బోయపాటి శ్రీను ఇంటర్వ్యూ

Published On: August 10, 2017   |   Posted By:

బోయపాటి శ్రీను ఇంటర్వ్యూ

ఈ వీకెండ్ జయజానకి నాయక సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. తన మార్క్ యాక్షన్ ఉంటూనే, సినిమాలో అన్ని మసాలాలు ఉంటాయంటున్నాడు ఈ దర్శకుడు.  సినిమా విశేషాలతో పాటు తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై మీడియాతో మాట్లాడాడు.

ప్రతి గుండెను టచ్ చేసే సినిమా

జయజానకి నాయక ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేసే సినిమా. నేను సినిమా చేసిన ప్రతిసారి మీరే అడుగుతుంటారు. మీరు మారరా. కొత్త ప్రయత్నం చేయరా అని అడుగుతుంటారు. భద్ర చేసిన తర్వాత నేను చేసిన ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జయజానకి నాయక. లవ్ సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా ఉంటుంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ దానికి యాడ్ అవుతాయి.

టైటిల్ వెనక కహానీ సినిమా చూసి అర్థం చేసుకోవాలి

టైటిల్ వినడానికి చాలా కొత్తగా ఉంటుంది. కథకు కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. సినిమా చూశాక మీరే ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. అందుకే ఈ సినిమాకు జయజానకి నాయక అనే టైటిల్ పెట్టాం.

సరైనోడుతో దీన్ని పోల్చవద్దు

సరైనోడుతో ఈ సినిమాను పోల్చవద్దు. నా  గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. సినిమాలో ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. కాకపోతే యాక్షన్ కూడా ఉంటుంది. అందులో నా మార్క్ ఉంటుంది. అయితే కావాలని పెట్టలేదు. ఇక్కడ కొట్టాలి అని ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే ఫైట్ ఉంటుంది. ఇక సాంగ్స్ విషయానికొస్తే పాటలు అద్భుతంగా ఉన్నాయి. సిచ్యుయేషన్ పరంగా సాంగ్స్ ఉన్నాయి. ప్రతి పాట కథలోంచే వచ్చింది. కావాలని పెట్టలేదు.

నాకు మంచి హీరో దొరికాడు

లవ్ సబ్జెక్ట్ నా మనసులో ఎప్పుడో ఉంది. నిజానికి లవ్ సబ్జెక్ట్ తోనే మొదలుపెడదాం అనుకున్నాను. కానీ అనుకోకుండా యాక్షన్ జానర్ సెట్ అయిపోయింది. దాన్ని ఇన్నాళ్లూ కంటిన్యూ చేశాను. భద్ర తర్వాత లవ్ సబ్జెక్ట్ టచ్ చేసే టైం ఇన్నాళ్లకు వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మంచి హీరో కూడా దొరికాడు.

ఇప్పటి జనరేషన్ కథ ఇది

జయజానకి నాయక కోసం ఫస్ట్ అనుకున్న కథ వేరు.  ఆ టైమ్ కు అది కాంటెంపరరీ. కానీ ఇప్పుడు చాలా మార్పులు చేశాను. ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు నన్ను నేను మార్చుకున్నాను. ఈ టైమ్ కు జయజానకి నాయక కథ కరెక్ట్. నా స్టయిల్ ఆఫ్ యాక్షన్ బెల్లంకొండ శ్రీనివాస్ కు హెవీ అవ్వలేదు. సరిగ్గా సరిపోయింది. సరైనోడు చేసినప్పుడు బన్నీకి కుదురుతుందా అని మీరే అడిగారు. కానీ అది ఎంత హిట్ అయిందో మీకు తెలిసిందే. శ్రీను అనే హీరో ముడిసరుకు లాంటివాడు. మనం ఎలా తయారుచేస్తే అలా తయారవుతాడు.

ఫస్ట్ టీజర్ వెనక రీజన్

ఫస్ట్ టీజర్ లో రొమాంటిక్, లవ్ ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత టీజర్ లో మొదటి టీజర్ కు జస్టిఫికేషన్ కనిపిస్తుంది. ఇక థియేట్రికల్ ట్రయిలర్ లో ఈ రెండు టీజర్ల జస్టిఫికేషన్ ఉంటుంది. కావాలంటే స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. ఏదో పొరపాటున అలా చేసింది కాదు. కావాలనే ప్లాన్డ్ గా అలా చేశాం.

