మ‌హానుభావుడు సినిమా రివ్యూ

Published On: September 29, 2017   |   Posted By:

మ‌హానుభావుడు సినిమా రివ్యూ

సంస్థ : యు.వి.క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, మెహ‌రీన్‌, నాజ‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు, న‌ల్ల వేణు, హ‌రితేజ‌, ర‌జిత‌, జెమిని సురేశ్‌ త‌దిత‌రులు
కెమెరా: నిజార్ ష‌ఫి
ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
పాట‌లు : రామ‌జోగయ్య‌శాస్త్రి
సంగీతం: ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌
కో ప్రొడ్యూస‌ర్‌: ఎస్ కే ఎన్‌
ప్రొడ్యూస‌ర్స్ : ప్ర‌మోద్‌, వంశీ
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: మారుతి
Run time:- 146 minutes duration

యువీ క్రియేష‌న్స్ ప‌తాకంపై శ‌ర్వానంద్ న‌టించిన రెండు సినిమాలు `ర‌న్ రాజా ర‌న్‌`, `ఎక్స్ ప్రెస్ రాజా` హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ చిత్రం `మ‌హానుభావుడు`.

అచ్చ‌మైన తెలుగు టైటిల్స్ తో ఆక‌ట్ట‌కుంటున్న మారుతి ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌కు యాడ్ అయ్యాడు. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`లో మ‌తిమ‌రుపు హీరోను చూపించిన ఆయ‌న‌, `మ‌హానుభావుడు`లో ఓసీడీ ల‌క్ష‌ణాలున్న హీరోను చూపించాడు. మ‌ధ్య‌లో `బాబుబంగారం`తో చేసిన జాలి, క‌రుణ ఉన్న పోలీస్ పాత్ర మాత్రం పండ‌లేదు.

ఇంత‌కీ `మ‌హానుభావుడు` ప‌రిస్థితి ఎలా ఉంటుంది? భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌లాగా పండ‌వుతుందా? లేకుంటే `బాబు బంగారం`లాగా దోర‌గానే మిగిలిపోతుందా?.. ఓ లుక్కేసేయండి మ‌రి..

క‌థ‌

త‌ల్లి నీడలో పెరుగుతాడు (ఆనంద్‌). చిన్న‌ప్ప‌టి నుంచీ శుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తాడు. త‌న‌తో పాటు ప‌రిస‌రాలు కూడా ప‌రిశుభ్రంగా ఉండాల‌నుకుంటాడు. త‌న మ‌న‌స్త‌త్వానికి త‌గ్గ‌ట్టే ఏసీ రూమ్‌లో చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఓ ప్రోగ్రామ్‌కి టీమ్ లీడ‌ర్‌గా పనిచేస్తుంటాడు. ఓసారి దారిలో మేఘ‌న (మెహ్రీన్‌)ని చూస్తాడు. స్వ‌చ్ భార‌త్ పేరుతో పిల్ల‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి చెత్త ఊడుస్తుంటే.. మిగిలిన యువ‌కులు బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని ప్ర‌శ్నిస్తుంది మేఘ‌న‌. తన‌లోని క్వాలిటీస్ ఆమెలో కూడా ఉన్న‌ట్టు అనిపించ‌డంతో తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు ఆనంద్‌. ఓ సంద‌ర్భంలో హాస్పిటల్ ముందు మేఘ‌న‌కు ప్రేమ‌ను ప్ర‌పోజ్ చేస్తాడు. అయితే అదే హాస్పిట‌ల్‌కు మేఘ‌న తండ్రిని తీసుకెళ్లాల్సిన ప‌రిస్థితిలో మాత్రం అత‌నిలోని ఓసీడీ కేర‌క్ట‌ర్ డామినేట్ చేసి.. ఆ ప‌ని చేయ‌లేక‌పోతాడు. దాంతో మేఘ‌న ప్రేమ‌కు దూర‌మ‌వుతాడు. కానీ అత‌నిలోని మంచిత‌నాన్ని గుర్తించిన మేఘ‌న తండ్రి వాళ్ల ఊరికి ఆనంద్‌ని కూడా వెంట‌పెట్టుకుని వెళ్తాడు. అక్క‌డ ఆనంద్‌కి అనుకోకుండా కుస్తీ పోటీ ల గురించి తెలిసొస్తుంది. కుస్తీ పో టీల‌కు, ఆనంద్ ప్రేమ జీవితానికి ముడి ప‌డుతుంది. అస‌లు మ‌ట్టిని ద్వేషించే ఆనంద్ మ‌ట్టిలోకి దిగాడా? చివ‌ర‌కు అత‌నిలోని ప్రేమ గెలిచిందా? ఓసీడీ ల‌క్ష‌ణాలు దూర‌మ‌య్యాయా? లేదా? అనే అంశాలు సెకండాఫ్‌లో తెలుస్తాయి.

