మిస్ట‌ర్ కేకే మూవీ రివ్యూ

Published On: July 19, 2019   |   Posted By:
మిస్ట‌ర్ కేకే మూవీ రివ్యూ
 
నాట్ ఓకే (‘మిస్ట‌ర్ కేకే’రివ్యూ)

Rating: 1.5/5

వెరైటి గెటప్ లకు పెట్టింది పేరు విక్రమ్. వయస్సు పెరుగుతున్నా దాన్ని ఎక్కడా కనపడనీయకుండా మ్యానేజ్ చేస్తూ మ్యాజిక్ చేస్తున్న విక్రమ్ కు విజయాలే దక్కటం లేదు. అయినా ప్రయత్నం వీడటం  లేదు. ఈ సారి  ఓ థ్రిల్లర్ తో మనని పలకరించాడు. ఎప్పటిలాగే తెలుగు వెర్షన్ సైతం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే…తమిళంలో దీన్ని కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేసారు. ఇదో ఫ్రెంచ్ సినిమా అఫీషియల్ రీమేక్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా అయినా విక్రమ్ కు కలిసొచ్చిందా..వేరే దేశం నుంచి కొనుక్కొచ్చి మరీ రీమేక్ చేయదగ్గ  గొప్ప కథ ఏముంది ఈ సినిమాలో…తెలుగు వాళ్లకు నచ్చే కథాంశమేనా రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

కేకే (విక్రమ్) మలేషియా లో ఒక పెద్ద గ్యాంగస్టర్. అతడిని పట్టుకోవాలని ఓ గ్యాంగ్ వేటాడుతూ ఉంటుంది.  వాళ్ళనుంచి తప్పించుకొనే క్రమం లో కేకే ఒక రోడ్ యాక్సిడెంట్ కి గురవుతాడు.  అయితే ఆ యాక్సిడెంట్ నుండి కేకే ని వాసు (అభి హాసన్)  అనే ఒక జూనియర్ డాక్టర్ సేవ్ చేస్తాడు. అయితే ఈ లోగా  కేకే రైవల్ గ్రూప్ … వాసు భార్యని కిడ్నాప్ చేసి కేకే ని అప్పగించమని బెదిరిస్తారు.  అప్పుడు కేకే ఏం నిర్ణయం తీసుకున్నాడు…అసలు కేకే ని పట్టుకోవాలనుకుంటున్న గ్యాంగ్ కు అతనితో ఏం పని
..కిడ్నాప్ అయిన వాసు భార్య రక్షింపడిందా… కేకే తన శత్రువులని ఎలా కనుక్కున్నాడా..ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.

ఎలా ఉందంటే…

మొదటే చెప్పుకున్నట్లు ఇది ప్రెంచ్ లో  సూపర్ హిట్ అయిన  Point Blank (2010) అనే క్రైమ్ థ్రిల్లర్  అఫీషియల్  రీమేక్. ఈ సినిమా రైట్స్ తీసుకున్న కమల్ మొదట ఆయనే చేద్దామనుకుని రాజకీయాల్లోకి వెళ్లాం..బిజిగా ఉన్నామని విక్రమ్ ని సీన్ లోకి తెచ్చాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటీ అంటే  విక్రమ్ చేసినా, కమల్ చేసినా ఒరిగేది ఏమి ఉండేది కాదు.  ఎందుకంటే ఫ్రెంచ్ లో అది పెద్ద హిట్ కావచ్చు కాని..అదో చిన్న థ్రిల్లర్ సినిమా. దాన్ని ఓ మాదిరి  పెద్దగా ఇమేజ్ లేని ఆర్టిస్ట్ లతో చేయాలి. అంతేకాని విక్రమ్, కమల్ , రజనీకాంత్ అంటే ఇలాగే ఫలితం ఉంటుంది. విక్రమ్ వచ్చి ఏదో ఊడబొడుస్తాడు అని సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా కళ్లు పత్తికాయల్లా విచ్చుకుని చూస్తూంటాం. కానీ ఎక్కడా చిన్న సీన్ కూడా అలాంటిదేం ఉండదు. డైరక్టర్ స్లోగా ,మెల్లిగా ఎవరో కొత్త హీరోతో చేసినట్లు సినిమాను ఛేజింగ్ లతో నింపి పరుగెట్టిస్తూ ఉంటాడు. సినిమా చూస్తూ ఉంటుంటే ….ఇప్పుడు విక్రమ్ …విలన్స్ ఎవరో తెలుసుకుని ఏం చేయాలి అనిపిస్తుంది. పాపం ఆ డాక్టర్ అనవసరంగా ఇరుకున్నాడనిపిస్తుంది కానీ విక్రమ్ ని పెద్దగా పట్టించుకోబుద్ది కాదు.  దర్శకుడు రాజేష్ ఎం సెల్వ (ఇంతకు ముందు కమల్ తో  చీకటి రాజ్యం తీసిన దర్శకుడు..అదీ ప్రెంచ్ రీమేకే) కూడా ఆ చీకటి రాజ్యం కు మరో వెర్షన్ అన్నట్లు తీసాడు తప్ప కిడ్నాప్ డ్రామా ఉన్న కిక్ లేదు.

