నేల‌టిక్కెట్టు మూవీ రివ్యూ

Published On: May 25, 2018   |   Posted By:

నేల‌టిక్కెట్టు మూవీ రివ్యూ

సినిమా:  నేల‌టిక్కెట్టు
సంస్థ‌: ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
న‌టీన‌టులు: ర‌వితేజ‌, మాళ‌వికా శ‌ర్మ‌, శ‌ర‌త్‌బాబు, జ‌గ‌ప‌తిబాబు, సంప‌త్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, అలీ, ప్రియ‌ద‌ర్శి, పృథ్వీ, సుబ్బ‌రాజు, అజ‌య్ త‌దిత‌రులు
సంగీతం: శ‌క్తికాంత్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ముఖేష్‌.జి
ఎడిటింగ్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
నిర్మాత‌: ర‌జ‌నీ తాళ్లూరి
ద‌ర్శ‌క‌త్వం: క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల‌
డ్యూరేషన్ – 167 నిమిషాలు
సెన్సార్ – యు/ఎ
రిలీజ్ డేట్ – 18-05-2018

ఎదురయ్యే ప్ర‌తి వ్య‌క్తిలోనూ బంధాల‌ను, అనుబంధాల‌ను వెతుక్కోవాల‌నుకునే వ్య‌క్తి.. డ‌బ్బు, ప‌ద‌వి ముఖ్య‌మ‌నుకునే వ్య‌క్తికి జ‌రిగే పోరాట‌మే `నేల‌టిక్కెట్టు`. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన రెండు చిత్రాల‌ను ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ‌, మాస్ హీరో ర‌వితేజ‌తో తెర‌క‌తెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. మాస్ హీరో, క్లాస్ డైరెక్ట‌ర్ కల‌యిక‌లో వ‌చ్చిన నేల‌టిక్కెట్టుపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ అంచ‌నాల‌ను సినిమా అందుకుందా?  లేదా ? అని చూద్దాం…

క‌థ‌:

చిన్నా చిత‌కా నేరాల‌కు కోర్టులోత‌ప్పుడు సాక్ష్యం చేసుకుని బ‌తుకుతుంటాడు ర‌వితేజ‌. అనాథ‌గా పెరిగినా చుట్టూ జ‌నం త‌న‌వాళ్ల‌నుకునే త‌త్వం. చుట్టూ ఉన్న వారు ఇబ్బందుల్లో ఉంటే చూసి త‌ట్టుకోలేడు. అలాంటిది అత‌ను `తాను` అనుకున్న వారికి ఓ ఇబ్బంది వ‌స్తుంది. దానికి కార‌ణం హోమ్ మినిస్ట‌ర్ అజ‌య్ భూప‌తి (జ‌గ‌ప‌తిబాబు) అని తెలుసుకుంటాడు. అత‌ని అంతు చూసే క్ర‌మంలో అత‌నికి మాళ‌విక (మాళ‌విక‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు గౌత‌మి (కౌముది)ని అజ‌య్ భూప‌తి నుంచి ర‌క్షించుకుంటాడు. ఇంత‌కీ గౌత‌మి ఎవ‌రు? అజ‌య్ భూప‌తి మీద నిజంగా ర‌వితేజ‌కు ఉన్న కోపం ఏంటి?  చివ‌రికి అజ‌య్ భూప‌తిని మ‌ట్టుబెట్టాడా?  వ‌దిలేశాడా?  వంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్స్

– ర‌వితేజ లుక్స్, న‌ట‌న‌
– జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌
– కెమెరా ప‌నిత‌నం
– నాలుగైదు డైలాగులు

మైన‌స్ పాయింట్స్

–  ఏమాత్రం ప్రాధాన్య‌త లేని పాత్ర‌ల్లో ప్ర‌ముఖుల చేత న‌టింప‌జేయ‌డం
– ఎడిటింగ్ బాగోలేదు
– అన‌వ‌స‌ర‌మైన చోట్ల‌లోనూ స్క్రీన్ నిండా జ‌నాల‌ను చూపించ‌డం
– మాస్ ని ఆక‌ట్టుకునే అంశాలు లేవు
– పాట‌లు, నేప‌థ్య సంగీతం ఎఫెక్టివ్‌గా లేవు

