మార్చి నుంచి గోపీచంద్ బ‌యోపిక్‌

Published On: November 2, 2017   |   Posted By:
మార్చి నుంచి గోపీచంద్ బ‌యోపిక్‌
ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ల్లో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. తెలుగులో ఇప్ప‌టికే మ‌హాన‌టుడు ఎన్టీఆర్‌, మ‌హాన‌టి సావిత్రి జీవితాల ఆధారంగా బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతుండ‌గా.. అతి త్వ‌ర‌లో ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ రూపొంద‌నుంది. యువ క‌థానాయ‌కుడు సుధీర్ బాబు ఇందులో గోపీచంద్ పాత్ర‌లో న‌టించ‌నుండ‌గా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని ప్ర‌వీణ్ తెలిపాడు. స్వ‌త‌హాగా సుధీర్ మంచి బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కావ‌డం.. గోపీచంద్‌ని ద‌గ్గ‌ర నుంచి చూసిన మ‌నిషి కావ‌డంతో.. ఈ పాత్ర‌కి సుధీర్ మాత్ర‌మే సూట్ అవుతార‌ని ప్ర‌వీణ్ చెప్పుకొచ్చాడు. గోపీచంద్ జీవితంలోని కొన్ని ఘ‌ట‌న‌లు సినిమాలోని స‌న్నివేశాల‌కు ఏ మాత్రం తీసిపోవ‌ని.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌గా రూపొందే ఈ సినిమాని జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్దేందుకు త‌న వంతు గా ప్ర‌య‌త్నిస్తాన‌ని ద‌ర్శ‌కుడు తెలిపాడు. ప్ర‌స్తుతం న‌టీన‌టుల‌, సాంకేతిక నిపుణుల ఎంపిక‌లో ఉంది చిత్ర యూనిట్‌.  2019లో ఈ సినిమా విడుద‌ల కానుంది. కాగా, ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కొత్త చిత్రం పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం రేపు తెర‌పైకి రానుంది.