నారా రోహిత్ ఇంటర్వ్యూ

Published On: November 21, 2017   |   Posted By:

నారా రోహిత్ ఇంటర్వ్యూ

ఈ వీకెండ్ బాలకృష్ణుడు సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు హీరో నారా రోహిత్. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రీట్ మెంట్ పరంగా చాలా కొత్తగా ఉందంటున్నాడు. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేశానని, అంతా చూసి ఎంజాయ్ చేయండని అంటున్నాడు నారా రోహిత్.
డబ్బు కోసం ఏదైనా..
సినిమాలో డబ్బుల కోసం ఏదైనా చేసే క్యారెక్టర్. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ కు భిన్నంగా ఉంటాయి. నా పాత్ర పేరు బాలు. సినిమాలో నేను చేసిన అల్లరి అంతా కృష్ణుడి టైపులో ఉంటుంది. అందుకే ఈ టైటిల్ కు బాలకృష్ణుడు అనే టైటిల్ పెట్టారు.
అంతా అల్లరిచిల్లరి…
ఇప్పటివరకు నేను చేసినవన్నీ జానర్ సినిమాలే. నా పాత్రలకు ఓ గోల్, డెస్టినేషన్ ఉండేది. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ అలా ఉండదు. అల్లరిచిల్లరగా ఉంటుంది. నేను చాలామంది కొత్తదర్శకులతో వర్క్ చేశాను. కాబట్టి ఈ సినిమా దర్శకుడు పవన్ మల్లెలతో వర్క్ చేయడానికి ఇబ్బంది పడలేదు.
నాకు కొత్త.. ప్రేక్షకులకు కాదు
ఈ కథపై పవన్ కు మంచి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నచ్చే సినిమా చేశాను. ఇదేదో కొత్త రకమైన కథ అని మాత్రం అనుకోవద్దు. ఫక్తు కమర్షియల్ సినిమా. సినిమా మొత్తం ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఈ కథ తెలుగు సినిమాకు కొత్త కాదు. తెలుగు ప్రేక్షకులకు అంతకంటే కాదు. నటుడిగా నాకు మాత్రం కొత్త.
ఇన్నాళ్లకు కుదిరింది
ఎప్పట్నుంచో ఓ కమర్షియల్ సినిమా చేద్దామని అనుకుంటున్నాను. ఇది నాకు కరెక్ట్ అని భావించాను. వినోదమే ఈ సినిమాలో ప్రధాన అంశం. ఏదోదో ఊహించుకోవద్దు. ఇది అందరికీ తెలిసిన కథే. ఇంతకుముందు ఎన్నో సినిమాలొచ్చాయి. కాకపోతే ట్రీట్ మెంట్ కాస్త కొత్తగా ఉంటుంది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది.
21 కిలోలు తగ్గాను
ఎప్పట్నుంచో తగ్గాలని అనుకుంటున్నాను. కానీ దురదృష్టవశాత్తూ తగ్గకుండా పెరగడం మొదలైంది. మొత్తానికి పవన్ మల్లెల బలవంతం చేయడంతో తగ్గడం స్టార్ట్ చేసాను. దాదాపు  5 నెలలు జిమ్ చేశాను. నేచురల్ గానే తగ్గాను. ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకున్నాను. జ్యో అచ్యుతానంద సినిమాతో పోలిస్తే 21 కిలోలు తగ్గాను.
కంప్లీట్ సిక్స్ ప్యాక్ కాదు
ఇది పక్కా కమర్షియల్ సినిమా. అందుకే కాస్త ఫిట్ గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో జిమ్ కు వెళ్లాను. సిక్స్ ప్యాక్ లాంటివేం అనుకోలేదు. కాస్త దిట్టగా కనిపిస్తే చాలనుకున్నాను. బాలకృష్ణుడు ఫస్ట్ లుక్ లో ఎలా కనిపించానో ఈ సినిమాలో అంతే చూపించాను. షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ లాంటివేం చూపించలేదు. ఎందుకంటే ఇంకా ఆ రేంజ్ బాడీ బిల్డప్ కాలేదు. ఇంకా చాలా చేయాలి.
నా సినిమాలు నేనే చూడలేదు
