మురుగదాస్ ఇంటర్వ్యూ

Published On: September 26, 2017   |   Posted By:

మురుగదాస్ ఇంటర్వ్యూ

మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది స్పైడర్ సినిమా. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అంటున్నాడు దర్శకుడు మురుగదాస్. 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమా ఆడియన్స్ కు సరికొత్త థ్రిల్ ఇస్తుందంటున్న మురుగదాస్.. మీడియాతో మాట్లాడాడు.

ఇది మహేష్ బాబు సినిమా

ఓ టెర్రరిస్టుకు, పోలీసులకు మధ్య జరిగే యుద్ధమే స్పైడర్. ఈ యుద్ధంలో మహేష్ బాబు కీలక పాత్ర పోషిస్తాడు. వ్యవస్థ, ప్రభుత్వంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకొని విలన్ ఎలా సమస్యల్ని సృష్టిస్తాడు.. ఆ సమస్యల్ని హీరో ఎలా ఛేదిస్తాడనేదే స్పైడర్ కథ. ఈ కథ రాసుకున్నప్పుడే మహేష్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నాను. మహేష్ కూడా వెంటనే ఒప్పుకున్నారు.

2 భాషల్లో.. రెండేసి సార్లు తీశాం

నిజానికి స్టార్టింగ్ లో స్పైడర్ ను ద్విభాషా చిత్రంగా అనుకోలేదు. ఇంకో 10 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తామనగా ఎందుకో అప్పుడు అనిపించింది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమా చేయాలని అప్పుడు ఫిక్స్ అయ్యాను. దీనికి మరో రీజన్ కూడా ఉంది. మహేష్ చక్కగా తమిళ్ మాట్లాడతాడు. డబ్బింగ్ అతడితోనే చెప్పించాలని ముందే ఫిక్స్ అయ్యాను. అలా రెండు భాషల్లో తీయాలని అనుకున్నతర్వాత ఇక ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి విజువల్ ను 2సార్లు షూట్ చేశాం. చివరికి డైలాగ్ లేని సన్నివేశాల్ని కూడా 2 సార్లు తీశాం. సైమల్టేనియస్ గా 2 యూనిట్లు పనిచేశాయి.

సినిమాకు సెకెండాఫ్ ప్రాణం

స్పైడర్ సినిమా హైలెట్స్ అన్నీ సెకెండాఫ్ లోనే ఉంటాయి. నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ మాత్రం 2వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో తీసిన సన్నివేశం. అది తీయడానికి చాలా కష్టపడ్డాను. సినిమాకు చాలా కీలకం కూడా. ఇక సెకెండాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, సినిమా స్క్రీన్ ప్లే మూవీలో హైలెట్స్.

ప్రతి దర్శకుడు మహేష్ తో సినిమా చేయాలి

మహేష్ తో వర్క్ చేసిన తర్వాత ఒక విషయం మాత్రం నాకు క్లియర్ గా అర్థమైంది. మళ్లీ మళ్లీ అతడితోనే సినిమా చేయాలనే కోరిక రగిలిస్తాడు మహేష్. అతడితో ఓ సినిమా చేస్తే మరోసారి కలిసి చేయాలని మనసు కోరుకుంటుంది. ఇక నేను చెప్పేదేంటంటే.. ప్రతి దర్శకుడు మహేష్ తో కనీసం ఒక సినిమా అయినా చేయాలి. ఎందుకంటే దర్శకుడికి మహేష్ ఇచ్చే గౌరవం, విలువ ఆ రేంజ్ లో ఉంటాయి.  ఈ సినిమాతో మేమిద్దరం ఇంకా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకునేవాళ్లం. మరో ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను. ఈ సినిమాలో మహేష్ నుంచి సరికొత్త మేనరిజమ్స్ చూస్తారు.

స్పైడర్ లో తమిళ ఫ్లేవర్ కనిపిస్తుంది

స్పైడర్ లో కాస్త తమిళ ఫ్లేవర్ కనిపిస్తోందని అంతా అంటున్నారు. మరీ ముఖ్యంగా మ్యూజిక్ లో తమిళ వాసనలు ఉన్నాయంటున్నారు. అది నిజమే. నేను తమిళియన్ కాబట్టి ఆ ఛాయలు కనిపిస్తాయి. కాకపోతే ఎమోషన్ కు భాషతో సంబంధం లేదు. స్పైడర్ లో భావోద్వేగాలు అందరికీ నచ్చుతాయి. బాహుబలి అన్ని చోట్ల హిట్ అయింది కదా. స్పైడర్ కూడా అలానే సక్సెస్ అవుతుంది.

