బుర్ర‌క‌థ‌ మూవీ రివ్యూ

Published On: July 8, 2019   |   Posted By:

బుర్ర‌క‌థ‌ మూవీ రివ్యూ

బుర్ర లేని కథ (‘బుర్ర‌క‌థ‌’ మూవీ రివ్యూ )
 
Rating:2

ఉన్న ఒక్క మొదడు, దాని ఆలోచనలతోనే మనుష్యులు సతమతమైపోతున్నారు. అలాంటిది రెండు మెదడులు ఒకే మనిషికి ఉంటే వాడి పరిస్దితి ఏమిటి…వింటానికి ఇంట్రస్ట్ గా ఉన్న ఈ పాయింట్ తోనే రైటర్ డైమండ్ రత్నబాబు డైరక్షన్ కు దిగాడు. మరి సినిమా కూడా అంతే ఇంట్రస్ట్ గా తీర్చిదిద్దాడా…లేకపోతే పాయింట్ గొప్ప ..సినిమా దిబ్బ అన్నట్లుగా మార్చేసాడా..అసలు ఈ చిత్రం కథేంటి…వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు  రివ్యూలో చూద్దాం.

స్టోరీ  లైన్


అనగనగా ఓ అభిరామ్‌(ఆది సాయికుమార్‌)..అతను మనలాంటోడు కాదని, రెండు మెదళ్లతో పుట్టాడని చిన్నప్పుడే డాక్టర్లు కన్ఫర్మ్ చేసేసారు. పుడితే పుట్టాడిలే ఆ బుర్రకే నష్టం లేనప్పుడు మనకేంటి అని సరిపెట్టుకుందామనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఈ రెండు మైండ్ లూ రెండు రకాలుగా ఆలోచిస్తూంటాయి. ఒక మైండ్ ఏమో పక్కా మాస్‌, ఇంకొక మైండ్ ఏమో పక్కా క్లాస్‌. ఒక మైండ్ కి అల్లరి ఎక్కువ, రెండో దానికి భక్తి ఎక్కువ. ఒక  మైండ్ సన్యాసం తీసుకోవాలి అనుకుంటే మరో మైండ్ ప్రేమలో మునిగి తేలాలి అని మారాం చేస్తూంటుంది. ఇద్ద‌రిలో ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. ఒక‌రు చేసిన ప‌ని మ‌రొక‌రికి గుర్తుండ‌దు. ఇలా విరుద్ద భావాలతో చెలరేగిపోయే ఈ  మైండ్ లు  రెండూ ఒకటయ్యి..ఒకే రకంగా ఆలోచించి ఎప్పటికైనా అభిరామ్ కు మనశ్సాంతి కలిగిస్తాయా.. ఈ క్రమంలో కలిసిన   హ్యాపీ (మిస్త్రీ చక్రవర్తి) అనే అమ్మాయి పరిస్దితి ఏమిటి..అలాగే….గగన్‌ విహారి(అభిమన్యు సింగ్‌) అనే విలన్ ఏమౌతాడు. చివరకు ఏం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పూర్ స్క్రిప్ట్, కమ్మేసిన కామెడీ ట్రాక్ లు

సినిమా బుర్రకు పని చెప్పేలా లేదు కానీ బుర్రని వేడెక్కించేలా ఉంది. బుర్రలో పుట్టిన ఓ ఆలోచనను, విస్తరించకుండా తెరకెక్కించాడని అర్దమయ్యేలా ఉంది. స్టోరీలైన్ లో నావల్టీ చూపెట్టిన ఈ సినిమా ట్రీట్మెంట్ వెర్షన్ దగ్గరకు వచ్చేసరికి రొటీన్ సినిమా స్క్రీన్ ప్లే లోకే వెళ్లిపోయారు. ఏదో డ్యూయిల్ రోల్ లో ఉండే పాత కవల పిల్లల సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. నాగ్ .. హలో బ్రదర్ కు మరో వెర్షన్ వేసారా అని అనుమానం వస్తుంది.

అలాగే కమర్షియాలిటి కోసం కామెడీ ట్రాకులు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. దాంతో కథ చిన్నదై కామెడీ ట్రాకులు పెద్దవే విసిగిస్తాయి. దానికి తోడు ఏ మైండ్ ఎప్పుడు పనిచేస్తోందో అర్దం కాని కన్ఫూజన్. పృథ్వీ ఎపిసోడ్‌ పెద్దగా పండలేదు. అలాగే హీరో లవ్ ట్రాక్ సైతం చాలా పూర్ గా ఉంది.  విలన్ అయితే కథలో ఉండాలి కాబట్టి ఉన్నా అన్నట్లు ఉన్నాడు. ఇలా ప్రతీ విషయంలోనూ సినిమా స్క్రిప్టు దశలోనే ఫెయిలైందని అర్దమవుతుంది. సాధారణంగా రైటర్స్ ..డైరక్టర్స్ గా మారుతున్నప్పుడు సినిమా టెక్నికల్ గా స్టాండర్డ్స్  ఉన్నా లేకపోయినా స్క్రిప్టు పరంగా హైగా ఉంటుందని ఊహిస్తాం. కానీ డైమండ్ రత్నబాబు దర్శకుడుగా ప్రూవ్ చేసుకునే క్రమంలో తన బలాన్ని వదిలేసారు.
సాంకేతికంగా

రైటర్ గా అద్బుతం చేయలేకపోయారు పోనీ దర్శకుడుగా దుమ్ము రేపాడా అంటే డైరెక్ట‌ర్ ర‌త్న‌బాబు సినిమాను తెర‌కెక్కించిన విధానం  గొప్పగాలేదు. ఆది సాయి కుమార్ తనకు చేతనైనంతలో పాటలు, పైట్స్ లో ఈజ్ చూపించాడు. సంగీత దర్శకుడుగా సాయి కార్తీక్ పూర్తిగా ఫెయిలైన సినిమా ఇది. రాంప్రసాద్ లాంటి సీనియర్ టెక్నీషియన్ సైతం సినిమాకు సైరన సినిమాటోగ్రఫీ అందించలేదు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు ఓకే. సినిమాలో బాగున్న ఏకైక అంశం…రత్నబాబు డైలాగులే.
చూడచ్చా
మరీ ఖాళీగా ఉండి, బుర్రకు పనేమీ లేనప్పుడు ట్రై చేయటంలో తప్పేమీ లేదు.
ఎవరెవరు..
నటీనటులు: ఆది, నైరా షా, రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణమురళీ, పృథ్వీ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రాఫర్: రామ్‌ ప్రసాద్‌
కూర్పు: ఎం.ఆర్‌ వర్మ
నిర్మాత: హెచ్‌ కె. శ్రీకాంత్ దీపాల
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు