యాక్సిడెంట్ పై వివరణ ఇచ్చిన మంచు విష్ణు

Published On: August 7, 2017   |   Posted By:
యాక్సిడెంట్ పై వివరణ ఇచ్చిన మంచు విష్ణు
ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో భాగంగా హీరో మంచు విష్ణు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మలేషియాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా.. ఊహించని విధంగా ప్రమాదం జరిగి హాస్పిటల్ పాలయ్యాడు ఈ మంచు హీరో. 6 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకులముందుకొచ్చాడు ఈ హీరో. తనకు యాక్సిడెంట్ ఎందుకైంది.. ఎలా అయింది లాంటి విషయాల్ని షేర్ చేసుకున్నాడు. మంచు విష్ణు ఏమన్నాడో.. అతడి మాటల్లోనే చూద్దాం..
“ఎంతోమంది నాకు ఫోన్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. అమ్మ, నాన్న, విన్నీ, అక్క, తమ్ముడికి సారీ చెబుతున్నా. ఎందుకంటే, నేను తీసుకోని ఓ చిన్న జాగ్రత్త వల్ల వీళ్లంతా చాలా బాధపడ్డారు. వాళ్లతో పాటు నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అంతా కంగారుపడ్డారు. అందరికీ క్షమాపణలు కోరుతున్నాను. మీకు 2-3 రోజుల్లో ఆ యాక్సిడెంట్ వీడియోను కూడా విడుదల చేస్తాం. అది చూస్తే మీకు తెలుస్తుంది.. జరిగిన ప్రమాదంలో నా తప్పు ఏం లేదు. యాక్షన్ సీక్వెన్స్ లో నేను తీసుకునే ప్రికాషన్స్ చూసి అంతా ఎగతాళి చేస్తుంటారు. అంత జాగ్రత్తగా ఉన్న నాకు ఈ యాక్సిడెంట్ అవ్వడం దురదృష్టకరం. గడిచిన 15 ఏళ్లుగా నేను స్టంట్ మాస్టర్ గా ట్రయినింగ్ తీసుకుంటూనే ఉన్నాను. అందుకే చాలా తక్కువ దెబ్బలతో బయటపడగలిగాను. నాపై ఇంత ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్.”
విష్ణుకు తగిలిన గాయాల్లో భుజానికి తగిలిన దెబ్బ మాత్రమే పెద్దది. దానికి సర్జరీ చేయాలా వద్దా అనే విషయాన్ని ఓ 2 రోజుల్లో డాక్టర్లు తేలుస్తారు.