకొస్తుంది.
మోహన్ బాబు స్థాయి అది
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, శివాజీ గణేశన్ స్థాయి నటుడు మోహన్ బాబు. ఆయనతో సినిమా తీయాలంటే ఆ స్థాయిని గుర్తుపెట్టుకొని కథలు రాయాలి. అప్పుడు మాత్రమే మోహన్ బాబులో పూర్తిస్థాయిలో నటుడు బయటకొస్తాడు. గాయత్రి సినిమా అలాంటిదే. ఈ కథకు మోహన్ బాబును తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేకపోయాను.
సింగిల్ సిట్టింగ్ మాత్రమే
కేవలం ఒక్క సిట్టింగ్ లో గాయత్రి కథకు మోహన్ బాబు ఓకే చెప్పారు. అది నా అదృష్టం. అంతకు ముందు ఆయనకు నాకు పరిచయం కూడా లేదు. అంత గొప్ప నటుడితో పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. సేమ్ టైం ఎంతో బాధ్యతగా కూడా ఫీల్ అయ్యాను.
మోహన్ బాబు రీలాంచ్ మూవీ
ఒకరకంగా గాయత్రి సినిమా మోహన్ బాబు గారికి రీలాంచ్ లాంటిదే. కాబట్టి ఆయనకు ఉండే వత్తిడి ఆయనకుంటుంది. అందుకే ఆయనకు తోచిన సలహాలు ఇచ్చేవారు. కానీ సలహా ఇచ్చిన ప్రతిసారి ఆచి తూచి చెప్పేవారు. ఏదో సినిమాలో వేలుపెట్టాలనే ఉద్దేశం ఆయనది కాదు. ఆయనిచ్చే సలహాలన్నీ చాలా నిజాయితీగా, జెన్యూన్ గా ఉంటాయి.
భావోద్వేగాలు కదిలిస్తాయి
ఫ్యామిలీ డ్రామాలేవీ చూసినా పాతగానే అనిపిస్తుంటాయి. గాయత్రిలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండటంతో కాస్త రొటీన్ లాగా అనిపించవచ్చు. కానీ ఏ సినిమాకైనా కావాల్సింది ఎమోషన్. అలాంటి భావోద్వేగాలు గాయత్రిలో పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడ్ని కదిలిస్తుంది.
తక్కువ సినిమాలే చేస్తాను
ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నా నుంచి అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు వస్తాయి. నేనెప్పుడూ పోటీ పడి సినిమాలు చేయను. ఇన్ని సినిమాలు చేశాననే లెక్కలు నాకు అవసరం లేదు. మంచి కథ, సెటప్ కుదిరినప్పుడు మాత్రమే సినిమా చేస్తాను. లేదంటే లేదు. ఇదే నా స్టయిల్.
ఈ ఏడాది రెండు
నెక్ట్స్ ప్రాజెక్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కథ ఇంకా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉంది. అయితే ఒకటి మాత్రం చెప్పగలను. ఈ ఏడాదిలోనే గాయత్రితో పాటు మరో సినిమా రిలీజ్ ఉంటుంది. గాయత్రి విడుదల తర్వాత నా కొత్త సినిమా వివరాలు చెబుతాను.