గతేడాది నా సినిమాలపై నేనే ఫోకస్ పెట్టలేకపోయాను. నా సినిమాల్ని నేనే చూడలేకపోయాను. ఈ ఏడాది మాత్రం కాస్త తగ్గించాను. అయినప్పటికీ చాలా సినిమాలు చేశాను. శమంతకమణి రిలీజ్ అయింది. బాలకృష్ణుడు రిలీజ్ కు రెడీ అయిపోయింది. వీరభోగవసంతరాయలు సినిమా దాదాపు షూటింగ్ పూర్తయింది. ఇదొక జానర్ సినిమా.
మణిశర్మ ఈజ్ ది బెస్ట్
బాలకృష్ణుడు సినిమాకు మణిశర్మ సంగీతం అదిరిపోయింది. కమర్షియల్ సినిమాకు ఆయన
మాస్టర్ లాంటివారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు. సినిమాలో మీరు ఆ కొత్తదనం ఫీల్ అవుతారు.
రెజీనా అదరగొట్టింది
సినిమాలో రెజీనా హీరోయిన్ గా చేసింది. ఏదో పాటల కోసం వచ్చి వెళ్లినట్టు ఉండదు. ఆమెకు మంచి రోల్ దక్కింది. సినిమా అంతా నాతో పాటు ఉంటుంది. నా ఇంట్రో సాంగ్ అయినతర్వాత రెజీనా ఎంటర్ అవుతుంది. అప్పట్నుంచి క్లయిమాక్స్ వరకు రెజీనా ఉంటుంది.
సినిమాల సంఖ్యపై మార్కెట్ ఆధారపడదు
నేను ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మార్కెట్ తగ్గతుందనడంలో నిజం లేదు. నాని కూడా ఎక్కువే చేస్తున్నాడు. కానీ మార్కెట్ పెంచుకున్నాడు. సినిమాల సంఖ్యతో మార్కెట్ కు సంబంధం లేదు. సినిమా ఆడితే మార్కెట్ పెరుగుతుంది. అదొక్కటే లెక్క. నా వరకు నాకు మార్కెట్ పెంచే సినిమా ఇంకా రాలేదు
అప్ కమింగ్ ప్రాజెక్టులు
పరుచూరి మురళి దర్శకత్వంలో ఆటగాళ్లు అనే సినిమా రెడీ అవుతోంది. నేను , జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నాం. ఇదొక థ్రిల్లర్. దీని తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో ఇప్పటివరకు నేను టచ్ చేయని హారర్ జానర్ లో ఓ సినిమా చేయబోతున్నాను. దీనికి భీముడు అనే టైటిల్ పెట్టాం. ఈ రెండు కాకుండా మరో కమర్షియల్ సినిమా కూడా ఉంది. చైతన్య దంతులూరితో కూడా ఓ సినిమా ఉంది. స్క్రిప్ట్ లాక్ అయింది. వచ్చే ఏడాది మిడ్ లో ఆ సినిమా ఉంటుంది.
సొంత బ్యానర్ లో సినిమాలు
సొంత ప్రొడక్షన్ కూడా ఉంది. ఆల్రెడీ శ్రీవిష్ణుతో ఓ సినిమా కంప్లీట్ చేశాను. నీది నాది ఒకే కథ అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాకు నేను నిర్మాత. డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ ఉంటుంది. ఈ సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ కూడా చేశాను.
ఏదైనా కొత్తగా ఉండాలి
స్క్రిప్ట్స్ విషయంలో కొత్తకొత్త జానర్లు ట్రై చేయడం నాకిష్టం. అందుకే నా సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అందులో భాగంగా ఫక్తు కమర్షియల్ సినిమా కూడా చేద్దామని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదిరింది. భవిష్యత్తులో కూడా అన్ని జానర్స్ తో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాను.
బాలకృష్ణుడుకు జగ్గూ భాయ్ వాయిస్
నా సినిమాలకు నేనే వాయిస్ ఓవర్ ఇస్తే బాగుండదు. అందుకే జగపతిబాబు గారితో చెప్పించాం. ఈమధ్య కాలంలో నేను మంచు మనోజ్, నాగశౌర్య సినిమాలకు వాయిస్ ఇచ్చాను. నా మూవీకి మాత్రం జగపతిబాబుతో చెప్పించాం. అది చాలా బాగా వచ్చింది.