దర్శకుడు వీవీ వినాయక్ ఇంటర్వ్యూ

Published On: February 7, 2018   |   Posted By:

దర్శకుడు వీవీ వినాయక్ ఇంటర్వ్యూ

సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇంటిలిజెంట్. పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో ఈ సినిమా ఉంటుందంటున్నాడు దర్శకుడు. సినిమా విశేషాలతో పాటు..తన కెరీర్ అప్ డేట్స్ ను మీడియాతో పంచుకున్నాడు వినాయక్.

సినిమా బాగా వచ్చింది
నిన్ననే ఫస్ట్ కాపీ చూశాను. సినిమా బాగా వచ్చింది. మంచి కామెడీ, యాక్షన్, సాంగ్స్ ఇలా అన్నీ ఉన్న పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఆకుల శివ ఇంతకుముందు నాకు 3 కథలిచ్చాడు. ఆ మూడూ హిట్ అయ్యాయి. ఇంటిలిజెంట్ కూడా పెద్ద హిట్ అవుతుంది.

తమన్ చాలా పెద్దోడైపోయాడు
తమన్ నాకు నాయక్ సినిమాకు పనిచేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇంటిలిజెంట్ తో మేం కలిశాం. సినిమాకు 4 బ్రహ్మాండమైన పాటలిచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఈ పాటల్ని అందంగా తెరకెక్కించాడు. సి.కల్యాణ్, నేను అన్నదమ్ముల్లా ఉంటాం. సాధారణంగా నేను అందర్నీ బాగా చూసుకుంటాను. కానీ ఈ సినిమా విషయంలో నన్ను, కల్యాణ్ బాగా చూసుకున్నాడు.

తేజూను చూస్తే చిరంజీవి గుర్తొస్తారు
సాయిధరమ్ తేజ్ తన స్టయిల్ లో చక్కగా చేశాడు. ఇంతకుముందు తేజూ చేసిన అన్ని సాంగ్స్ కంటే, ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి. కామెడీ, యాక్షన్ కూడా చక్కగా చేశాడు. ఓ సాంగ్ లో అయితే అందరికీ చిరంజీవి గుర్తొస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత ఎంత పెద్ద కథనైనా సాయిధరమ్ తేజ్ మోయగలడు అనే ఫీలింగ్ వస్తుంది.

ఇంటిలిజెంట్ స్టోరీలైన్
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే హీరో, తనకు హెల్ప్ చేసిన వ్యక్తి కోసం ఎంతవరకు పోరాడాడు, ఆ వ్యక్తి ఫ్యామిలీని ఎలా నిలబెట్టాడనేది ఇంటిలిజెంట్ కథ. సినిమా కథకు తగ్గట్టే ఇంటిలిజెంట్ అనే టైటిల్ పెట్టాం. మూవీలో చిన్న మైండ్ గేమ్ ఉంటుంది. సినిమా చూస్తే టైటిల్ కరెక్ట్ అని ఒప్పుకుంటారు.

లావణ్యను తీసుకోవడానికి కారణం
తేజూ సరసన కాజల్ లాంటి పెద్ద హీరోయిన్లను పెట్టే ఉద్దేశం లేదు. తన ఏజ్ గ్రూప్ తో సరిపోయే హీరోయిన్ల లిస్ట్ చూస్తే, దాదాపు అందరితో చేసేశాడు. ఒక్క లావణ్య త్రిపాఠి మాత్రమే పెండింగ్ అనిపించింది. కాంబినేషన్ కూడా ఫ్రెష్ గా ఉంటుందని పెట్టాం.

4 పాటలే పెట్టడానికి కారణం
ఖైదీ నంబర్ 150లో పాటలు నాలుగే ఉన్నాయి. ఇంటిలిజెంట్ లో కూడా 4 పాటలే ఉన్నాయి. సెంటిమెంట్ కోసం అలా చేయలేదు కానీ, కథ ప్రకారం 4 పాటలతోనే సరిపోయింది. అంతకంటే ఎక్కువ పెడితే ఫ్లో దెబ్బతింటుందని పెట్టలేదు.

రీమిక్స్ సాంగ్ పెట్టాలని ముందే అనుకున్నాం
మూవీలో రీమిక్స్ సాంగ్ పెట్టాలని ముందే అనుకున్నాం. ఎందుకంటే ఛమక్..ఛమక్ అనే సాంగ్ నాకు చాలా ఇష్టమైన పాట. తేజూతో డిస్కస్ చేసినప్పుడు ముందే చెప్పాను. మా నిర్మాత కల్యాణ్, ఇళయరాజాను కలిసి ఆయన అనుమతి తీసుకున్నారు. ఇళయరాజా ఒప్పుకోవడం మా అదృష్టం.

కమర్షియల్ కథలు ఇష్టం
నా సినిమాలన్నీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటాయి. ఓ కథ విన్నప్పుడు, ఇది బాగుంది థియేటర్లలో బాగా ఆడుతుందని అనిపిస్తే చేసేస్తాను. కథ ఏదైనా అందులో కమర్షియల్ మీటర్ మిస్ అవ్వకుండా చూసుకుంటాను.