కథకు తగ్గట్టే బడ్జెట్

బడ్జెట్ పెరగలేదు. కథకు తగ్గట్టే పెట్టాం. అయినా పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టే బిజినెస్ కూడా అయింది కదా. ఏ సినిమాను నేను తక్కువచేసి తీయను. నన్ను నమ్మి సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్లను డిసప్పాయింట్ చేయను. ఏదైనా కథ ప్రకారమే ఉంటుంది. ప్రతి సినిమాను నా మొదటి సినిమాగా ఫీల్ అయి చేస్తా. బయ్యర్ల నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లో వమ్ము చేయను.

మిగతా సినిమాలతో పోటీ ఉండదు

3 సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఇబ్బంది లేదు. తెలుగు రాష్ట్రాల్లో 12వందల థియేటర్లు ఉన్నాయనుకుంటే.. ఏ సినిమా వెయ్యి థియేటర్లలో వచ్చేయదు కదా. మహా అయితే మా సినిమాకు ఓ వంద స్క్రీన్లు తగ్గుతాయి. అదేం పెద్ద ఇబ్బంది కాదు. పోటీ అనేది ఉండాలి. మా ప్రింట్స్ ఆదివారం రాత్రే వెళ్లిపోయాయి. మేం సినిమాను వెనక్కి తీసుకోం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓసారి వెనక్కి తగ్గాం. జులైలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అందుకే ఈసారి రిలీజ్ డేట్ ముందే చెప్పాం. కానీ అనుకోకుండా ఇంకొన్ని సినిమాలు వచ్చాయి. మళ్లీ వెనక్కి తగ్గితే బాగుండదు. మళ్లీ పోస్ట్ పోన్ చేస్తే 4 కోట్ల రూపాయల వరకు వడ్డీలే కట్టాల్సి వస్తుంది. నిర్మాతకు చాలా నష్టం. ప్రింట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి.

నాకు టెన్షన్ పెద్దగా ఉండదు

సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు మాత్రమే టెన్షన్ పడతాను. తీసేసిన తర్వాత ఎలాంటి టెన్షన్ ఉండదు. షూటింగ్ స్పాట్ లో కూడా టెన్షన్ పడడం నాకు నచ్చదు. అవసరమైతే ముందు రోజు రాత్రి 2 గంటలైనా షాట్ డివిజన్ కంప్లీట్ అయిన తర్వాతే నిద్రపోతా. ఒక రాత్రి నిద్రలేకపోతే నాకేం కాదు. ఈ కథకు చాలా నిడివి ఉంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. 3 కుటుంబాల మధ్య కథ ఇది. వాళ్ల మధ్య జరిగే సంఘటనల కోసం భారీ తారాగణం కావాలి. అందుకే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని తీసుకున్నాం.

ఈ సినిమాలో ఆరుగురు హీరోయన్లు

ఈ సినిమాలో ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్. మరో కీలక పాత్రలో సెకెండ్ హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ కనిపిస్తుంది. ఇక ఐటెంసాంగ్ కోసం క్యాథరీన్ ను తీసుకున్నాం. వదిన పాత్ర కోసం ఇస్థార్ అనే మరో హీరోయిన్ ను తీసుకున్నాం. నందుకు భార్యగా నటించిందామె. మరో కీలకమైన పాత్ర కోసం ధన్య బాలకృష్ణన్ హీరోకు ఫ్రెండ్ గా చేసింది. ఈ ఐదుగురు కాకుండా, సీనియర్ నటి వాణి విశ్వనాథ్ ను కూడా తీసుకున్నాం. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. ఉన్నది 4 సీన్లే అయినా అద్భుతంగా చేశారు.

దేవిశ్రీ ప్రసాద్ నా బెస్ట్ ఫ్రెండ్

దేవిశ్రీప్రసాద్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను, దేవి చాలా క్లోజ్. చూస్తే మీరే షాక్ అవుతారు. కథలోనే సాంగ్ సిచ్యుయేషన్ సింక్ అయి ఉంటుంది కాబట్టి దేవిశ్రీ చాలా హ్యాపీ. ఇందులో రీ-రికార్డింగ్ చాలా కొత్తగా ఉంటుంది. సాంగ్స్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ.