‘రాజావారు – రాణిగారు’ సినిమా రివ్యూ

Published On: November 30, 2019   |   Posted By:

‘రాజావారు – రాణిగారు’ సినిమా రివ్యూ

ఆ రోజుల్లో ఆగిన…(‘రాజావారు – రాణిగారు’ రివ్యూ)

Rating: 2/5

అప్పుడెప్పుడో ‘హృదయం’ అనే సినిమా తమిళంలో వచ్చేసి,తెలుగులోనూ సూపర్ హిట్ కొట్టేసింది.  ఓ కుర్రాడు తను ప్రేమించే అమ్మాయికి  ఐ లవ్యూ యు…డు యు లవ్ మి అని అడగాలని, అందుకు తగ్గ ధైర్యం లేక మనస్సులోనే తెగ మధనపడిపోయే సినిమా అది. హీరాని పరిచయం చేస్తూ వచ్చిన ఆ సినిమా ఓ జనరేషన్ ని ఊపేసింది. ఆ తర్వాత దాదాపు అదే లైన్ ని పవన్ కళ్యాణ్ మ్యాజిక్ తో కలిపి తొలి ప్రేమగా మన ముందుకు తీసుకువచ్చారు. హృదయం దర్శకుడు కదిర్ శిష్యుడు కరుణాకరన్. మళ్లీ ఇంతకాలానికి అలాంటి వన్ సైడ్ ప్రేమ కథని తెరమీదకు తెచ్చాడో కొత్త దర్శకుడు. మరీ ఈ కాలానికి ఇలాంటి కథలు బాగుండవు అనుకున్నాడో ఏమో… ఆ కాలంలోనే కథను సెట్ చేసాడు. మరి ఈ కాలం కుర్రాళ్లను హృదయాలను  ఈ కొత్త హృదయం పట్టుకోగలిగిందా…తొలిప్రేమ నాటి మ్యాజిక్ జరిగిందా… సినిమా స్టోరీ లైన్ ఏంటి వంటి విషయాలు చూద్దాం.

స్టోరై లైన్…

గోదారి ఒడ్డున ఉన్న రామాపురం అనే పల్లెలో ఉన్న రాజా (కిర‌ణ్‌)కి రాణీ (ర‌హ‌స్య గోర‌క్‌) అంటే మనసంతా నువ్వే. చిన్నప్పటి నుంచి ఆమె వెంటే తిరుగుతాడు … కానీ  నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మ‌న‌సులో మాట చెప్పలేని బలహీనత. ఇతగాడు ఐలవ్యూ చెప్పలేదు కదా ఆమె అక్కడే వెయిట్ చేస్తూ ఉండలేదు కదా…రాణీ పై చ‌దువుల కోసం అమ్మమ్మగారి ఊరెళ్లిపోయింది. పోనీ ఆ ఊరు వెళ్లి తన ప్రేమ విషయం చెప్తాడేమో అనుకుంటే… అదీ చేయడు..తన ఊళ్లోనే ప్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూ మధ్య మధ్యలో ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ, అవకాసం ఉంటే పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తూంటాడు. ఈ క్రమంలో  మూడేళ్లు గడిచాయి. ఈ సారి అయినా అతను తన మనస్సులో మాట చెప్తాడేమో అన్నటట్లుగా… ఆమె  మ‌ళ్లీ సొంత ఊరు తిరిగొచ్చింది. ఇప్పుడైనా రాజావారు తన మనస్సులో కొలువైన రాణిగారికి ప్రేమ విషయం చెప్పగలుగుతాడా…వయస్సు అయ్యిపోయేదాకా వెయిట్ చేస్తాడా… అనేది తెలియాలంటే  ‘రాజావారు – రాణీగారు’ సినిమా చూడాల్సిందే.

కథ,కధనం ఎలా ఉన్నాయంటే…

హీరో తన మనస్సులో ప్రేమను తను ప్రేమించే హీరోయిన్ కు చెప్పలేక మూగగా ఆరాధించే చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అయితే అది ఎంత అందంగా , బోర్ కొట్టని స్క్రీన్ ప్లే చెప్పారో అన్న విషయమై సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది.  ఈ సినిమా ఒకే పాయింట్ చుట్టూ తిరిగినా … చాలా భాగం ఎంటర్టైన్మెంట్ తో లాగెయ్యాలని చూసాడు. ముఖ్యంగా చక్కటి విలేజ్ విజువల్స్, ఫన్నీ డైలాగ్స్ తో తన ప్రతిభను చూపించాడు. అయితే ఫస్టాఫ్ లో అది వర్కవుట్ అయ్యింది కానీ, సెకండాఫ్ లోనూ ఎక్కడా చిన్న మలుపు కూడా లేకుండా మళ్లీ అవే సీన్స్ రిపీట్ అవటంతో కాస్త విసుగు మొదలవుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే హీరోయిన్ బావ ఎపిసోడ్ అయితే ఎన్నో సినిమాల్లో చూసిందే కావటంతో పరమ రొటీన్ గా అనిపిస్తుంది.  అయితే క్లైమాక్స్ కాస్తంత ఎమోషన్ రైజ్ చేయటంతో కాస్తంత రిలీఫ్.  ఇలాంటి సినిమాలకు ఎంత కాదనుకున్నా సినిమాటెక్ గ్రామర్ అవసరం. స్క్రీన్ ప్లేని చిన్న చిన్నవి అయినా మలుపులు తీసుకుని రాసుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలాగే ప్లాట్ గా మారి చూసేవాళ్లకు పాట్లుగా తయారువుతుంది. అలాగే లవ్ స్టోరీ అనగానే స్లో నేరేషన్ లో నడపాలనే కోరికను చంపుకోవాలి. లేకపోతే ఈ స్పీడు జనరేషన్ ని ఎంగేజ్ చేయటం కష్టమవుతుంది.

నటీనటులు, సాంకేతిక వర్గం

దర్శకుడు తన తొలి సినిమాని మంచి పరిణితి తో తీసాడని చెప్పచ్చు. చాలా నేచరల్ లా మన కళ్లెదురుగా ఓ విలేజ్ ఎట్మాస్మియర్ ని సాక్షాత్కరింపచేస్తాడు. నటీనటులు కొత్తవాళ్లైనా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఇలాంటి సినిమాలకు సంగీతం,కెమెరా వర్క్ ప్రాణం. ఈ రెండు విభాగాలు న్యాయం చేసాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది.

చూడచ్చా…

పల్లెటూరి లవ్ స్టోరీ లు చూసి చాలా కాలం అయ్యిదనుకునేవాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్.

ఎవరెవరు..

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరక్‌, రాజ్‌కుమార్‌ కాసిరెడ్డి, యజుర్వేద్‌ గుర్రం, తదితరులు
కథ, దర్శకత్వం: రవికిరణ్‌ కోలా
నిర్మాత: మనోవికాస్‌
సంగీతం: జై క్రిష్‌
విడుదల తేదీ: 29-11-2019