చెర్రీ, బన్నీ చాలా కూల్
చరణ్ బేసిగ్గానే చాలా సౌమ్యుడు. మంచి వాల్యూస్ ఉన్న వ్యక్తి. బన్నీ కూడా చిన్నప్పట్నుంచి తెలుసు. చిరంజీవితో ఠాగూర్ చేసినప్పుడు వీళ్లంతా చిన్నపిల్లలు. వాళ్లతో ఎప్పుడూ కలిసేవాడ్ని. తర్వాత వాళ్లతో సినిమాలు చేసినప్పుడు కూడా అంతే సాఫ్ట్ నెస్ వాళ్లలో చూశాను.

అన్ని రకాల కథలు చేయాలి
ఓ దర్శకుడిగా బయట కథలతో కూడా సినిమాలు చేయాలి. అప్పుడే మనలోకి కొత్త కోణాలు బయటకొస్తాయి. బయట కథలతో నేను సినిమాలు చేయకపోతే ఇప్పటికీ నన్ను ఫ్యాక్షన్ డైరక్టర్ గానే చూసేవారు. బయట రచయితలు చెప్పిన కథలు కూడా చేశాను కాబట్టే నాలో కామెడీ యాంగిల్ కూడా ఓపెన్ అయింది. కృష్ణ, అదుర్స్ లాంటి సినిమాలు చేయడం వల్ల దర్శకుడిగా నాలోని కొత్త యాంగిల్స్ బయటకొచ్చాయి.

ఆ భావన కరెక్ట్ కాదు
కేవలం ఆకుల శివతోనే సినిమాలు చేస్తున్నానని అనుకోవడం పొరపాటు. ఇంటిలిజెంట్ నాకు 17వ సినిమా. ఈ 17 సినిమాల్లో ఆకుల శివ చెప్పిన కథలతో 3 సినిమాలే వచ్చాయి. కాకపోతే ఆకుల శివతో వర్క్ చేసినప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

కాపీ కథల కల్చర్ ఇప్పటిది కాదు
సినిమా కథలు కాపీ అంటూ విమర్శలు రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేకపోవడం వల్ల చాలామందికి తెలియలేదు కానీ, ఎప్పట్నుంచో ఇలా కాపీ కొట్టే కల్చర్ ఉంది. కాకపోతే ఇప్పుడు అందరికీ తెలిసిపోతోంది. స్ఫూర్తి పొందడంలో తప్పులేదు, యాజ్ ఇటీజ్ కాపీ కొట్టేయడం తప్పు. తెలుగులో కూడా మంచి కథలు వస్తున్నాయి. కానీ ఆ సంఖ్య ఇంకా పెరగాలి.

రెండేళ్ల తర్వాత కొత్త కథ
అంతా కొత్తవాళ్లతో ఓ మంచి కాన్సెప్ట్ మూవీ చేయాలని ఉంది. రెండేళ్ల తర్వాత ఆ ప్రయత్నం చేస్తాను. ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసే ఆలోచన కూడా ఉంది. దీనిపై కూడా రెండేళ్ల తర్వాతే ఆలోచిస్తాను. మల్టీస్టారర్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదు.

ప్రతి రచయిత దర్శకుడిగా మారాలి
రచయిత అనేవాడు దర్శకుడిగా మారాలనే నేను కోరుకుంటాను. అప్పుడే సినిమాల్లో కొత్తదనం వస్తుంది. కాకపోతే మంచి టాలెంట్ ఉండేవాళ్లకు అవకాశాలు రావట్లేదు. అవకాశాలు వచ్చిన దర్శకులకు మంచి కథలు దొరకడం లేదు.

అదుర్స్ సీక్వెల్ సెట్ అవ్వట్లేదు
అదుర్స్-2 కోసం ఒకటి, రెండు సార్లు కథ మీద వర్క్ చేశాం. కానీ ఔట్ పుట్ అంత సంతృప్తికరంగా రాలేదు. నాకు చేయాలని బలంగా ఉంది. కానీ కథ ఎప్పుడు సెట్ అవుతుందో తెలీదు. టైం దొరికినప్పుడల్లా ఆ సీక్వెల్ మీద కూర్చుంటున్నాం కానీ ఏదీ వర్కవుట్ కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

దిల్ రాజు నా మనిషి
దిల్ రాజుతో సినిమా చేసి చాన్నాళ్లయిందనే ఫీలింగ్ నాకు లేదు. ఇప్పుడు మీరు చెబుతుంటే అనిపిస్తోంది. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ పై వచ్చిన దర్శకులంతా నాతో ఏదో ఒక విధంగా అసోసియేట్ అయి ఉన్నారు. మరీ ముఖ్యంగా దిల్ రాజు నన్ను ఎప్పుడూ వదల్లేదు. ఏదో ఒక ఫంక్షన్ కు వెళ్తూనే ఉన్నాను. అందుకే ఆ బ్యానర్ కు దూరమయ్యాననే ఫీలింగ్ రాలేదు. అదెప్పుడూ నా బ్యానరే.

మహేష్ సినిమా చేయాలి
మహేష్ తో చేయాల్సిన సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఒకట్రెండ్ సార్లు చేద్దాం అనుకున్నాం. కానీ కథలతోనే సమస్య వచ్చిపడుతోంది. మంచి స్టోరీ సెట్ అవ్వట్లేదు. మహేష్ ను ఒప్పించే కథ చెప్పలేకపోయాను. మహేష్ కు నచ్చే కథ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను.