పరుగెట్టాల్సిందే : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

Published On: June 1, 2020   |   Posted By:

Rating : 1/5

అల్లు అరవింద్ ఆహా యాప్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధాన పోటీ దారులైన అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ అదిరిపోయే కంటెంట్ తో వేర్వేరు భాషా చిత్రాలను అందిస్తూ దూసుకుపోతూంటే…ఆహా మాత్రం నేను తెలుగుకే కట్టుబడి ఉంటా అని ప్రమాణం చేసి మరీ ప్రయాణం చేస్తోంది. తెలుగుకే అంకితం అవటం అనే ఎక్సక్లూజివ్ విషయం వినటానికి బాగానే ఉంది. కానీ క్వాలిటీ కూడా అదే స్దాయిలో ఉంటే ఏ సమస్యా రాదు. కొత్త పోరడు వెబ్ సీరిస్ తో కాస్తంత పేరు తెచ్చుకున్న ఆహా..రన్ అనే ఓటీటి సినిమాతో మన ముందుకు వచ్చింది. నవదీప్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఎంతవరకూ అలరించింది. ఆహా కు కొత్త సబ్ స్కైబర్స్ ని తెచ్చిపెడుతుందా, కథ ఏంటి..అవుట్ డేట్ అయ్యిపోయిన నవదీప్ తో చేసేటంత ధైర్యం ఉన్న కంటెంటేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్…

ఇదో క్రైమ్ థ్రిల్లర్ తరహా కథ. ప్రారంభంలో శ్రుతి (పూజిత పొన్నాడ),సందీప్ రెడ్డి (నవదీప్) ప్రేమించుకుని పెళ్లిచేసుకున్న లవ్ బుల్ కపుల్ అని ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ రోజు వీరి వెడ్డింగ్ యానవర్శరీ. సందీప్ వర్క్ బిజీలో పడి ఈ విషయం మర్చిపోతాడు. ఈ లోగా శృతి నుంచి ఫోన్ వస్తుంది లంచ్ కు ఫలానా హోటల్ కు వెళ్దామని. దాంతో హడావిడిగా బయిలుదేరి,హోటల్ కు వెళ్లిన అతనికి ఎంతసేపున్నా ఆమె రాదు. ఈ లోగా అతనికి ఫోన్ వస్తుంది. ఇంటికి అర్జెంట్ గా రమ్మని. వెళ్లిన అతనికి అక్కడ ఓ దారుణ దృశ్యం కనపడుతుంది. అతని భార్య శృతి రక్తపు మడుగులో ఉంటుంది. అప్పటికే పోలీస్ లు వచ్చేసి ఎంక్వైరీ మొదలెట్టేసారు. మరి కాసేపట్లోనే సందీప్ ని …ప్రధాన నిందితుడుగా పోలీస్ లు అనుమానించటం మొదలెడతారు. తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తాడు. కాని అతని వల్ల కాదు. పోలీస్ లు అరెస్ట్ చేయబోతే తప్పించుకుని రోడ్డు మీదకు వస్తాడు. ఈ లోగా అతని ప్రెండ్ ఖలీల్ (అమిత్ తివారి) వచ్చి అతనికి బైక్ మీద లిప్ట్ ఇచ్చి పోలీస్ ల నుంచి సేవ్ చేస్తాడు. ఈ లోగా రెడ్ శారీ కట్టుకుని రెడ్ కారులో ఓ అమ్మాయి (భానుశ్రీ) వస్తుంది. ఖలీల్ మంచి వాడు కాదు ..నాతోరా అని పిలుస్తుంది. అసలే పోలీస్ లు వెంబడిస్తూంటే..వీళ్ల సతాయింపులు. ఏం చెయ్యాలో అర్దం కాదు. ఈ లోగా మరికొన్ని పాత్రలు వచ్చి పడతాయి. అసలు వీళ్లంతా ఎవరు…సందీప్ జీవితంలోకు ఎందుకు వస్తున్నారు…అసలు సందీప్ భార్యను ఎవరు హత్య చేసారు…అనే విషయాలు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లో తెలుస్తాయి. అదేంటో తెలియాలంటే సినిమా చూసే ధైర్యం చెయ్యాల్సిందే.

ఎలా ఉందంటే..

థియోటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ ఎలాగూ లేవు. ఓటీటి లో అయినా చూద్దామని ఫిక్సైన ప్రేక్షకుడుకి ఈ కొత్త సినిమాలు కొత్త కొత్త ఎక్సపీరియన్స్ ఇస్తున్నాయి. ఓటీటి అంటే బాగాలేని ఓ కథతో నాశిరకమైన వ్యూల్యాస్ తో రూపొందాలని రూల్ పెట్టుకున్నట్లుగా ఉంటున్నాయి. మొన్నా మధ్య ఓటీటిలో రిలీజైన తొలి తెలుగు సినిమా అమృతారామ్, ఇదిగో ఇప్పుడు రిలీజైన ఈ రన్ సినిమాదీ అదే పరిస్దితి. ఎక్కడో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ పెట్టుకుని దాని వైపుగా కథ నడుపుదామనే ప్రయత్నంలో ఫస్టాఫ్,సెకండాఫ్ లో మొత్తం సీన్స్ అన్నీ అర్దం పర్దం లేకుండా సాగతీసారు. అలాగే తెరపై వచ్చే పాత్రలకు తలా తోకా ఉండదు. ఏ పాత్రకు సరైన ధృక్కోణము ఉండదు. వాటికు అప్పచెప్పిన డైలాగులు అప్పచెప్పి వెళ్లిపోతూంటాయి. ప్రెండ్ గా కనపడే ఖలీల్ ..మన తెలుగు కమర్షియల్ సినిమాల్లో రెగ్యులర్ గా కనపడే విలన్ గా అనిపిస్తాడు. అలాగే భానుశ్రీ పాత్ర ..చాలా కృత్రిమంగా ఉంటుంది.

మరో ప్రక్క ఎనకౌంటర్ చేసి పారేస్తా అని మాట్లాడితే వార్నించే ఇచ్చే పోలీస్ …వింతగా ఉంటాడు. వీళ్లందరు హీరో పాత్రనే కాదు మనని విసిగిస్తూంటారు..కన్ఫూజ్ చేస్తూంటారు. అలాగే హీరో పాత్ర తనతో మనని ఫాలో కానివ్వదు.ఎమోషనల్ కనెక్టివిటీ ఇవ్వడు. నిజానికి ప్రధాన పాత్రతో మనం జర్నీ చేయగలిగితేనే ఐడింటిఫై అవుతూంటాము. అలాంటి అవకాసం ఇవ్వడు దర్శకుడు. ఇక కథ ని ఓ హత్య చుట్టూ తిప్పాలనుకున్నప్పుడు చచ్చిపోయిన పాత్ర మీద సింపతి అయినా కలగాలి లేదా చంపిన వాడి మీద కోపం కలగాలి. అదీ ఇదీ కాకుండా ఇంకా గోప్పగా కధ చెప్పాలనుకుంటే చంపిన వాడి మీద సానుభూతి కలిగేలా చెయ్యాలి. ఈ మినిమం బేసిక్ సెన్స్ లేకుండా తీసిన సినిమా ఇది.

టెక్నికల్ గా

సినిమా చూస్తూంటే పాపం నవదీప్ అనిపిస్తుంది. నవదీప్ మంచి నటుడే కానీ అతని కోసం సినిమాని భరించేటంత సీన్ లేదు జనాలకి. సినిమా మొత్తాన్ని తన భుజంపై వేసుకుని మోసాడు కానీ కలిసిరాలేదు. చాలాకాలంగా హిట్ కు దూరంగా ఉన్న నవదీప్ కు ఇదీ కలిసిరాని ప్రయత్నమే. ఇక ఈ సినిమాకు ఫీచర్ ఫిల్మ్ అనిపించుకోదగ్గ ఫిటెనెస్ లేదు. ఓటీటి సినిమాలు ఇలా నాశిరకంగా ఉంటే మనుగడ కష్టం. ఈ టైమ్ లోనే మంచి కంటెంట్, టెక్నికల్ వాల్యూస్ లేకపోతే ఓటీటిలను భాషా భేధం లేకుండా దూరం పెట్టేస్తారు. రన్ సినిమాని ఓటీటికే కదా అని చాలా నిర్లక్ష్యంగా చుట్టేసారని అర్దమవుతుంది. Six (TV Series 2018– ) కాపి కొట్టి చేసినట్లున్న ఈ సినిమా కాన్సెప్టుగా బాగున్నా..కథనంగా ఇంకా బాగుండాల్సింది. డైలాగులు కూడా ఏదో నామ్ కే వాస్తే ఉన్నాయి. నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి.

చూడచ్చా

ఈ ప్రశ్న అడగకపోవటమే బెస్ట్..ఎందుకంటే ఇంత చదివాక చూడాలని ఫిక్సైతే మిమ్మల్ని ఎవరు ఆపగలరు.

తెర వెనక..ముందు

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు.
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి
దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా
రన్ టైం: 86 నిముషాలు
విడుదల తేదీ: మే 29, 2020
ఓటీటీ ప్లాట్ ఫాం: ఆహా