భ‌ర‌త్ అనే నేను మూవీ రివ్యూ

Published On: April 20, 2018   |   Posted By:

భ‌ర‌త్ అనే నేను మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌:  డి.పార్వ‌తి

బ్యాన‌ర్ :  డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు: మ‌హేశ్‌, కైరా అద్వాని, శ‌ర‌త్ కుమార్‌,  ప్ర‌కాశ్‌రాజ్‌, దేవ్‌రాజ్‌, బ్ర‌హ్మాజీ, రావు
ర‌మేశ్‌, సూర్య‌, జీవా, ర‌విశంక‌ర్‌, శ‌త్రు త‌దిత‌రులు
ఎడిటింగ్‌: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
కెమెరా: ర‌వి.కె.చంద్ర‌న్‌, తిరునావుక్క‌ర‌సు
నిర్మాత‌:  దాన‌య్య డి.వి.వి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  కొర‌టాల శివ‌
రిలీజ్ డేట్ – 20.04.2018
రన్ టైం – 173 నిమిషాలు
సెన్సార్ –  యు/ ఎ సర్టిఫికేట్

సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి ముఖ్య‌మంత్రులుగా, మంత్రులుగా చ‌క్రం తిప్పిన వారెంద‌రో ఉన్నారు. ఆ ర‌కంగా సినిమాల‌కు, రాజకీయాల‌కు అవినాభావ సంబంధం ఉంటుంది. మ‌హేశ్ లాంటి సూప‌ర్‌స్టార్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడంటే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఇలాంటి సినిమాను క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ డైరెక్ట్ చేశాడంటే.. సినిమాపై ఎంత బ‌జ్ ఉంటుందో తెలిసిందే. మిర్చి నుండి జ‌న‌తాగ్యారేజ్ వ‌ర‌కు త‌న సినిమాలు ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇస్తూ వ‌చ్చిన కొర‌టాల‌.. ఇక రాజకీయ నేప‌థ్య‌మున్న సినిమా.. అందులోనూ మ‌హేశ్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోతో ఎలాంటి మెసేజ్ ఇస్తాడోన‌ని అతృత‌గా పెరిగిపోయింది. మ‌రి ఇన్ని భారీ అంచ‌నాలు మ‌ధ్య సినిమా  ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందో లేదో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థ‌:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రాఘ‌వ(మ‌హేశ్‌) అనారోగ్యంతో క‌న్నుమూస్తాడు. ఆయ‌న ద‌హ‌న సంస్కారాల‌కు ఆయ‌న కొడుకు భ‌ర‌త్ రామ్‌(మ‌హేశ్‌) లండ‌న్ నుండి వ‌స్తాడు. భ‌ర‌త్ లండ‌న్‌కు వెళ్లిపోవాలనుకుంటాడు. ఆ స‌మ‌యంలో పార్టీలో ముఖ్య‌మంత్రి ప‌దవికోసం జ‌రిగే కుమ్ములాట‌ల కార‌ణంగా పార్టీ మ‌రో చీఫ్ అయిన వ‌ర‌ద‌రాజులు(ప్ర‌కాశ్ రాజ్‌), భ‌ర‌త్‌ని సీఎంను చేస్తాడు. రాజ‌కీయాలే తెలియ‌ని భ‌ర‌త్ త‌న ఆలోచ‌నా శ‌క్తితో.. త‌ను గ‌మ‌నించిన విష‌యాల ఆధారంగా ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. ఈ క్ర‌మంలో ముందు ప్ర‌జ‌ల నుండి విమ‌ర్శ‌లు ఎదురైనా.. భ‌ర‌త్ చేసే మంచి ప‌నుల‌ను వారు గుర్తిస్తారు. ప్ర‌జ‌ల‌కు మంచి స‌దుపాయాలు కల్పించ‌డం కోసం భ‌ర‌త్ చేసే ప‌నులు కార‌ణంగా సొంత పార్టీ మ‌నుషులు కూడా త‌న‌కు వ్య‌తిరేకంగా వ‌ర‌ద‌రాజుల‌కు పిర్యాదు చేస్తాడు. వ‌ర‌ద‌రాజులు చెప్పినా..భ‌ర‌త్ విన‌డు. త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తాడు. అనుకోకుండా ఓ కార‌ణంగా భ‌ర‌త్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాడు. ఇంత‌కు ఆ కార‌ణ‌మేంటి? అస‌లు వ‌సుమ‌తి ఎవ‌రు?  రాఘ‌వ ఎందుకు చ‌నిపోతాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

