రాజుగారి గది-2 రివ్యూ

Published On: October 13, 2017   |   Posted By:

రాజుగారి గది-2 రివ్యూ

నటీనటులు : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్,షకలక శంకర్, నరేష్, రావురమేష్, విద్యుల్లేఖ

మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్

బ్యానర్లు : పీవీపీ సినిమాస్, ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్

మాటలు: అబ్బూరి రవి

సినిమాటోగ్రఫీ: ఆర్‌.దివాకరన్‌

ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌

స్క్రీన్ ప్లే,దర్శకత్వం : ఓంకార్

నిర్మాతలు : ప్రసాద్ వి పొట్లూరి, కెవిన్ అన్నే

విడుద‌ల తేది: 13.10.17

వ్య‌వ‌థి: 127 నిమిషాలు

ఫస్ట్ టైం హారర్ జానర్ లో నాగార్జున నటించిన సినిమా రాజుగారి గది-2. దీనికి తోడు నాగ్ కొత్తకోడలు సమంత ఓ కీలక పాత్ర పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన రాజుగారి గది-2 సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ

జీవితంలో బాగా స్థిరపడాలని భావించే అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్.. డబ్బులుపెట్టి ఓ విల్లా కొంటారు. గోవాలోని ఓ రాజుగారికి చెందిన ఆ విల్లాను కొని, రిసార్ట్ గా మార్చి వ్యాపారం ప్రారంభిస్తారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న టైమ్ లో రిసార్ట్ లో దెయ్యం ఉందనే విషయం ఒక్కొక్కరికి అర్థమౌతుంది. అలా ముగ్గురు స్నేహితులు దెయ్యం ఉందని ఫిక్స్ అయిన తర్వాత ఓ చర్చి ఫాదర్ ద్వారా రుద్ర (నాగార్జున) అనే మెంటలిస్ట్ ను ఆశ్రయిస్తాడు. అలా రిసార్ట్ లోకి ఎంటరైన రుద్ర అసలు ఏం చేశాడు.. ఆత్మ గురించి ఏం తెలుసుకున్నాడు.. చివరికి ఆ ఆత్మ పగను ఎలా చల్లార్చాడనేది స్టోరీ.

బలాలు:

–       మెంటలిస్ట్ గా నాగార్జున నటన

–       ఆత్మగా సమంత యాక్టింగ్

–       తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

–       సినిమాటోగ్రఫీ

–       నిర్మాణ విలువలు

బలహీనతలు:

–       ఊహించగలిగే విధంగా ఉండే కథ

–       స్క్రీన్ ప్లేలో లోపాలు

–       కామెడీ పండకపోవడం

–       అనవసరపు పాత్రలు

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ

సంచలనం సృష్టించిన సుచిలీక్స్ నేపథ్యంలో రాసుకున్న కథ రాజుగారి గది-2. ఆత్మగౌరవం కలిగిన ఓ మంచి అమ్మాయిని రహస్యంగా షూట్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఆ అమ్మాయి పడే బాధ ఏంటనేది ఈ సినిమాలో చూపించారు. అదే ఈ సినిమాలో సందేశం కూడా. అమృత అనే అమ్మాయిగా సమంత ఇందులో చక్కగా నటించింది. లాయర్ కావాలనుకున్న ఆమె కోరిక ఎందుకు నెరవేరలేదు.. ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక రుద్ర పాత్రలో నాగార్జున చక్కగా నటించారు. తన పాతికేళ్ల అనుభవం అంతా ఈ పాత్రలో చూపించారు. నాగ్, సమంతతో పాటు వెన్నెల కిషోర్, ప్రవీణ్, రావు రమేష్, నరేష్, షకలక శంకర్ తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ గా ఈ సినిమాను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కీలకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో రాజుగారి గది-2కు వందకు వంద మార్కులు ఇచ్చేయొచ్చు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. దివాకర్ సినిమాటోగ్రఫీ, ఏ.ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్, ముంబయి టీం చేసిన గ్రాఫిక్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా నీటితో గ్రాఫిక్స్ చూపించిన విధానం బాగుంది. పాటలు తగ్గించి టోటల్ గా కథ, స్క్రీన్ ప్లే పైనే దృష్టిపెట్టి సినిమాను జస్ట్ 2 గంటల్లోనే ముగించడం మంచి ఎత్తుగడ.

ఓవరాల్ గా రాజుగారి గది-2 సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి. మంచి బ్యానర్, స్టార్ నటీనటులు, మ్యూజిక్ డైరక్టర్, గ్రాఫిక్స్.. ఇలా అన్ని హంగులు కుదిరాయి. కానీ ఇలాంటి సినిమాకు పరిథి తక్కువ. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఇలాంటి స్టోరీతో ఎట్రాక్ట్ చేయడం కష్టం. హారర్, సస్పెన్స్ మూవీస్ ఇష్టపడేవాళ్లను మాత్రం రాజుగారి గది-2 వందశాతం తృప్తి పరుస్తుంది. యూనిట్ ఆశిస్తున్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎంత మేరకు వస్తారనేది రాబోయే రోజుల్లో తేలాల్సిన అంశం. ఫైనల్ గా.. మామకోడళ్లు నాగ్-సమంత కోసం రాజుగారి గది-2ను తప్పకుండా చూడాలి.

రేటింగ్ – 3/5