ప్రతిరోజు పండగే మూవీ రివ్యూ

Published On: December 20, 2019   |   Posted By:

ప్రతిరోజు పండగే మూవీ రివ్యూ

తాతగారి ‘బకెట్ లిస్ట్'( ‘ప్రతిరోజు పండగే’ రివ్యూ)
 
Rating: 3/5

విలేజ్ ఎట్మాస్మియర్, కుటుంబం,విలువలు,అనుబంధాలు, ఆప్యాయతలు ఇవన్నీ తెరపై అయినా చూసి ఆనందిద్దామనుకునేవాళ్లకు ఆ అవకాసం ఇప్పటి సినిమాలు ఇవ్వటం లేదు. అప్పుడప్పుడూ శతమానం భవతి, అత్తారింటికి దారేది వంటి సినిమాలు వచ్చి ఆ దాహాన్ని తీరుస్తున్నాయి. ఫ్యామిలీ సినిమా అనగానే పాతకాలం వ్యవహారం అయ్యిపోతుందని చాలా మందికు భయం. అయితే దర్శకుడు మారుతి…ఏ సినిమాని ఎలా డీల్ చెయ్యాలో…ఏ సీజన్ ని ఏ సినిమాతో పట్టుకోవాలో, ఏ హీరో ని ఏ కథతో ఆకట్టుకోవాలో తెలిసినవాడు. ముఖ్యంగా ఎలాంటి కథ అయినా కామెడీతో డీసెంట్ గా డీల్ చేసే సత్తా ఉన్నవాడు. ఆయన తాజా చిత్రం లో కూడా ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా..కాన్సర్ కథ అంటూ ముందే చెప్పేసిన ఈ సినిమాలో ఇంక చెప్పుకోవటానికి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీలు పరుగెత్తుకు వెళ్లి చూసే సినిమాయేనా, అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో మాట్లాడుకుందాం.

స్టోరీ లైన్
 
రాజమండ్రి లో ఒంటరి జీవితం గడుపుతున్న రఘురామయ్య (సత్యరాజ్) కు ఓ రోజు ఉన్నట్టుండి తనకు ఊపిరితిత్తుల కాన్సర్ అనే విషయం తెలుస్తుంది. మరో ఐదు వారాలు మించి బ్రతకనని డాక్టర్లు చెప్పటంతో… ఈ విషయాన్ని అమెరికా,ఆస్ట్రేలియాలో సెటిలై ఉన్న తన పిల్లలకు ఇంటిమేట్ చేస్తాడు..వాళ్లంతా తన ఇంటికి వచ్చి తనతో గడిపితే బాగుండును అని ఎక్సెపెక్ట్ చేస్తాడు.  అయితే క‌రెన్సీ క‌ట్ట‌లతో నిలబడే కార్పొరెట్ ప్రపంచంలో బ్రతుకుతున్న ఆయన పిల్లలంతా రకరకాల కారణాలతో తప్పించుకోవటానికి చూస్తాడు. కానీ మనవడు సాయి తేజ మాత్రం ఈ వార్త విని వెంటనే రెక్కలు కట్టుకుని తమ తాత దగ్గర వాలిపోతాడు.

అంతేకాదు బ్రతికి ఉన్న కొద్ది రోజులు తన తాతను సంతోషంగా ఉంచటానికి ట్రై చేస్తాడు. ఈ లోగా తాత కోరికపై టిక్ టాక్ సెలబ్రెటీ ఏంజిల్ ఆర్నా తో ప్రేమలో పడతాడు. కానీ ఈ లోగా సాయి తండ్రి రావు రమేష్ …వేరే సంభందం సెట్ చేస్తాడు. అదో సమస్యగా మారుతుంది. దాన్ని సాల్వ్ చేసుకుంటూ ,తాతకు సాయిం చేస్తూ… ఎమోషన్స్ వదిలేసుకున్న తమ కుటుంబానికి ఓ పాఠం నేర్పుతాడు. అదెలా… ఏమిటి,సాయి లవ్ స్టోరీ ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే..

రీసెంట్ గా హాలీవుడ్ లో ‘ఫేర్ వెల్’ అనే సినిమా వచ్చింది. తన నాయనమ్మకు కాన్సర్ అంటే అమెరికాలో ఉన్న మనవరాలు బయిలు దేరి వెల్తుంది. అయితే అక్కడ కాంప్లిక్ట్ ఏమిటి అంటే…ఆ నాయనమ్మకు తనకు కాన్సర్ అనే విషయం తెలియదు. కుటుంబం కూడా చెప్పాలనుకోదు. ఉన్న నాలుగు రోజులు ఆమెను ఆనందంగా ఉంచాలనుకుంటారు. అందులోంచి పుట్టే కామెడీ,ట్రాజడీ ఆ సినిమా ప్రాణం. ఈ సినిమా స్టోరీ రివర్స్ లో జరుగుతుంది.