యాక్షన్ ఇరగతీసాడా

ఇక ఈ సినిమా ట్రైలర్ చూసి ఆవేశంగా థియోటర్ కు వెళ్లినవాడు ..సర్లే ఇలాంటి సినిమాలకు కథేముంటుంది…యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకుంటారు. అయితే ఆ విషయంలోనూ డైరక్టర్ నిరాశపరిచాడు. ఏదో ఒకట్రెండ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నా అవి అంతగా రక్తి కట్టలేదు.

ఎవరెలా…

ఈ సినిమా కథ విషయం వదిలేస్తే విక్రమ్ మాత్రం అదరకొట్టాడు. ఆయన లుక్, గెటప్ యంగ్ హీరోలకు సవాల్ విసిరేలా ఉంది. ఇక కమల్ కుమార్తె అక్షర హాసన్ సైతం తండ్రి నుంచి నటన వారసత్వంగా పుచ్చుకుందని అర్దమవుతుంది. మిగతావాళ్లు తమ పరిధి మేరకు చేసారు. వంక పెట్టలేం..అద్బుతమని అనలేం.
 

టెక్నికల్ గా

డైరెక్టర్ రాజేష్ ఎం సెల్వ  ఒరిజనల్ స్క్రీన్ ప్లే ని ఏ మాత్రం మార్చకుండా ఫాలో అయ్యిపోయాడు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ మరియు ఆర్ రవీంద్ర అందించిన నిర్మాణ విలువలు సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. గిబ్రాన్ అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పోసింది.మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫర్ శ్రీనివాస్ ఆర్ గుత్తా ప్రతి సన్నివేశాన్ని విజువల్ గా చెక్కారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ బాగుంది అనిపిస్తుంది.

 ఫైనల్ గా..


 మిస్టర్ కేకే ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్  గా మలచాలని చేసిన ప్రయత్నం కొంత వరకూ అంటే స్టైలిష్ అనే పదం వరకూ సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ మరియు యాక్షన్ సన్నివేశాలు కథను ఇంట్రస్టింగ్ గా మార్చాయి. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు కూడా  డైరక్టర్ బాగా హ్యాండిల్ చేశారు. అలాగని విక్రమ్ గత చిత్రాలు అపరిచితుడు, శివపుత్రుడు  స్దాయిని ఏ మాత్రం రీచ్ కాదు.
 
చూడచ్చా
 
ఈ సినిమాని థ్రిల్లర్ అభిమానులు చూడచ్చు. విక్రమ్ అభిమానులకు మాత్రం కష్టమనిపిస్తుంది.

————-

ఎవరెవరు

నటీనటులు : విక్రమ్, లీన, అక్షర హాసన్ త‌దిత‌రులు.

నిర్మాత‌లు : కమల్ హాసన్

సంగీతం : జిబ్రాన్‌

సినిమాటోగ్రఫర్ : శ్రీనివాస్ ఆర్ గుత్తా

ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్
 
దర్శకత్వం : రాజేష్ ఎమ్ సెల్వ