రాజా ది గ్రేట్ మూవీ రివ్యూ

Published On: October 18, 2017   |   Posted By:

రాజా ది గ్రేట్ మూవీ రివ్యూ

 

నటీనటులు – రవితేజ, మెహరీన్‌, ప్రకాష్‌ రాజ్‌, రాధికా శరత్‌కుమార్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు

సమర్పణః దిల్‌రాజు

సంగీతంః సాయికార్తీక్‌

సినిమాటోగ్రఫీః మోహనకృష్ణ

ఎడిటింగ్‌: తిమ్మరాజు

ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌

ఫైట్స్‌: వెంకట్‌

సహ నిర్మాతః హర్షిత్‌ రెడ్డి

నిర్మాతః శిరీష్‌

దర్శకత్వంః అనిల్‌ రావిపూడి

రన్ టైం: 149 నిమిషాలు

రిలీజ్ డేట్ :  18-10-2017

మాస్ రాజా కెరీర్ లో రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఇలాంటి టైమ్ లో అంధుడి పాత్రతో రవితేజ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అంతా ఇలానే షాకయ్యారు. కానీ రవితేజ మాత్రం తన మార్క్ మిస్ అవ్వలేదు. వినోదానికి విరామం ఇవ్వలేదు. పేరుకు అంధుడి పాత్రే అయినా రాజా ది గ్రేట్ మాత్రం ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ

పుట్టుకతోనే అంధుడైన రాజా ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు. తల్లి కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉండడంతో కొడుకు రాజాను డిపార్ట్ మెంట్ లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తుంటుంది. కానీ కళ్లు లేకపోవడంతో రాజా పోలీస్ కాలేకపోతాడు. కానీ కళ్లులేకపోయినా అద్భుతమైన తెలివితేటలు, సమయస్ఫూర్తితో ది బెస్ట్ కబడ్డీ ప్లేయర్ గా ఎదుగుతాడు రాజా. తనకు కళ్లులేకపోయినా స్టయిలిష్ గా ముస్తాబవుతాడు. చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు.

అదే టైమ్ లో సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన ప్రకాష్ రాజ్ భువనగిరి ట్రాన్సఫర్ అవుతాడు. గూండాలను ఎదిరించే క్రమంలో హత్యకు గురవుతాడు. ప్రకాష్ రాజ్ ను చంపిన విలన్లు, శత్రుశేషం ఉండకూడదనే ఉద్దేశంతో అతడి కూతురు లక్కీ (మెహ్రీన్)ను కూడా హతమార్చాలని చూస్తారు. విలన్ల నుంచి తప్పించుకున్న మెహ్రీన్, డార్జిలింగ్ పారిపోయి రాజేంద్రప్రసాద్ ఇంట్లో తలదాచుకుంటుంది. ప్రకాష్ రాజ్ హత్య కేసును ఛేదించే ఆపరేషన్ చేపడుతుంది డిపార్ట్ మెంట్. అదే ఆపరేషన్ ను రాజా కూడా సొంతంగా హ్యాండిల్ చేస్తాడు. హీరోయిన్ కోసం డార్జిలింగ్ వెళ్తాడు. ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. ఫైనల్ గా విలన్ల బారి నుంచి హీరోయిన్ ను రాజా కాపాడగలిగాడా.. అసలు హీరోయిన్ కుటుంబానికి, రాజాకు సంబంధం ఏంటనేది బ్యాలెన్స్ స్టోరీ.

ప్లస్ పాయింట్స్

–       రవితేజ పర్ఫార్మెన్స్

–       కామెడీ సీన్లు (మరీ ముఖ్యంగా గున్నమామిడి కామెడీ)

–       రాధికతో వచ్చే ఎమోషనల్ సీన్సు

–       ప్రీ-క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

–       కథలో కొత్తదనం లేకపోవడం

–       సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోకపోవడం

–       అంధుడి పాత్రతో మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం (కొన్ని సీన్లు మరీ అతి అనిపిస్తాయి)