– మ‌హేశ్ న‌ట‌న‌
– సినిమాటోగ్ర‌ఫీ
– బ్యాగ్రౌండ్ స్కోర్‌
– నిర్మాణ విలువలు

మైన‌స్ పాయింట్స్‌:

– ఇన్‌టెన్ష‌న్ హై గా ఉండ‌టం వ‌ల్ల కామెడీకి స్కోప్ క‌న‌ప‌డ‌దు.
– సీఎం చేసే ప‌నులు రియాలిటీకి దూరంగా ఉంటాయి.
– భ‌ర‌త్ సీఎం ప‌దవి వ‌దులుకునే కార‌ణం అంత బ‌ల‌మైన‌దిగా లేదు

విశ్లేష‌ణ‌:

సినిమాలో ఫ‌స్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వ‌ర‌కు మ‌హేశ్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఓ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా ఉండి కూడా.. ఇంత ఇన్‌టెన్ష‌న్ ఉన్న మూవీ చేయ‌డానికి త‌ను ముందుకు వ‌చ్చినందుకు అభినంద‌నీయుడు. సినిమాను త‌న భుజాల‌పై మోశాడు. ఇందులో డాన్సులు ప‌రంగా త‌న‌కు స్కోప్ లేదు. అయితే హై ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయాడు మ‌హేశ్‌. ఇక కియరా అద్వాని అందంగా ఉంది. ఈమెకు టాలీవుడ్ నుండి మ‌రిన్ని అవ‌కాశాలు రావ‌డం ఖాయం. అయితే పాత్ర ప‌రంగా చ‌క్క‌గా న‌టించినా.. ఈమె పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. ప్ర‌కాశ్ రాజ్ క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంది. ర‌విశంక‌ర్‌, శ‌త్రు, రావు ర‌మేశ్‌, దేవ్‌రాజ్‌, శ‌త్రు, పృథ్వీ, పోసాని త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ.. మ‌హేశ్‌లాంటి హీరోతో ఇలాంటి పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో.. స‌మాజంలోని కొన్ని త‌ప్పుల‌ను ఎత్తి చూపిస్తూ చేసిన ప్ర‌య‌త్నం బావుంది.  హీరో సీఎం కావ‌డం అనేది ఆ మ‌ధ్య శంక‌ర్ `ఒకే ఒక్క‌డు`లోనూ, ఇటీవ‌ల శేఖ‌ర్‌క‌మ్ముల `లీడ‌ర్‌`లోనూ చూశాం. అందులో ఉన్న విష‌యాల‌ను కాస్త అటూ ఇటూగా ఇందులోనూ ఉన్నాయి. ట్రాఫిక్‌, విద్య‌, వైద్యం, చేతి వృత్తులు, వ్య‌వ‌సాయం వంటివాటిని ఇందులోనూ చూపించారు ద‌ర్శ‌కుడు. అయితే ఏ విష‌యాన్నీ డీప్‌గా ట‌చ్ చేయ‌లేదునాయ‌కుడు అనే వాడు ఉండ‌కుండా చేయగ‌లిగినవాడే నాయ‌కుడు అనే కాన్సెప్ట్‌ను ద‌ర్శ‌కుడు శివ చ‌క్క‌గా చూపించాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన పాట‌ల్లో ఐ డోంట్ నో.. సాంగ్‌తో పాటు.. వ‌చ్చాడ‌య్యో సామి అనే పాట విన‌డానికే కాదు.. తెర‌పై చూడ‌టానికి కూడా బావున్నాయి. ఇక దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఆక‌ట్టుకున్నాడు. ర‌వికె.చంద్ర‌న్‌, తిరునావక్క‌ర‌సుల సినిమాటోగ్ర‌ఫీ సింప్లీ సూప‌ర్బ్‌. ప్రతి స‌న్నివేశం రిచ్‌గా క‌న‌ప‌డింది.  సినిమాలో కామెడీ లేక‌పోవ‌డం ముఖ్య‌మంత్రి చేసే ప‌నులు రియాలిటీకి దూరంగా ఉండ‌టం చివ‌ర్లో సినిమాను రొటీన్ క‌థ‌నంతో న‌డిపించ‌డం అనే విష‌యాలు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌వు. సినిమాను ఇంకాస్త త‌గ్గించి ఉంటే బావుండేది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

బోట‌మ్ లైన్‌: భ‌ర‌త్ అనే నేను  ఆక‌ట్టుకునే పొలిటిక‌ల్ డ్రామా

రేటింగ్ : 3.25/5