స్పైడర్ క్లైమాక్స్ చాలా ప్రత్యేకం

వేరే సినిమా నుంచి స్పైడర్ క్లైమాక్స్ ను తీసుకున్నారనే వార్తలో నిజం లేదు. నా స్టయిల్ మీ అందరికీ తెలుసు కదా. బిగినింగ్ నుంచి కథ ఎలా నడుస్తుందో క్లైమాక్స్ దానికి తగ్గట్టే ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత చివర్లో క్లయిమాక్స్ షూట్ చేశాం. స్టార్టింగ్ లో అనుకున్న క్లైమాక్సే అది. స్పైడర్ లో క్లయిమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. అజిత్ నటించిన వివేకం సినిమాకు స్పైడర్ కు ఎలాంటి పోలికలు లేవు.

ఎస్ జే సూర్యను తీసుకోవడానికి రీజన్

నా సినిమాల్లో విలన్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటాడు. కాకపోతే శారీరంగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో.. మానసికంగా అంతకంటే బలంగా ఉంటాడు. పైగా స్పైడర్ లాంటి సినిమా కోసం ఓ కొత్త విలన్ ను పరిచయం చేయలేను. అలాఅని అప్పటికే పేరున్న నటుడ్ని కూడా తీసుకోలేదు. అందుకే ఎన్నో రకాలుగా ఆలోచించి రెండు పరిశ్రమలకు చెందిన ఎస్ జే సూర్యను విలన్ గా పరిచయం చేశాను. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో-విలన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇద్దరు ఎదురుపడేది మాత్రం క్లయిమాక్స్ లోనే.

ఇది హైదరాబాద్ కథ

క్లైమాక్స్ ను 2-3 లొకేషన్లలో షూట్ చేశాం. కొన్ని షాట్స్ ను చెన్నైలో, మరికొన్ని షాట్స్ ను హైదరాబాద్ లో తీయాల్సి వచ్చింది. దీని కోసం భారీ సెట్ కూడా వేశాం. సినిమా కథ ప్రకారం నైట్ షాట్స్ ఎక్కువగా అవసరం. అందుకే స్పైడర్ కోసం ఎక్కువగా నైట్ షూటింగ్ చేయాల్సి వచ్చింది. దాదాపు 90 రోజులు నైట్ షిఫ్టుల్లో చేశాం. సినిమా కథ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. తమిళ వెర్షన్ కు మార్పులేవీ చేయలేదు. తమిళ వెర్షన్ లో కూడా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే కథను చెప్పాం.

భరత్ పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను

సినిమాలో భరత్ పాత్ర చాలా ప్రత్యేకమైనది, కీలకమైనది. అది ఏంటనేది ముందుగానే చెబితే కిక్ ఉండదు. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మనందరం ఏం చేస్తున్నామో ప్రభుత్వం చూస్తుంది. అలాంటిది ప్రభుత్వం ఏం చేస్తుందో హీరోకు తెలుస్తుంది. ప్రతి మెయిల్, ప్రతి ఫోన్ కాల్ హీరోకు తెలుస్తుంది. అలా వచ్చిన ఓ ఫోన్ కాల్ హీరోను మార్చేస్తుంది. అదే స్పైడర్ సినిమా. ఇది కాల్ టాంపరింగ్ కిందరు రాదు. ప్రతి కాల్ ఆటోమేటిక్ గా హీరోకు వినిపిస్తుంది. ట్రయిలర్ లో అదే విషయం చెప్పాం.

తెలుగు,తమిళ్ లో పెద్ద తేడా అదే

తమిళ, తెలుగు భాషల్లో సినిమా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొన్ని సన్నివేశాల్లో ఆర్టిస్టులు మాత్రం మారతారు. ఇక మహేష్ విషయానికొస్తే.. ఓ కొత్త హీరోను కోలీవుడ్ కు ఎలా పరిచయం చేయాలో స్పైడర్ లో అలా పరిచయం చేశాను. ఇక తెలుగు విషయానికొస్తే ఓ సూపర్ స్టార్ సినిమా ఎలా ఉంటుందో అలా స్పైడర్ ను తీర్చిదిద్దాను. రెండు భాషల్లో సినిమా చూస్తే ఈ రెండు మార్పులు మీకు కనిపిస్తాయి.

అప్ కమింగ్ ప్రాజెక్టులు

ప్రభాస్ కు స్పైడర్ కథ చెప్పాననే వార్తలో నిజంలేదు. ఫ్రెండ్లీగా 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడాను. ఈమధ్య ప్రభాస్ ను అస్సలు కలవలేదు. ఇక రజనీకాంత్ తో సినిమా ఎప్పుడో చెప్పలేను. 2-3సార్లు కలిశాను. కానీ సినిమా ఓకే అవ్వలేదు. ప్రస్తుతానికి విజయ్ సినిమా మాత్రమే నా చేతిలో ఉంది.