విశ్లేష‌ణ‌:

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ర‌వితేజ ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఎప్ప‌టిలాగానే త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. డైలాగ్ డెలివ‌రీ, బాడీ లాంగ్వేజ్‌లో ఎక్క‌డా స్పీడ్ త‌గ్గ‌లేదు. హీరోయిన్ మాళ‌వికాశ‌ర్మ తొలి చిత్ర‌మిది. గ్లామ‌ర్ పార్ట్‌కే ప‌రిమితం అయ్యింది. పాట‌ల్లో మెరిసింది. ఇక ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తి సన్నివేశం ఫ్రెష్ లుక్‌తో క‌న‌ప‌డుతుంది. శ‌క్తికాంత్ అందించిన సంగీతం బాలేదు. ట్యూన్స్ ఆక‌ట్టుకునేలా లేవు. ఇక నేప‌థ్య సంగీతం విష‌యానికి వ‌స్తే స‌రేస‌రి.. సినిమాలో శ‌ర‌త్ బాబు, విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు, హీరో స్నేహితులుగా అలీ, పృథ్వీ, బ్ర‌హ్మానందం, ప్ర‌భాస్ శ్రీను, సంప‌త్‌రాజ్‌, సురేఖావాణి, శివాజీ రాజా, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, సుబ్బ‌రాజు ఇలా   బారీ క్యాస్టింగ్ క‌న‌ప‌డుతుంది.కానీ సినిమా అంతా హీరో, హీరోయిన్‌, విల‌న్ క్యారెక్ట‌ర్స్ చుట్టూ తిర‌గ‌డంతో మిగిలిన పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. బ్ర‌హ్మానందం వంటి సీనియ‌ర్ క‌మెడియ‌న్‌కు సింగిల్ డైలాగ్ లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ క‌థ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ స్టోరీనే ఎంచుకున్నాడు.పోనీ క‌థ‌న‌మేమైనా ఆస‌క్తిక‌రంగా ఉందా? అంటే అది కూడా లేదు. సినిమాలో కొన్ని ఎమోష‌న్స్‌ను క‌నెక్ట్ చేయించాల‌నుకున్నాడు కానీ.. ఏ ఎమోష‌న్స్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కాదు. విల‌నిజం కూడా చివ‌ర్లో కామెడీ అయిపోతుంది. ఓ అర్డిన‌రీ మేన్ హోం మినిష్ట‌ర్ ఇంటికి కాఫీ తాగిన‌ట్టు వెళ్లి వ‌చ్చేస్తుంటాడు. అయ‌న్ను బెదిరించ‌స్తుంటాడు. ఓ స‌న్నివేశంలో అయితే ఎమ్మెల్యేల‌ను మార్కెట్‌లో కొన్న‌ట్టు కొనే విధానం చూపించారు. ఇది ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసే స‌న్నివేశంలా అనిపిస్తుంది. హీరో మెడిక‌ల్ కాలేజ్ డీన్‌ను బెదిరించేసి డాక్ల‌రులా తిర‌గ‌డం.. హీరోయిన్ వెంట‌ప‌డ‌టం.. దాని వెనుక కార‌ణాలు రివీల్ చేయ‌డం ఇవ‌న్నీ చూసే ప్రేక్ష‌కుడికి అతిశ‌యోక్తిగా అనిపిస్తుంది. సినిమా అంటే అతిశ‌యోక్తే కాద‌నం… కానీ అది కూడా ప్రేక్ష‌కుడు న‌మ్మేలా.. అతికేలా ఉండాలి. వాస్త‌వానికి దూరంగా ఉండకూడదు. ఆ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అండ్ టీమ్ మ‌ర‌చిపోయింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

బోట‌మ్ లైన్‌:

నేల‌టిక్కెట్టు రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌

రేటింగ్‌:2.50/5