మళ్లీ రావా మూవీ రివ్యూ

Published On: December 8, 2017   |   Posted By:

మళ్లీ రావా మూవీ రివ్యూ

నటీనటులు – సుమంత్, ఆకాంక్ష, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి

సంగీతం – శ్రవణ్ భరధ్వాజ్

ఫొటోగ్రఫీ – సతీష్ ముత్యాల

ఎడిటింగ్ – సత్య గిడుతూరి

పాటలు – కృష్ణకాంత్ (సింగిల్ కార్డ్)

బ్యానర్ – స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్

నిర్మాత – రాహుల్ యాదవ్ నక్క

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – గౌతమ్ తిన్ననూరి

రిలీజ్ డేట్ – డిసెంబర్ 8, 2017

నరుడా డోనరుడా సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సుమంత్ చేసిన మూవీ మళ్లీ రావా. గోదావరి తర్వాత మళ్లీ అలాంటి ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు క్లిక్ అయ్యాయి. ట్రయిలర్ కూడా చాలామందికి నచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలా ఓ మోస్తరు అంచనాలతో ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “మళ్లీ రావా” మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

1999, 2012, 2017.. ఇలా 3 దశల్లో జరిగిన రొమాంటిక్ స్టోరీ ఇది. 1999లో రాజోలులో 9వ తరగతి చదువుతుంటాడు హీరో కార్తీక్(సుమంత్). అదే క్లాస్ లో హీరోయిన్ అంజలి (ఆకాంక్ష) కూడా ఉంటుంది. వీళ్లిద్దరిదీ టీనేజ్ ప్రేమ. ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడతారు. కానీ వీళ్ల టీనేజ్ లవ్ ను అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించారు. ఒకర్నొకరు కలవకుండా కట్టడిచేస్తారు. ఈ ప్రేమకథలో మొదటి బ్రేక్ ఇది.

కట్ చేస్తే 13 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో మళ్లీ కలుసుకుంటారు హీరోహీరోయిన్లు. ఈసారి కూడా వీళ్లు ప్రేమించుకుంటారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏమాత్రం తరగదు. కానీ సరిగ్గా ఇక్కడే హీరోకు షాకిస్తుంది హీరోయిన్. తను ఇంకా చదవుకోవాలని చెప్పి అమెరికా వెళ్లిపోతుంది. అలా మరో ఐదేళ్లు ఈ జంట దూరమైపోతుంది.

తిరిగి వీళ్లు 2017లో కలుసుకుంటారు. హీరోయిన్ అమెరికా నుంచి వచ్చేస్తుంది. మరి ఈసారి వీళ్ల ప్రేమకు అడ్డేంటి.. ఈసారైనా హీరోహీరోయిన్లు పెళ్లిచేసుకున్నారా.. అసలు హీరోయిన్ ఎందుకు హీరోను వదిలి అమెరికా వెళ్లిపోతుందనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్

– సుమంత్ యాక్టింగ్

– బ్యాక్ గ్రౌండ్ స్కోర్

– హీరోహీరోయిన్ల మధ్య ఎమోషన్స్

– హీరో ఫ్రెండ్ అభినవ్

– హీరో ఆఫీస్ సీన్లు

మైనస్ పాయింట్స్

– స్లో నెరేషన్

– ఫస్టాఫ్ లో డ్రామా

– స్క్రీన్ ప్లేలో తప్పులు

– క్లైమాక్స్

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ

మళ్లీ రావా అనే టైటిల్ ను కథకు తగ్గట్టు పెట్టుకున్నప్పటికీ.. మళ్లీ రావా అంటూ సక్సెస్ ను సుమంత్ మరోసారి పిలుస్తున్నట్టుంది ఈ సినిమా. సరైన హిట్ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నాడు ఈ హీరో. ఇంకా చెప్పాలంటే గోదావరి మూవీ తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేదు. అందుకే మరోసారి అలాంటి ఎమోషన్స్ ఎంచుకున్నాడు. సుమంత్ ఎంచుకున్న కథ మాత్రం నూటికి నూరుపాళ్లు కరెక్ట్. అతడిది రైట్ సెలక్షన్.

ఈ కథకు అచ్చుగుద్దినట్టు సూట్ అయిపోయాడు సుమంత్. ఎంతలా అంటే ఇది అతడి రియల్ లైఫ్ స్టోరీ అనిపిస్తుంది. అలా సింక్ అయిపోయాడు. ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీలో సీనియారిటీ కనిపించింది. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ చక్కగా చేసింది. భవిష్యత్తులో ప్రేమకథల కోసం ఈమెను కళ్లుమూసుకొని తీసుకోవచ్చు. హీరో ఫ్రెండ్ గా అభినవ్ చక్కగా నటించాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల మేరకు బాగా నటించారు.

టెక్నికల్ గా చూస్తే ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. ఇలాంటి ఫీల్ గుడ్ ప్రేమకథలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటే సినిమా అంత ఎలివేట్ అవుతుంది. ఆ విషయంలో మ్యూజిక్ డైరక్టర్ శ్రవణ్ సక్సెస్ అయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి పాటలు కూడా ఇచ్చాడు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఇక దర్శకుడి విషయానికొస్తే గౌతమ్ మంచి కథ రాసుకున్నాడు. మాటల్లో, దర్శకత్వంలో చమక్కు చూపించాడు. కానీ స్క్రీన్ ప్లే విభాగంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. తన డైరక్ట్ చేసి, స్క్రీన్ ప్లేను మరొకరికి అప్పగించి ఉంటే బాగుండేది. కనీసం ఎడిటర్ కు అయినా పూర్తి స్వేచ్ఛ ఇస్తే బాగుండేది. ఫీల్ గుడ్ మూవీ ముసుగులో మనసుకు నచ్చిన సీన్లు అన్నీ పెట్టేసి సినిమాకు సాగదీశారు. అలా అని మూవీని లేపే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. సినిమాను మనసుపెట్టి తీసినప్పటికీ ఫస్టాఫ్ బోర్ కొట్టేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల ఎపిసోడ్ బాగా తగ్గిస్తే బాగుండేది. స్క్రీన్ ప్లేలో మిస్టేక్స్ వల్ల 1999, 2012, 2017 కాలాలకు చెందిన ప్రేమకథల్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు.

క్లైమాక్స్ లో కూడా హీరోయిన్ రియలైజ్ అయ్యే సన్నివేశాలు బలంగా లేవు. దీంతో మళ్లీరావా మూవీ తేలిపోయింది. మనసుపెట్ట చూస్తే సినిమా కనెక్ట్ అవుతుందేమో కానీ, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేసే సినిమా మాత్రం కాదిది. మరీ ముఖ్యంగా సుమంత్ కు కమ్ బ్యాక్ మూవీ కూడా కాదు.

బాటమ్ లైన్ – యూత్, మల్టీప్లెక్స్ జనాలకు నచ్చుతుంది

రేటింగ్ – 2.75/5