నాటి నోట్లరద్దుపై నేటి రివ్యూ ‘చోక్డ్’

Published On: June 9, 2020   |   Posted By:

నాటి నోట్లరద్దుపై నేటి రివ్యూ ‘చోక్డ్’

Rating:2.5

ప్రధాని నరేంద్రమోదీ నాలుగేళ్ల క్రితం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావాన్ని చూపించిందో లేదో కానీ మిడిల్ క్లాస్ పై మాత్రం ప్రతికూల ప్రభావాన్నే చూపించింది. ఆ ప్రకంపనలు ఇప్పటికీ చాలా మంది మదిలో మ్రోగుతూనే ఉన్నాయి. ఆ తడి ఆరని జ్ఞాపకాలను మళ్లీ తవ్వి తీసి మళ్లీ మన ముందు పెట్టాడు అనురాగ్ కశ్యప్. నోట్ల రద్దుతో ఓ మిడిల్ క్లాస్ మహిళ ఎలా సఫరైంది..ఆమె కలలు ఎలా చెల్లా చెదురు అయ్యాయి వంటి విషయాలను వ్యంగ్యాత్మకంగా వివరించే ప్రయత్నం చేసారు. అయితే ఇది మామూలు సగటు సినీ దర్శకుడు తీస్తే అసలు జనం పట్టించుకోపోదురు. దొంగ వచ్చిన ఆర్నెల్లకు కుక్క మొరిగింది అనేసి ప్రక్కకి నెట్టేద్దురు. కానీ డైరక్ట్ చేసింది..అలాంటి ఇలాంటి డైరక్టర్ కాదాయే..దేశం మొత్తం మెచ్చుకున్న అనురాగ్ కశ్యప్. దానికి తోడు సినిమాని సగటు సామాన్యులకు అందుబాటులో ఓటీటిలో విడుదల చేసారు. కాబట్టి ఖచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తి మొదలవుతుంది. ఆ ఆసక్తిని ఈ సినిమా క్యాష్ చేసుకోగలిగిందా. లేక మిడిల్ డ్రాప్ అయ్యిందా…అసలు కథేంటి…చూడచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

నిజానికి ఈ సినిమా పెద్ద కథేమీ కాదు. ముంబైలో ఒక సగటు మిడిల్ క్లాస్ మహిళకి కట్టల కొద్దీ డబ్బు ఊహించని విధంగా డబ్బు వచ్చి పడితే,దాన్ని అందుకునేలోగా నోట్ల రద్దు వచ్చి అడ్డుపడితే ..ఆ మిడిల్ క్లాస్ మహాలక్ష్మి పరిస్దితి ఏమిటి అనేదే స్టోరీ లైన్. కాస్త వివరణగా వెల్తే ముంబైలో సరిత (సయామీ ఖేర్)ది పరమ రొటీన్ మిడిల్ క్లాస్ జీవితం. నిరుద్యోగి భర్త, కొడుకు తో ఆమె లోకల్ బ్యాంక్ లో క్యాషియర్ జాబ్ చేస్తూ జీవితం లాగుతూంటుంది. ఓ రోజు రాత్రి ఆమెని అదృష్టం వెతుక్కుంటూ వచ్చి నోట్ల కట్టల రూపంలో కాలింగ్ బెల్ కొడుతుంది. ఊహించని విధంగా ఆమె కొన్ని కరెన్సీ కట్టలను కిచెన్ సింక్ పైప్ లో చూస్తుంది. టైట్ గా ప్లాస్టిక్ కవర్ తో కట్టలుగా కట్టిన డబ్బు ని ఎవరు అక్కడ పెట్టారో అర్దం కాదు. సర్లే ఎవరు పెడితే ఏంటి అని ఖర్చు పెడటం మొదలెడుతుంది. అందులో డబ్బు వస్తూనే ఉంటుంది. ఆ డబ్బుతో తన భర్త అప్పులు తీర్చేస్తుంది. ఇంకా చాలా చేసేస్తుంది. అయితే ఈ లోగా ‘నోట్ల రద్దు’ వస్తుంది. అది చాలదన్నట్లు ఈ విషయం గమనించిన ఓ వ్యక్తి ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం మొదలెడతాడు. అక్కడ నుంచి సరిత తన దగ్గర ఉన్న డబ్బుతో ఏం పాట్లు పడింది, ఎలా ఆ సమస్యల నుంచి బయిటపడింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్కీన్ ప్లే, దర్శకత్వం..

