మేక సూరి మూవీ రివ్యూ

Published On: August 1, 2020   |   Posted By:

మేక సూరి మూవీ రివ్యూ

రివ్యూ : ‘మేక సూరి’

Rating:-2/5

ఒకప్పుడు ‘ఒక్క చాన్స్‌’ అంటూ ఏళ్ల తరబడి తిరిగే పరిస్దితులు ఇప్పుడు ఓటీటిల పుణ్యమా అని మారుతున్నాయి.  టాలెంట్‌ ఉంటే.. ‘ఓటీటీ’ అద్భుత వేదికగా మారుతోంది. దాంతో కొత్త నీరు ఓటీటీల మీదుగా సినీ పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. ఎన్నో కొత్త తరహా కథలు, తెరపై చెప్పచ్చో లేదో అని ఆలోచిస్తూ ఊగిసలాడేవాళ్లు ఓటీటిలలో దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో వచ్చిందే మేకసూరి. కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో ఓ రా కథతో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మన వాళ్లకు నచ్చుతుంది. కొత్త ప్రతిభ ఏ మేరకు ఈ సినిమాలో ఆవిష్కారమయ్యింది, అసలు కథేంటి, ఈ డిఫరెంట్ టైటిల్ వెనక విషయమేంటో చూద్దాం.

కథేంటి

సూరిది కసాయి (మేక తోలు వలిచి, మాంసం కొట్టే) వృత్తి.  అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తూండటంతో… అతడి పేరు ప్రక్కన ‘మేక’ చేరిపోయింది. అదే ఊళ్లో ఉండే రాణి(సుమయ) అనే అందమైన అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె ఆ ఊళ్లో పెద్దమనిషి అప్పలనాయుడు దగ్గర పనిచేస్తూంటుంది. మొదట్లో సూరిని పట్టించుకోకపోయినా …మెల్లిగా అతనితో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ ఊరిలో మూతి మీద మీసం వచ్చిన కుర్రాడి నుంచి మీసాలకు రంగు వేసుకునే ముసలోళ్ల వరకూ అందరి కన్ను రాణి మీదే! ముఖ్యంగా అప్పలనాయుడు ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు.

ఈ లోగా కొన్ని కారణాలతో అప్పలనాయుడుకి లొంగిపోయి శారీరిక సంభందం పెట్టుకుంటుంది. ఈ విషయం తెలిసిన సూరి అగ్గి మీద గుగ్గిలం అయ్యిపోతాడు. పెద్ద గొడవ అవుతుంది. ఈ లోగా  రాణి ఓ రోజు హత్యకు గురవుతుంది. యాజ్ యూజువల్ గా రాణి హత్య కేసులో సూరిని పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. అసలు రాణిని చంపింది ఎవరు? వాళ్లను సూరి ఎలా ఐడెంటిఫై చేసాడు. అసలు నిజంగానే అప్పలనాయుడుతో ..రాణి సంభందం పెట్టుకుందా.. సూరి తన జీవితాన్ని ఛిన్నాబిన్నం చేసిన  వ్యక్తులపై ఎలా పగతీర్చుకున్నాడు, ఈ కేసులో వీరభద్రం యస్.ఐ పాత్ర ఏమిటి ? అనేది ‘జీ 5’లో చూడాల్సిందే.

కథ,కథనం

విలన్ లాంటివాడు తను ప్రేమించి,పెళ్లాడిన అమ్మాయి కోసం మంచిగా మారటం,  ఆమె మరణం తర్వాత తిరిగి తన పాత రోజుల్లో కి వెళ్లి రెచ్చిపోవటం అనేది  అతి పురాతనమైన కథ. దాదాపు మన పాత తరం హీరోలందరూ చేసిపారేసిన రొట్ట వ్యవహారమే. అయితే దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయటానికి దర్శకుడు ప్రయత్నించాడు. కానీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఈ కథలో చెప్పుకునేందుకు కొత్తగా ఏమీ లేకపోవటం, మెయిన్ ప్లాట్ చాలా పీలగా ఉండటంతో చెప్పుకోదగిన రీతిలో స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్ కుదరలేదు. దానికి తోడు తమిళ సినిమాలను గుర్తు చేస్తూ  పూర్తి ‘రా’ లుక్ తో తెలుగుదనానికి బాగా దూరంగా అనిపిస్తుంది. ఏదో డబ్బంగ్ సినిమా చూసిన ఫీల్ వస్తుంది. కథగా చూస్తే భారీ డ్రామా ఉన్నట్లు,ఓ జీవిత కథ చెప్తున్నట్లు అనిపిస్తుంది. కానీ నమ్మబుద్ది కాదు.  చిన్న తెరపై పెద్ద యాక్షన్ సీన్స్ బాగానే రక్తి కట్టాయి. అంతకు మించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు.

నటీనటులు, దర్శకత్వం

ఈ సినిమా ఎంత పాతగా అనిపించినా, చివరిదాకా చూసేలా ఎంగేజ్ చేసింది సూరిగా చేసిన అభినయ్ నటన. సహజమైన నటనతో మన దృష్టిని ప్రక్కకు తిప్పుకోనివ్వడు. కొన్ని సీన్స్ లో అయితే పీక్స్ కు వెళ్లాడు. ఇక హీరోయిన్ గా చేసిన సమయ…గ్లామర్ సినిమాల్లో అంటే కష్టమే కానీ ఇలాంటి సినిమాలకు మంచి ఆప్షన్. పరిణితితో కూడిన నటనతో కనిపించింది.  విలన్ అప్పలనాయుడు పాత్రలో నటించిన నటుడు కూడా బాగా చేసాడు. యస్.ఐ వీరభద్రంగా నటించిన నటుడు కూడా సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ  రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ …కథగా ఎంగేజ్ చేయలేకపోయినా  ఎమోషన్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుని మలిచాడు దర్శకుడు.  డైలాగులు  కొన్ని చోట్ల బాగున్నాయి. అయితే మరీ హింసపై ఎక్కువ ఆధారపడ్డాడు. కొన్ని చోట్ల అవి శృతి మించి విసిగిస్తాయి.

టెక్నికల్ ..

సినిమా కు ప్రెడిక్టబుల్ గా సాగే స్క్రీన్ ప్లే ..చాలా చప్పగా మార్చేసింది. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చదు. పాటలు జస్ట్ ఓకే.  సినిమాటోగ్రఫీనే హైలెట్ . ఎడిటింగ్ కథలో అక్కర్లేని కొన్ని సీన్స్ ని వదిలేసారనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

చూడచ్చా

ఫ్యామిలీ ప్రేక్షకులకు  కష్టం కానీ, తమిళ రా సినిమాల తరహా థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చతుంది.

ఎవరెవరు..

నటీనటులు : అభినయ్, సమయ, శ్రావణ్, నరేష్ బైరెడ్డి, శరత్ కుమార్ తదితరులు
ఛాయాగ్రహణం: పార్ధు సైనా
 సంగీతం:  ప్రజ్వల్‌ క్రిష్‌
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : త్రినాధ్ వెలిశిల
రన్ టైమ్:86 నిముషాలు
నిర్మాత : కార్తీక్ కంచెర్ల
విడుదల తేదీ: 2020-07-31

విడుదల: ఓటీటి జీ 5