ప్ల‌స్ పాయింట్స్

మిస్ట‌ర్ క్లీన్ పాత్ర‌లో శ‌ర్వానంద్ చ‌క్క‌గా న‌టించాడు. అత‌ని లేడీ ల‌వ్‌గా మెహ్రీన్ బాగా క‌నిపించింది. మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయిగా కాట‌న్ చుడీదార్ల‌లోనూ, కుర్తీల్లోనూ బాగా క‌నిపించింది. ఇద్ద‌రికీ చేసిన డ్ర‌స్ డిజైనింగ్ బావుంది. ఆనంద్ క‌జిన్‌గా కిశోర్ పాత్ర‌లో వెన్నెల కిశోర్ న‌వ్వులు పూయించారు. జిడ్డిష్ పాత్ర‌లో చేసిన భ‌ద్ర‌మ్ న‌ట‌న కూడా క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. ర‌ఘుబాబు పాత్ర‌, న‌ల్ల‌వేణు పాత్ర‌లు కూడా రిలీఫ్‌నిస్తాయి. స్పెష‌ల్ కామెడీ కాకుండా, హీరో చర్య‌ల‌తోనే కామెడీని పండించాడు ద‌ర్శ‌కుడు. పంచ్ డైలాగులు లేక‌పోయినా, చాలా చోట్ల ప్రేక్ష‌కుడు సినిమాకు క‌నెక్ట్ అవుతాడు

మైన‌స్ పాయింట్స్

మ‌హానుభావుడివేరా.. అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా సంద‌ర్భాల్లో చికాకు పుట్టిస్తుంది. త‌మ‌న్ తెలుగువాడై ఉండి.. రాగాల్లో కుదించ‌డానికి తెలుగు దీర్ఘాక్ష‌రాల‌ను హ్ర‌స్వాలుగా ప‌లికించ‌డం బాధ‌క‌లిగిస్తుంది. పాట‌లు కూడా పెద్ద‌గా గుర్తుపెట్టుకునేలా అనిపించ‌వు. క్లైమాక్స్ స‌న్నివేశాలు పేల‌వంగా అనిపిస్తాయి. క‌థ‌లో అనూహ్య‌మైన ట్విస్టులు అనిపించ‌వు. సో క‌థ ఫ్లాట్‌గా సాగిపోతుంది.

వివ‌ర‌ణః

ముందుగా సినిమాలో పాత్ర‌లు వాటి తీరు తెన్నుల గురించి చూస్తే మాట్లాడుకోవాలి. శ‌ర్వానంద్ మ‌రోసారి కొత్త పాత్ర‌లో తెర‌పై క‌న‌ప‌డ్డాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే పాత్ర‌లో ఎక్క‌డా ఓవ‌ర్ హీరోయిజాన్ని చూపించాలనుకోకుండా కొత్త‌ద‌నం ఉండ‌టంతో, పాత్ర‌కు న్యాయం చేయాల‌నే ఆలోచ‌న‌తో సినిమా చేయ‌డానికి శ‌ర్వానంద్ ఒప్పుకోవ‌డం మంచి ప‌రిణామ‌మే. క‌థ డిమాండ్ మేర‌కు శ‌ర్వానంద్ త‌న పాత్ర‌లో ఒదిగిపోయాడు. అతిశుభ్ర‌త గ‌ల వ్య‌క్తి ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడు అనే సీన్స్‌లో శ‌ర్వానంద్ చ‌క్క‌గా న‌టించాడు.

అలాగే త‌న ప్రేమ కోసం పోటీలో గెలిచే సంద‌ర్భంలో కూడా శ‌ర్వానంద్ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక మెహరీన్ హీరోయిన్‌గా చేసిన రెండో సినిమా ఇది. మేఘ‌న పాత్ర‌లో మెహ‌రీన్ చ‌క్క‌గా న‌టించింది. ఇక సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించిన వెన్నెల‌కిషోర్ కామెడీ క్రియేట్ కావ‌డంలో త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. నాజ‌ర్ కుటుంబ పెద్ద‌గా, ఊరి పెద్ద‌గా చాలా సినిమాల్లో న‌టించ‌డం వ‌ల్ల ఈ పాత్ర‌ను సునాయ‌సంగా చేసేశాడు. భ‌ద్ర‌మ్‌, ర‌ఘుబాబు స‌హా సినిమాలో న‌టించిన వారంద‌రూ చ‌క్క‌గా న‌టించారు.

ఇక సాంకేతిక విష‌యాల‌కు వ‌స్తే, గ‌తంలో డిసార్డ‌ర్‌తో బాధ‌పడే హీరో క్యారెక్ట‌ర్‌ను తెర‌పై చ‌క్క‌గా ఎలివేట్ చేసి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అని స‌క్సెస్ కొట్టిన మారుతి. ఓసీడీ అనే కొత్త పాయింట్‌తో క‌థ‌ను రాసుకున్నాడు. క‌థ‌నంలో కొత్త‌ద‌నం లేక‌పోయినా, హీరో క్యారెక్టరైజేష‌న్‌ను చ‌క్క‌గా డిజైన్ చేసి త‌ద్వారా చక్క‌టి కామెడీని జ‌న‌రేట్ చేశాడు. థ‌మ‌న్ సంగీతం పెద్ద‌గా మెప్పించ‌లేక‌పోయింది. న‌జ‌ర్ ష‌ఫీ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిటింగ్ బావుంది. మొత్తంగా చూస్తే సినిమాను అంద‌రూ ఎంజాయ్ చేస్తారు.

చివ‌ర‌గా…మ‌హానుభావుడు…క‌డుప‌బ్బా న‌వ్విస్తాడు

రేటింగ్ః 3/5