దర్శకుడుగా అనురాగ్ కశ్యప్ ని పేరు పెట్టలేం కానీ, కథనం పరంగా మాత్రం చాలా చోట్లు బోర్ కొట్టించినప్పుడల్లా విసుక్కుంటూ కర్శన్ ని మందుకు కదిపేస్తాం. అందుకు కారణం..సరిత క్యాషియర్ కాబట్టి ఆమె ఈ నోట్లను తన బ్యాంక్ లో మార్చే క్రమంలో ఏ అగచాట్లు పడుతుందో చూపెడతారని ఎక్సపెక్ట్ చేస్తాం. నిజానికి కథ వెళ్లాల్సింది కూడా ఆ రూటే. అయితే దర్శకుడు మాత్రం నోట్ల రద్దు నేపధ్యంలో అప్పట్లో దేశంలో జరిగిన విషయాలన్ని ఏకరవు పెట్టడం మొదలెట్టాడు. నోట్ల రద్దుతో జనం కష్టాలు,ఏటీఎం ల దగ్గర జనం చూపించుకుంటూ పోయాడు. అంతేకాని సరిత తన దగ్గర ఉన్న డబ్బుని ఎలా మార్చుకుంది అనే విషయమై కాన్సర్టేట్ చేయలేదు. ఎందుకంటే అప్పట్లో చాలా బ్యాంక్ లలో ఈ డబ్బు మార్పిడి..స్టాఫ్ అండతో కమీషన్స్ తీసుకుని జరిగినట్లు వార్తలు వచ్చాయి. అ కోణం టచ్ చేయాల్సింది. అలాగే బ్లాక్ మెయిల్ యాంగిల్ కూడా ఎందుకో సినిమాకి నిండుతనం ఇవ్వలేదు. అయితే ఈ సినిమాని డీల్ చేసిన విధానం బాగుంటుంది. రెగ్యులర్ సినిమాలా కాకుండా ఓ సెటైర్ థోరణిలో తెరకెక్కించాడు. వ్యవస్దపై సెటైర్స్ వేస్తూనే, కథనాన్ని థ్రిల్లింగ్ గా నడిపించే ప్రయత్నం చేసాడు. ఇక ఈ ప్రయత్నంలో దర్శకుడు కు బాగాగ కలిసి వచ్చింది సయామీ ఖేర్. అసలు ఆమెలో అంత టాలెంట్ ఉందా అనిపించుకునే రీతిలో నటించి పారేసింది. టెక్నికల్ గా కెమెరా వర్క్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ కు ప్రాణం పోసింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

చూడచ్చా

ట్రై చేయచ్చు…దర్శకుడు పేరు చూసి మాత్రం ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకూడదు.

తెర వెనక…ముందు

బ్యానర్: గుడ్ బ్యాడ్ ఫిలింస్
తారాగణం: సయామీ ఖేర్, రోషన్ మాథ్యూ, అమృతా సుభాష్, రాజ్‌శ్రీ దేశ్‌పాండే తదితరులు
సంగీతం: కర్ష్ కాలే
ఛాయాగ్రహణం: సిల్వస్టర్ ఫోన్సెకా
నిర్మాతలు: అనురాగ్ కశ్యప్, ధృవ్ జగాసియా, అక్షయ్ థక్కర్
రచన: నిహిత్ భావే
దర్శకత్వం: అనురాగ్ కశ్యప్
వేదిక: నెట్‌ఫ్లిక్స్ ఇండియా