బాల‌కృష్ణ‌తో తేజ‌

Published On: September 18, 2017   |   Posted By:
బాల‌కృష్ణ‌తో తేజ‌
చిత్రం, నువ్వునేను, జ‌యం వంటి విజ‌య‌వంతమైన చిత్రాల‌తో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు తేజ‌. అయితే ఆ త‌రువాత వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. మ‌ళ్లీ 15 ఏళ్ల త‌రువాత ఓ హిట్ కొట్టాడు. ఆ సినిమానే నేనే రాజు నేనే మంత్రి. ఈ చిత్ర విజ‌యం తేజ‌లో కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పుడు తేజ‌తో సినిమా చేసేందుకు స్టార్స్ కూడా ఆస‌క్తి చూపిస్తున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జీవిత క‌థ‌తో ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. రామ్ గోపాల్ వ‌ర్మ వంటి ద‌ర్శ‌కుల పేర్లు ఆ సినిమా విష‌యంలో వినిపించినా.. ఏది క‌న్‌ఫ‌ర్మ్ కాలేదు. అయితే.. తాజాగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి తేజ అయితే బావుంటుంద‌నే సూచ‌న‌ బాల‌య్య వైపు నుంచి వ‌చ్చింద‌ని వినిపిస్తోంది.
నేనే రాజు నేనే మంత్రి కూడా రాజ‌కీయాల నేప‌థ్యంలో ఉండ‌డం.. ఆ సినిమాని తేజ బాగా తీసి ఉండ‌డం వంటి కార‌ణాల‌తో తేజ వైపే బాల‌కృష్ణ దృష్టి ఉంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ముచ్చ‌టించుకున్నారు. మ‌రి తేజ‌తోనే బాల‌య్య ఆ సినిమా చేస్తాడో లేదంటే మ‌రెవ‌రితోనైనా చేస్తాడో తెలియాల్సి ఉంది.