–       ఫస్ట్ ఫైట్ లో హింస ఎక్కువగా ఉండడం

–       నిడివి కాస్త ఎక్కువైన ఫీలింగ్ కలగడం

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ

ఇప్పటివరకు ఇలాంటి స్టోరీని ఎవరూ టచ్ చేయలేదని చెప్పుకొచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కానీ రాజా ది గ్రేట్ సినిమా కథలో కొత్తదనం ఏం లేదు. హీరోకు అంధత్వం అనే యంగిల్ జోడించకపోతే పరమ రొటీన్ సినిమాగా మారిపోయేది రాజా ది గ్రేట్. అలా రొటీన్ కాకుండా నిలిపిన అంశం అంధత్వం అయితే.. ఆ పాత్రను రవితేజ పోషించిన తీరు ఓ అద్భతమనే చెప్పాలి. రవితేజ ఎందుకు కనెక్ట్ అయ్యాడో, ఎక్కడ కనెక్ట్ అయ్యాడో తెలీదు కానీ.. రాజా పాత్రను అతడు పోషించిన విధానం అద్భుతమనే చెప్పాలి. సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ ఈ క్యారెక్టరే.

బ్లయిండ్ పాత్రతో సినిమాను ఎంటర్ టైనింగ్ గా మలిచిన తీరు చాలా బాగుంది. గతంలో అంధగాడు సినిమాలో రాజ్ తరుణ్ కాసేపు అంధుడిగా కనిపించి వినోదం పంచాడు. ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినోదం పంచాడు. ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు, సెకెండాఫ్ స్టార్టింగ్ లో ఓ అర్థగంట సేపు కామెడీ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాయి. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ స్టార్టింగ్ లో వచ్చిన గున్నా మామిడి సాంగ్ తో చేసిన కామెడీ టోటల్ మూవీకే హైలెట్ గా నిలిచింది.

రవితేజతో పాటు రాధిక, మెహ్రీన్, ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి, రాజేంద్రప్రసాద్, ఫృధ్వి, పోసాని తమ పాత్రలకు తగ్గట్టు చక్కగా నటించారు. సినిమాలో పాపులర్ నటీనటులు చాలామంది ఉన్నారు. అది కూడా ఈ మూవీకి ఓ అడ్వాంటేజ్ అని చెప్పాలి.

టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. మోహనకృష్ణ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్, సాయికార్తీక్ రీ-రికార్డింగ్ సినిమాకు ప్లస్ గా మారాయి. మరీ ముఖ్యంగా డార్జిలింగ్ అందాల్ని చూపించడంలో, కబడ్డీ మ్యాచ్ లో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

సినిమాకు అన్నీ కుదిరినప్పటికీ.. ఓవర్ ది బోర్డ్ వెళ్లిన విషయం మాత్రం అక్కడక్కడ తెలుస్తూనే ఉంది. అంధుడి క్యారెక్టర్ అనేది సినిమాకు ఎంత ప్లస్ అయిందో.. కథలో అక్కడక్కడ అదే పెద్ద మైనస్ గా కూడా మారింది. ప్రీ-క్లయిమాక్స్ తో పాటు మరికొన్ని సన్నివేశాల్లో అంధుడి పాత్ర మరీ అతిగా అనిపిస్తుంది. దీనికి తోడు ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు, బ్యాంక్ దోపిడీ సన్నివేశాలు పండలేదు. ఎడిటింగ్ చాలా పేలవంగా ఉంది. మరీ ముఖ్యంగా రన్ టైమ్ ను దాదాపు 20 నిమిషాలు తీసేయొచ్చు.

ఈ బలహీనతల్ని పక్కనపెడితే.. రెండేళ్ల తర్వాత రవితేజ నుంచి ఓ కొత్త సినిమా వచ్చింది. ఇప్పటివరకు చేయని పాత్ర చేశాడు.. 2 గంటల పాటు హ్యాపీగా చూసే వినోదం ఉంది. వీటికి తోడు థియేటర్లలో భారీ గ్యాప్ ఉంది. కాబట్టి ఈ రాజా.. ది గ్రేట్ అనిపించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

 

రేటింగ్ : 3/5