‘సీత’ సినిమా రివ్యూ

Published On: May 24, 2019   |   Posted By:


పాత కథ(‘సీత’  రివ్యూ)

రేటింగ్  :  2/5

వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న బెల్లంకొండ శీనుకి అత్యవసరంగా హిట్ అవసరం. నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టినా పెద్దగా కలిసి రాని దర్శకుడు తేజది సైతం అదే పరిస్దితి. ఓ సాలిడ్ హిట్ కావాలి. వీళ్లకు దాదాపు ఫేడవుట్ స్టేజిలో ఉన్న కాజల్ కలిసింది. వీళ్ల ముగ్గరూ కలిసి ప్రయాణం మొదలెట్టారు. సీతను మన ముందు పెట్టారు. అయితే ఈ సీతలో ఉన్న స్పెషాలిటి ఏమిటి? బెల్లంకొండకు హిట్, తేజకు గత వైభవం తెచ్చిపెడుతుందా? సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

మనీ మైండెడ్ అమ్మాయి  సీతామహాలక్ష్మీ(కాజల్).  ఆమెకో సమస్య వస్తుంది. దాని నుంచి తప్పించుకోవటానికి మరో పెద్ద సమస్యలో పడుతుంది. బసవరాజు అనే ఓ రౌడీ ఎమ్మల్యే (సోనూసూద్) తో ఓ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుంది.  అయితే ఆ కాంట్రాక్ట్ రానురాను పెద్ద తలనొప్పిగా మారుతుంది. దాని నుంచి తప్పించుకోవటానికి రామ్ (బెల్లంకొండ శీను)ని సీన్ లోకి తెస్తుంది. రామ్ వచ్చాక ఆమెకు అసలు జీవితం అంటే ఏంటో అర్దమవుతుంది. అలాగని అతను జీవిత పాఠాలు చెప్పే లెక్చరర్ కాదు. సీతలా లోకజ్ఞానం, లౌక్యం ఉన్నవాడు కాదు. కానీ అతని మంచితనం, మానవత్వం ఆమెలో మార్పులు తెస్తాయి. మారిన సీతను బసవరాజు వదిలేసాడా? అసలు రామ్ ఎవరు? బసవరాజుతో ఆమె చేసుకున్న కాంట్రాక్ట్ ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే...

డబ్బు పొగరు దండిగా ఉన్న అమ్మాయి, వాటిని అణిచేసే హీరో కథలు అప్పట్లో వచ్చేవి. అయితే ఇప్పుడు ఎవరో వచ్చి వాటిని అణిచేసి, ఆమెలో మార్పు తీసుకురావటం ఏమిటి. ఆమెలో తనంతట తానే మార్పు తెచ్చుకోగలదు అని చెప్పే కథాంశాలు వస్తున్నాయి. అలాంటి కథే ఇది. అయితే ఈ కథ పూర్తిగా క్యారక్టర్ డ్రైవన్ ప్లాట్. హీరో అమాయకత్వం, నిష్కల్మషత్వం, లౌక్యం లేకపోవటం వంటి లక్షణాలు మొహంలో ప్రతిపలించగలిగాలి. అవి పండితేనే సినిమా నడుస్తుంది. కానీ అవి పండించటం బెల్లంకొండ శీనివాస్ శక్తికి మించిన పని అయ్యిపోయింది. ముఖ్యంగా కొన్ని కీలకమైన సన్నివేశాల్లో అందుకు తగ్గ ఎక్సప్రెషన్స్ ఇవ్వటంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. యాక్షన్, డాన్స్ లు బాగా చేసి ఉండవచ్చు కానీ అసలైన చోట చేతులు ఎత్తేసాడు. కాజల్ తనదైన శైలిలో అనుభవంతో నటించుకుంటూ పోయింది. గర్వం, పొగరు తన నటనలో చూపించింది. కానీ ఎందుకనో ముదురు అన్న అనే ఫీలింగ్ వచ్చేసింది. హీరో కన్నా పెద్ద దానిలా అనిపించింది. ఇక అంతకాదు..ఇంత అంటూ ఓ రేంజిలో ప్రచారం చేసిన  పాయిల్ రాజపుత్  ఐటం సాంగ్ పూర్తిగా నిరాశపరుస్తుంది.  సోనూ సూద్ ది పరమ రొటీన్ క్యారక్టర్. బిత్తిరి సత్తి కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయ్యింది.  

డైరక్షన్ , మిగతా విభాగాలు

సినిమా చూస్తూంటే ఎప్పుడో చాలా కాలం క్రితం పూర్తైన సినిమా ఇప్పుడు రిలీజ్ చేసారనిపిస్తుంది. సినిమాలో ఫ్రెషనెస్ లోపించింది. అందుకు కారణం ఓవర్ డ్రామాగా అనిపించే కథ, దాన్ని తేజ పాత స్టైల్ లోనే డీల్ చేసిన విధానం కావచ్చు. తేజకు నటీనటుల నుంచి మంచి ఫెరఫార్మెన్స్ తీసుకుంటాడనే పేరు ఉంది. ఆ మ్యాజిక్ ఈ సినిమాలో మిస్సైంది. స్క్రీన్ ప్లే సైతం పరమ బోర్ గా సాగింది. ఎక్కడా ఇంట్రస్ట్ అనేది లేదు. ట్విస్ట్ లు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.

దానికి తోడు ఈ సినిమాని  1988 లో వచ్చిన రెయిన్ మ్యాన్ సినిమా (డస్టిన్ హాఫ్ మెన్, టామ్ క్రూస్) కు తెలుగు ఫ్రీమేక్ లా రెడీ చేసారు. అందులో టామ్ క్రూస్ పాత్రను హీరోయిన్ గా చేసారు. అందుకోసం చేసిన మార్పులు ఏవీ పెద్ద ఇంప్రసివ్ గా లేవు.  

పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ సినిమాకు ప్లస్ కాలేదు. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటర్ మీద మనకు కోపం వస్తుంది. 

చూడచ్చా

ప్రతీ వీకెండ్ కు ఓ సినిమా చూడాలనే నియమం పెట్టుకున్న వాళ్లు ఇదొక ఆప్షన్ గా పరిగణించాలి.