తాతగారే తనకు కాన్సర్ అని రివీల్ చేస్తాడు. మనవడు వచ్చి తన తాతగారి కోరికలు చిట్టా కనుక్కుని వాటిని తీర్చే పనిలో పడతాడు. ఇక్కడ పెద్దగా డ్రామాకు అవకాసం లేదు. అయితే దర్శకుడు ఫన్ ని ఆ సమస్యను దాటటానికి ఎంచుకున్నాడు కాబట్టి ఇబ్బంది పెద్దగా రాలేదు. అప్పటికీ ఫస్టాఫ్ ..ఫన్ తో ఫస్ట్ గా పాసై పోయింది. కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ ప్లో మిస్సై పోయింది. రిపీట్ సీన్స్…ఎక్కడ కథ అక్కడే ఉండి..ఎలాంటి మలుపులు లేకుండా ఒకే పాయింట్ చుట్టూ కథనం తిరుగుతుంది. స్టోరీ లైన్ లోనే సమస్య సరిగ్గా ఎగ్జిక్యూట్ కాకపోవటంతో సీన్స్ అలాగే ఉంటాయి. అయితే మారుతి చేయితిరిగిన రైటర్ కావటంతో ఆ సమస్యను ఈజీగా కప్ప దాటులా దాటేయగలిగాడు కానీ సమర్దవంతంగా సరైన సీన్స్ తో స్క్రీన్ ప్లే తో దాటలేకపోయాడు.
 
ఎవరెలా చేసారంటే..

సీనియర్ నటులు రావు రమేష్, సత్యరాజ్ తన ప్రతిభతో చాలా బాగం లాక్కొచ్చారు. ముఖ్యంగా రావు రమేష్ చక్కటి టైమింగ్ తో కూడిన కామెడీ …బాగా ప్లస్ అయ్యింది. ఇక సాయి తేజ చేయటానికి పెద్దేమీ లేదు. అలా కథతో పాటు ప్రయాణించటమే..ఓ పాత్రలాగ. రాశి ఖన్నా ది అదే పరిస్దితి…స్క్రీన్ పై గ్లామర్ గా కనపడటం , అవకాసం ఉంటే నవ్వించటమే డ్యూటీ.

రైటింగ్, డైరక్షన్,మిగతా డిపార్టమెంట్ లు

ఇక సినిమా రైటింగ్ సైడ్ పూర్ గా ఉందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సెకండాఫ్ వర్కవుట్ కాలేదు.అలాగే సందేశాలు,స్పీచులు పోటు ఎక్కువైంది. ఆ విషయంలో మారుతి మరింత శ్రద్ద పెట్టి ఉంటే వేరే విధంగా ఉండేది. కథలో కాంప్లిక్ట్ పాయింట్ ని ఐడింటిఫై చేసి, దాన్ని పట్టుకుని డ్రామా క్రియేట్ చేయలేకపోయారు. ఎక్కడికిక్కడ ఫన్ కోసం ట్రే చేస్తూ వెళ్లిపోయారు. దాంతో ఎక్కడా హార్ట్ టచింగ్ మూవ్ మెంట్స్ అనేవి లేకుండా పోయాయి. అలాగే సాయి తన తండ్రి, పిన తండ్రి, అత్తయ్యకు బుద్ది చెప్పే ఎపిసోడ్ కూడా అంతంత మాత్రమే. డైరక్టర్ గా మారుతి…ఎప్పటిలాగే డీసెంట్ గా చేసాడు.
   
సాంకేతికంగా

ఇలాంటి సినిమాలకు ప్లస్ అవ్వాల్సిన విభాగాలు కెమెరా, ఎడిటింగ్, సంగీతం బాగా కలిసొచ్చాయి. తకిట తకిట పాట కు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ బావ పాట, ప్రతీరోజు పండగే పాటలు కూడా బాగున్నాయి. జయకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాని విజువల్ ఫీస్ట్ గా మార్చేసింది.  
 
చూడచ్చా

ఖచ్చితంగా ..కాకపోతే పెద్దగా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుండా అయితే నచ్చుతుంది.

తెర ముందు…వెనక

బ్యాన‌ర్‌:  జీఏ2-యువీ క్రియేష‌న్స్
నటీనటులు: విజయకుమార్, రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్‌రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ తదితరులు
సినిమాటోగ్రఫీ: జైకుమార్ వసంత్,
సంగీతం: తమన్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు,
సహనిర్మాత: ఎస్.కె.ఎన్,
నిర్మాత‌లు: బ‌న్నివాసు-ప్ర‌మోద్-వంశీ
 రచన-దర్శకత్వం: మారుతి దాసరి.
విడుదల తేదీ: 20.12.2018.